AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: అత్తింటి నగరం అయోధ్యను సీతాదేవి ఎందుకు శపించింది. చివరకు ఇలా విమోచనం లభించిందా..?

తీర్థ యాత్రలు చేసేవారికి ఉత్తర్‌ప్రదేశ్ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే నగరాలు కాశీ, మథుర. పురాణేతిహాస కాలం నుంచి కాశీ నగరం ప్రస్తావన ఉంది. కాశీ మజిలీ కథలు అంటూ తెలుగులోనూ బోలెడు కథలున్నాయి. కాశీకి పోయినా.. కాటికి పోయినా ఒక్కటే అన్న సామెతలు కూడా ఉన్నాయి. అలాగే శ్రీకృష్ణ జన్మస్థానం మథుర గురించి కూడా కావాల్సినన్ని ఇతిహాసపు కథలున్నాయి.

Ayodhya: అత్తింటి నగరం అయోధ్యను సీతాదేవి ఎందుకు శపించింది. చివరకు ఇలా విమోచనం లభించిందా..?
Ayodhya Ram Mandir
Mahatma Kodiyar
| Edited By: Balaraju Goud|

Updated on: Jan 27, 2024 | 8:28 PM

Share

తీర్థ యాత్రలు చేసేవారికి ఉత్తర్‌ప్రదేశ్ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే నగరాలు కాశీ, మథుర. పురాణేతిహాస కాలం నుంచి కాశీ నగరం ప్రస్తావన ఉంది. కాశీ మజిలీ కథలు అంటూ తెలుగులోనూ బోలెడు కథలున్నాయి. కాశీకి పోయినా.. కాటికి పోయినా ఒక్కటే అన్న సామెతలు కూడా ఉన్నాయి. అలాగే శ్రీకృష్ణ జన్మస్థానం మథుర గురించి కూడా కావాల్సినన్ని ఇతిహాసపు కథలున్నాయి. ఈ రెండు నగరాలతో పాటు త్రేతాయుగం నుంచి ఉన్న అయోధ్య నగరం కూడా ఉత్తర్‌ప్రదేశ్‌లోనే ఉన్నప్పటికీ.. కాశీ, మథుర నగరాలకు ఉన్నంత ఆకర్షణ, చైతన్యం అయోధ్యకు ఇంతకాలం లేవు. రామజన్మభూమి కాబట్టి కాశీ, ప్రయాగ వెళ్లేవారిలో కొందరు అయోధ్యను కూడా సందర్శించేవారు. అంతే తప్ప అయోధ్య కోసం ప్రత్యేకంగా యాత్ర చేపట్టే సందర్భాలు చాలా చాలా అరుదు.

హిందూ మతంతో పాటు బౌద్ధ, జైన మతాలకు కూడా కేంద్ర బిందువుగా విలసిల్లసిన ఒకప్పటి మహానగరం కొన్ని శతాబ్దాలుగా నిస్తేజంగా, నిర్జీవంగా పడి ఉంది. అందుకే కాశీ, మథురకు దేశంలోని ఇతర ప్రాంతాలతో ఉన్నంత కనెక్టివిటీ అయోధ్యకు ఉండదు. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూకు కూతవేటు దూరంలోనే ఉన్నప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. నేరుగా అయోధ్యకు చేరుకునే రైళ్లు లేవు. వేరే నగరాల్లో రైలు మారి చేరుకున్నా.. రైలు దిగిన తర్వాత చూస్తే నిర్మానుష్యంగా పాడుబడిన స్థితిలో రైల్వే స్టేషన్ కనిపించేది. రైల్వే స్టేషన్ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక విమాన సర్వీసుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయోధ్యకు ఆనుకునే ఫైజాబాద్‌లో ఆర్మీ కంటోన్మెంట్ యూనిట్లు ఉన్నప్పటికీ.. విమానమార్గంలో కనెక్టివిటీ లేదు. ఇన్ని అవాంతరాలు దాటుకుని అయోధ్య చేరుకున్నా.. ఓ రెండ్రోజులు ఉండేందుకు సరైన హోటల్ వసతి కూడా అక్కడ లేదు.

కేవలం సాధుసంతులు, సౌకర్యంతో పెద్దగా పట్టింపులేని ప్రజలు ఉండేందుకు సత్రాలు, ఆశ్రమాలు, ధర్మశాలలు మాత్రమే అక్కడ అందుబాటులో ఉండేవి. ఇరుకైన వీధులు, అధ్వాన్నంగా ఉన్న రోడ్లతో అయోధ్య నిజంగానే శాపగ్రస్త నగరాన్ని తలపించేలా ఉండేది. కానీ.. కాశీ, ప్రయాగ, మథుర, బృందావన్ వంటి ఇతర పుణ్యక్షేత్రాల్లో ఈ పరిస్థితి ఉండేది కాదు. స్టార్ హోటళ్లతో పాటు సందడిగా ఉండే మార్కెట్లు ఈ నగరాల్లో ఉండేవి. పురాణేతిహాసాల్లో శ్రీకృష్ణుడి కంటే ముందు జన్మనెత్తిన శ్రీరామచంద్రుడి కాలం (త్రేతాయుగం) నాటి నగరమైన అయోధ్యకు ఈ ప్రాభవం, వైభవం ఇంతకాలం లేకపోవడం వెనుక కారణమేంటి అని అడిగితే.. సీతాదేవి శాపమేనని అక్కడి వారు సమాధానం చెబుతారు.

త్రేతాయుగం నాటి శాపానికి నేడు విముక్తి?

అత్తింటి నగరం అయోధ్యను సీతాదేవి ఎందుకు శపించింది అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. రావణాసురుడిని వధించి లంకను జయించి సీతను తిరిగి అయోధ్యకు తీసుకొచ్చిన తర్వాత సీతాదేవి అగ్ని పరీక్షను ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే..! ఈ ఘటన సీతాదేవిని తీవ్రంగా బాధించింది. అయినప్పటికీ ఆ రాముడి కోసం భరించిన సీతమ్మను.. ఆ తర్వాత కూడా అయోధ్యవాసులు విడిచిపెట్టలేదు. నోటికొచ్చినట్టు నానారకాలుగా కూతలు కూయడంతో.. చివరకు నిండు గర్భిణిగా ఉన్న సీతాదేవిని అడవులపాలు చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితికి కారణమైన అయోధ్యవాసులపై కోపంతో సీతాదేవి శపించిందని స్థానికుల నమ్మకం. ఆ

సీతమ్మ శాపం కారణంగానే ఉత్తరాదిన భౌగోళికంగా అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో ఉన్న కేదార్‌నాథ్, బద్రీనాథ్, అమర్‌నాథ్ సహా అనేక పుణ్యక్షేత్రాలు ఎంతో వైభవంగా వెలిగిపోతుంటే అయోధ్య మాత్రం శాపగ్రస్త నగరం అన్నట్టుగానే నిస్తేజంగా, అభివృద్ధికి, యాత్రికుల ఆకర్షణకు నోచుకోకుండా ఉండిపోయింది. విదేశీ దండయాత్రలతో శిధిలమవడమే ఇందుకు కారణమా అనుకుంటే అత్యధిక పర్యాయాలు దాడులను ఎదుర్కొని విధ్వంసానికి గురైన సోమ్‌నాథ్ క్షేత్రం సహా అనేక పుణ్యక్షేత్రాలు మళ్లీ పునరుద్ధరణకు నోచుకుని, వైభవంగా వెలిగిపోతున్నాయి. కానీ అయోధ్యకు ఇంతకాలం పట్టింది.

1528లో విధ్వంసానికి గురైన రామజన్మభూమి ఆలయం మళ్లీ 496 ఏళ్ల తర్వాత 2024 జనవరి 22 ప్రారంభోత్సవానికి నోచుకుంది. ఆరు గ్రహాలు అనుకూలించిన దివ్య ముహూర్తాన ప్రారంభమైన ఈ ఆలయంతో యావత్ అయోధ్య ముఖచిత్రమే మారిపోయింది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వంలో ఉన్నందుకో.. అయోధ్యలో మందిర నిర్మాణాన్ని ఆ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో గత 3 దశాబ్దాలుగా పెడుతూ వచ్చినందుకో.. మొత్తంగా రామజన్మభూమిలో భవ్యమైన మందిరంతో పాటు అయోధ్య నగరాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్థం నిర్మించే మౌలిక వసతుల కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 30 వేల కోట్లు ఖర్చు చేస్తోంది.

పాడుపడిన భవంతిని తలపించిన పాత అయోధ్య జంక్షన్ పేరు ‘అయోధ్య ధామ్ జంక్షన్’గా మార్చడమే కాదు, అది రైల్వే స్టేషనా లేక విమానాశ్రయమా అన్న అనుమానం కలిగేలా అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దిన సరికొత్త రైల్వేస్టేషన్ సిద్ధమవుతోంది. అంతేకాదు, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అయోధ్యకు చేరుకునేలా రైలు సర్వీసులు, శరవేగంగా నడిచే వందే భారత్ రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ మధ్యనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. లఖ్‌నవూ – గోరఖ్‌పూర్ నగరాలను కలిపే జాతీయ రహదారిపై ఉన్న అయోధ్యకు రోడ్డు మార్గంలో కనెక్టివిటీకి ఇబ్బందే లేదు.

ఇవన్నీ ఒకెత్తు అయితే.. అక్కడికి వచ్చే భక్తులు, యాత్రికులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కల్పించే మౌలిక వసతులకు తోడు భారీస్థాయిలో ప్రైవేటు పెట్టుబడులు కూడా అయోధ్యకు తరలివస్తున్నాయి. అనేక స్టార్ హోటళ్లు అక్కడ హోటళ్లను నిర్మించేందుకు ఆసక్తి చూపుతూ దరఖాస్తులు పెట్టుకున్నాయి. సుమారు 100 స్టార్ హోటళ్ల నిర్మాణానికి అప్లికేషన్లు వచ్చాయని ట్రస్టు సభ్యుడిగా ఉన్న మోహన్ ప్రతాప్ మిశ్రా చెబుతున్నారు. అయోధ్యపై సీతాదేవి శాపానికి విముక్తి కూడా కలిగిందని ఆయనంటున్నారు. 19వ శతాబ్దంలో అయోధ్యను పరిపాలించిన దర్శన్‌ సింగ్ వంశానికి చెందిన మోహన్ ప్రతాప్ మిశ్రా.. శతాబ్దాలుగా అయోధ్యను పీడిస్తున్న శాపానికి రామమందిర నిర్మాణంతో విముక్తి లభించిందని సూత్రీకరిస్తున్నారు.

అడుగడుగునా దశాబ్దాలు, శతాబ్దాల చరిత్ర కల్గిన అద్భుతమైన ఆలయాలతో.. ఆలయాల నగరిగా పేరొందిన అయోధ్యకు పూర్వవైభవం వచ్చిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామమందిరాన్ని సందర్శించేందుకు వచ్చే భక్తజనం రద్దీతో అయోధ్యవాసుల ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవం మర్నాడే ఏకంగా 5 లక్షల మందిని బాలరాముడి దర్శనం చేసుకున్నారు. ఇంకా పూర్తిస్థాయిలో మౌలిక వసతులు, రవాణా సదుపాయాలు ఏర్పాటు కాకముందే రద్దీ ఇలా ఉందంటే.. అన్నీ సమకూరిన తర్వాత దక్షిణాదిన తిరుమల – తిరుపతిని తలపించేలా అయోధ్య నగరం భక్తుల రాకపోకలతో సందడి చేయనుంది. ఈ సందడిని, జరుగుతున్న అభివృద్ధి చూసి సీతాదేవి శాపం ఎట్టకేలకు తొలగిపోయిందని స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…