Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhishma Niti: శత్రువైనా సరే కష్టంలో ఉన్నానంటూ మనదగ్గరకు వస్తే.. సాయం చేయాలంటున్న భీష్ముడు

Bhishma Niti: మహాభారతం నేటి మానవుడికి మంచి చెడులను గురించి వివరించేది పవిత్ర గ్రంథం. ప్రతి పర్యంలోనూ అద్భుతమైన నీతిని అందించే కథలెన్నో ఉన్నాయి. పంచమవేదంగా కీర్తిగాంచిన..

Bhishma Niti: శత్రువైనా సరే కష్టంలో ఉన్నానంటూ మనదగ్గరకు వస్తే.. సాయం చేయాలంటున్న భీష్ముడు
Bhishma Niti
Follow us
Surya Kala

|

Updated on: Oct 01, 2021 | 6:53 AM

Bhishma Niti: మహాభారతం నేటి మానవుడికి మంచి చెడులను గురించి వివరించేది పవిత్ర గ్రంథం. ప్రతి పర్యంలోనూ అద్భుతమైన నీతిని అందించే కథలెన్నో ఉన్నాయి. పంచమవేదంగా కీర్తిగాంచిన మహాభారతంలో విశిష్టమైన వ్యక్తి అష్టవసువులలో అగ్రగణ్యుడు.. గంగాపుత్రుడవు భీష్ముడు. కౌరవుల పక్షాన కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని..  గాయపడి అంపశయ్యమీద ఓఘవతీ తీరంలో పడి ఉన్నాడు. ఆ సమయంలో  భీష్ముడు పాండవులకు ఎన్నో నీతికథలను చెప్పాడు. అవన్నీ శాంతిపర్వం అనే అధ్యాయంలో రాజనీతి, గృహస్థు ధర్మం, వ్యక్తిత్వం వంటి అనేక అంశాల మీద కథల కనిపిస్తాయి. క్షత్రియుడిగా జన్మించి బ్రహ్మచర్యం అవలంబించి రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచి అరుదైన వ్యకిత్వం కలిగి అంపశయ్య మీద ఉన్న భీష్ముడు పాండవులకు చేసిన ఈ ఉపదేశాలు ప్రతి ఒక్కరికీ ఉపయుక్తంగా ఉంటాయి. వాటి ఓ ముఖ్యమైన కథే వేటగాడు- పావురాళ్ల కథ.

ఒక బోయవాడు అడవిలోని పక్షుల మీద ఆధారపడి జీవిస్తుండేవాడు. నిత్యం అడవికి వెళ్తూ అక్కడ పక్షుల కోసం వల వేసేవాడు. తన వలలో చిక్కిన పక్షులు కొన్నింటినితో తన కడుపు నింపుకొని, మిగతావాటిని అమ్ముకుని రోజు తన జీవితాన్ని సంతోషంగా గడిపేవాడు. ఒక రోజు వేటగాడు ఎప్పటిలాగానే వల పన్నాడు. ఆ వలలో కావల్సినన్ని పక్షులు చిక్కుకున్నాయి. ఇక వాటిని తీసుకుని ఇంటికి బయల్దేరదామనుకునేలోగా తీవ్రమైన గాలివాన మొదలైంది. ఒక పక్క వర్షం, దానికి తోడు గజగజా వణికించేస్తున్న చలి. ఆ చలిలో తడిసిముద్దయిపోతూ వేటగాడు ఓ పెద్ద చెట్టు కింద నిలబడ్డాడు.

వేటగాడు నిలబడిన చెట్టు మీద ఒక పావురాల జంట నివసిస్తోంది. ఆ రోజు ఉదయం వేటకని బయల్దేరిన ఆడపావురం ఇంకా గూటికి చేరుకోనేలేదు. ఇంకా తిరిగిరాని తన భార్య గురించి గూటిలోని మగపావురం తపించిపోసాగింది.’ఇంత చీకట్లో.. భారీ వర్షంలో, రక్తం గడ్డకట్టుకుపోయే చలిలో తన భార్య ఏ కష్టం పడుతోందో.. ‘ అని మగపావురం తల్లడిల్లిపోతోంది. తన భార్య లేని జీవితం వృథా కదా అని వేదన పడుతోంది. ఇంతకీ ఆ ఆడపావురం ఎక్కడో లేదు.. చెట్టు కింద నిలబడి ఉన్న వేటగాడి వలలో మిగతా పక్షులతో పాటు అది కూడా చిక్కుకొని ఉంది.

వేటగాడి వలలో ఉన్న ఆడపావురం భర్త వేదనను విని..  వెంటనే .. నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు నాకోసం పడుతున్న తపన చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఏం చేస్తాం. విధిరాతను తప్పించలేం కదా! కానీ ఇదిగో ఈ చెట్టు కింద ఉన్న వేటగాడు ప్రస్తుతం మన అతిథి. అతనికి ఏ లోటూ రాకుండా చూసుకోవడం మన బాధ్యత, అని మగపావురంతో పలికింది. భార్య మాటలు విన్న పావురం కిందకి చూసింది. అక్కడ నిజంగానే ఒక వేటగాడు గజగజా వణికిపోతూ కనిపించాడు. ‘‘అయ్యా! నా భార్య చెప్పిన మాట నిజమే! మీరు ఇవాళ మా అతిథి. మీకేం కావాలో సెలవియ్యండి,’’ అని అడిగింది పావురం.

వెంటనే వేటాడు.. నేను చలికి తట్టుకోలేకపోతున్నా.. నన్ను ఈ చలి నుంచి కాపాడు అని కోరాడు. వెంటనే పావురం దగ్గరలోని పుల్లల్ని ఏరుకుని తెచ్చి మంట వేసి.. వేటగాడి చలిని తీర్చింది. చలి తగ్గిన తర్వాత వేటగాడికి ఆకలి వేయడం మొదలైంది. దీంతో ఆ పావురం.. వేటగాడి ఆకలితీర్చడానికి అయ్యా మా దగ్గర ఆహారం నిల్వ ఉండదు.. అయితే మీకు ఎలాగా పక్షులను తినే అలవాటు ఉందికనుక.. నన్ను తినండి.. అంటూ ఒక్కసారిగా మంటల్లో దూకింది. అది చూసిన వేటగాడి మనసు కరిగింది. పావురం చూపిన అతిథిమర్యాద, త్యాగం వేటగాడిని కదిలించాయి. అప్పుడు తాను ఇన్నిరోజులు చేసిన పని ఎంత పాపమో అంటూ .. వలలో చిక్కుకున్న పావురాలను వెంటనే వదిలేశాడు.  అయితే ఆడపావురం భర్త లేని జీవితం తనకు ఒద్దు అనుకుంటూ.. మగపావురం దూకిన మంటల్లోనే ఆడపావురం దూకి ప్రాణాలు తీసుకుంది. అది చూసిన వేటగాడు మనసు కరిగింది.. విరాగిలా మారిపోయాడు.  మన ఇంటి ముందు శత్రువైనా సరే కష్టంలో ఉన్నానంటూ మనదగ్గరకు వస్తే.. సాయం చేయాలని.. అదే ధర్మమని భీష్ముడు పాండవులకు చెప్పాడు.  భీష్ముడి హితబోధలు అర్థం చేసుకుని అనుసరించినవారు జీవించినంతకాలం మంచి పనులు చేస్తూ.. జీవితాన్ని తీర్చిదిద్దుకుని భగవంతుడి కృపకు పాత్రులవుతారు.

Also Read: అక్టోబర్ నెలలో వచ్చే ప్రముఖ హిందూ పండగ తేదీలు.. విశిష్టత