AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagoba Jatara 2025: నాగోరే నాగోబా.. దారులన్నీ కేస్లాపూర్ వైపే.. మహా జాతరకు వేళాయే..

నాగోరే నాగోబా అంటూ కెస్లాపూర్ పిలుస్తోంది. ప్రతి ఏటా పుష్యమి నెలవంక రెండో రోజున చెకడ పేరిట నిర్వహించే ప్రచారంతో నాగోబా జాతర తొలి ఘట్టానికి అంకురార్పణ జరుగుతుంది. గోదావరి జలాల సేకరణతో కీలక ఘట్టానికి చేరుకుని.. పుష్యమి అమవాస్య అర్ధరాత్రి జరిపే మహాపూజతో ప్రజ్వలితమవుతుంది. అంతటి ప్రాశస్త్యం కలిగిన నాగోబా జాతర ఇవాళ ప్రారంభం కాబోతోంది. జనవరి 28న మొదలై ఫిబ్రవరి 4వ తేదీ వరకు 8 రోజులపాటు అంగరంగ వైభవంగా జాతర సాగనుంది.

Nagoba Jatara 2025: నాగోరే నాగోబా.. దారులన్నీ కేస్లాపూర్ వైపే.. మహా జాతరకు వేళాయే..
Nagoba Jatara 2025
Naresh Gollana
| Edited By: |

Updated on: Jan 28, 2025 | 7:53 AM

Share

తెలంగాణలో ఎంతో ఘనంగా జరిగే నాగోబా జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా జరుపుకునే ఈ జాతర కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఆదిలాబాద్​జిల్లా కేస్లాపూర్‌లో జరిగే నాగోబా జాతరకు దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు ఉంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో.. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఈరోజు రాత్రి ప్రారంభమయ్యే ఈ జాతర ఫిబ్రవరి 4 వరకు జరుగుతుంది. నాగోబా జాతర ఉత్సవాలను 8 రోజులపాటు ఆదివాసీలు సంప్రదాయ‌, ఆచార వ్యవహారాలతో నిర్వహిస్తారు. కడెం మండలంలోని గొడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న పవిత్ర గోదావరి జలాన్ని కాలినడకన తీసుకొని వచ్చిన మెస్రం వంశస్థులు కేస్లాపూర్‌కు చేరుకున్నారు. రాత్రి ప‌ది గంటలకు మహాపూజతో జాతర ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ పవిత్ర జలాలతో నాగోబాను అభిషేకించనున్నారు. రాత్రంతా నాగదైవానికి మహాపూజ నిర్వహిస్తారు.

జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్‌కు ప్రత్యేకత

జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్‌కు ఒక ప్రత్యేకత ఉంది. నిజాం హయాంలో మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కాదు. నాగరికులంటేనే ఆదివాసులు భయపడేవారు. గిరిజనుల వద్దకు అధికారులెవరు వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం.. విముక్తి కోసం సాయుధ పోరాటం చేసిన కొమురం భీం మరణించిన సంఘటన జరిగింది. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ నిజాం రాజులు గిరిజన ప్రాంతాల పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్‌ను ఆదిలాబాద్‌ జిల్లాకు పంపారు. అప్పటి నుంచి నిజాం సర్కార్‌ ఈ జాతరపై దృష్టి పెట్టింది. కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్‌ ఏర్పాటు చేయాలని భావించారు. దీన్ని 1946లో ప్రారంభించారు. స్వాతంత్రం వచ్చిన తరువాత జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో దీన్ని కొనసాగిస్తున్నారు. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్‌కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతుంటారు.

నాగోబా జాతర ఉత్సవాలకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛ‌త్తీస్ గ‌ఢ్‌ రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో గిరిజనులు తరలిరానున్నారు. ఆదిలాబాద్​జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తా, ఎస్పీ గౌస్ అలం, ఉట్నూర్ ఏఎస్పి కాజల్ నాగోబా ఆలయాన్ని దర్శించుకుని జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

600 మంది పోలీసులతో భారీ బందోబస్తు

ఇక నాగోబా జాతర కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 600 మంది పోలీసు సిబ్బందిని రంగంలోకి దించారు. వందకుపైగా సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆరు సెక్టార్లుగా పోలీస్ సిబ్బందిని విభజించి.. మూడు షిఫ్టుల్లో 24 గంటలపాటు విధులు నిర్వహించేలా ప్లాన్ చేశారు. గిరిజనుల సంప్రదాయాలను గౌరవించి.. ప్రజలతో నిదానంగా నడుచుకోవాలని ఎస్పీ గౌస్ ఆలం సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..