Somu Veerraju : ఏపీలో చారిత్రక ఆలయాల పరిస్థితి చూస్తే హృదయం ద్రవిస్తోంది : సోము వీర్రాజు

చారిత్రక ఆలయాలపై ఏపీ ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ లేకుండా పోయిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఏపీ ప్రభుత్వానికి చర్చిల మీద, దర్గాల మీద ఉన్న ప్రేమ హిందూ దేవాలయాలపై..

Somu Veerraju :  ఏపీలో చారిత్రక ఆలయాల పరిస్థితి చూస్తే హృదయం ద్రవిస్తోంది :  సోము వీర్రాజు
Somu Veerraju
Follow us

|

Updated on: Jul 25, 2021 | 8:28 PM

AP BJP Temples visit – Somu Veerraju : చారిత్రక ఆలయాలపై ఏపీ ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ లేకుండా పోయిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఏపీ ప్రభుత్వానికి చర్చిల మీద, దర్గాల మీద ఉన్న ప్రేమ హిందూ దేవాలయాలపై లేదని సోము వీర్రాజు ఆరోపించారు. ఆదాయం వచ్చే దేవాలయాలను చూసుకుంటూ.. చారిత్రాత్మక ఆలయాలను గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు. ఏపీలో దేవాలయాల పరిరక్షణ పేరుతో బీజేపీ చేపట్టిన ఆలయాల సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రకాశంజిల్లా త్రిపురాంతకంలోని బాలాత్రిపురసుందరీదేవి ఆలయాన్ని బీజేపీ బృందం ఆదివారం సందర్శించింది.

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆలయ పర్యటనలు చేపట్టలేదని.. నిరాదరణకు గురవుతున్న పురాణ ప్రాశస్త్యం ఉన్న ఆలయాలపై చర్చ జరగాలన్న ఉద్దేశ్యంతో పర్యటిస్తున్నట్టు సోము వీర్రాజు స్పష్టం చేశారు. త్రిపురాంతకంలోని ఆలయాలకు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు లేవన్నారు. బాత్రూమ్‌లు, స్నానాల గదులు ఇంత వరకు కట్టించలేదంటే దేవాలయాలకు వచ్చే ఆదాయాలపై ఆధారపడి సౌకర్యాలు కల్పిస్తున్నట్టు అర్దమవుతందన్నారు.

ఆదాయాలతో సంబంధం లేకుండా దేవాలయాల్లో సౌకర్యాలు కల్పించాలని సోము డిమాండ్ చేశారు. త్రిపురాంతకం పరిధిలో ఉన్న కొండలపై శిలువలు ఏర్పాటు చేసే పరిస్తితి ఉందని, వెంటనే ప్రభుత్వం ఈ ప్రాంతంలోని కొండలను స్వాధీనం చేసుకుని పరిరక్షించాలన్నారు. త్రిపురాంతకం క్షేత్రంలో నిత్యం వేదపారాయణ జరగాలన్నారు. బాలాత్రిపుర సుందరీదేవి ఆలయంలో గుప్త నిధుల తవ్వకాలు, భూముల అన్యాక్రాంతంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సోము కోరారు. త్రిపురాంతకంలో పురాతన దేవాలయాలు దత్తత తీసుకొని గుప్తనిధుల తవ్వకాలు జరిపి ఆ తర్వాత వాటిని వదిలేసి వెళ్ళిపోతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

త్రిపురాంతక క్షేత్రానికి తలమానికమైన కదంబ వృక్షాలను పరిరక్షించి వాటి అభివృద్ధికి కృషి చేయాలని సోము ప్రభుత్వాన్ని కోరారు. దుండగులు ధ్వంసం చేసిన వీరభద్ర స్వామి దేవాలయాన్ని పునరుద్ధరించాలని, అమ్మవారి ఆలయం చుట్టూ ఉన్న ఎనిమిది బావులను పునరుద్ధరించాలన్నారు. అభివృద్ధి పేరుమీద ధ్వంసం చేస్తున్న దేవాలయాలను ఈ విషయంలో దేవాదాయ శాఖ కాపాడాలని కోరారు. అన్యాక్రాంతమైన దేవాలయ భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు.

ఇప్పటివరకు త్రిపురాంతక క్షేత్రంలో 20 కి పైగా దొంగతనాలు జరిగితే వాటిలో కేవలం ఒక కేసులో ఒక నిందితుడిని పట్టుకోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల మీద జరిగిన దాడుల్లో దోషులను శిక్షించాలని, అంతర్వేది దోషులను, రామతీర్థం దోషులను వెంటనే శిక్షించాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు.

Read also :  Revanth Reddy : ఇంద్రవెళ్లి గడ్డమీద లక్ష మందితో దండు కట్టి దళిత, గిరిజన దండోరా మోగిస్తాం : రేవంత్ రెడ్డి