Shirdi Saibaba: కోట్లాదిమంది ఆరాధించే షిర్డిసాయికి కొత్త కష్టాలు.. తలలు పట్టుకుంటోన్న ట్రస్ట్
కోట్లాదిమంది ఆరాధించే షిర్డిసాయికి కష్టాలొచ్చాయ్. అదీ కూడా ఆయనను కొలిచే భక్తుల వల్లే. భక్తులు సమర్పించే కానుకలే సాయిబాబాకి చిక్కులు తెచ్చిపెట్టాయ్. భక్తుల దెబ్బకు బ్యాంకులు కూడా బాబోయ్ అనాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక, షిర్డిసాయి ట్రస్ట్ అయితే ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోంది. ఇంతకీ, షిర్డిసాయిబాబాకి వచ్చిన ఆ కష్టమేంటి?. గట్టెక్కే మార్గమే లేదా?.
అత్యంత సంపన్న ఆలయాల్లో షిర్డి సాయిబాబా టెంపుల్ ఒకటి. నిత్యం లక్షలాది భక్తులు షిర్డిసాయిని దర్శించుకుంటూ ఉంటారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకూ అందరూ ఆయన భక్తులే. ఇక కానుకలు ఏ రేంజ్‌లో వస్తాయో, డైలీ ఆదాయం ఎంతో ఊహించుకోవచ్చు. అయితే, ఈ కానుకలే ఇప్పుడు షిర్డిసాయికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. కోటో రెండు కోట్లో కాదు, ఏడాదికి మూడున్నర కోట్ల రూపాయలు, మొత్తం చిల్లర నాణేలే, పోనీ అవేమన్నా పది రూపాయల కాయిన్సా అంటే అదీకాదు, అందులో మెజారిటీ వాటా ఒక్క రూపాయి, రెండ్రూపాయిలు, ఐదు రూపాయలదే. కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్తున్నాయి చిల్లర నాణేలు. ఎంతలా అంటే వారానికి 7లక్షలకు పైగా కాయిన్స్ పేరుకుపోతున్నాయ్. వారానికే 7లక్షల కాయిన్స్ అంటే నెలకెన్ని, ఏడాదికెన్ని. ఇన్ని లక్షల కోట్ల కాయిన్స్‌లో చెల్లని నాణేలెన్నో.
వీటన్నింటినీ లెక్కపెట్టడమే ఒక సవాల్ అంటే, అందులో చెల్లనవి గుర్తించడం మరో పెద్ద సవాల్. ఈ చిల్లర నాణేలే ఇప్పుడు షిర్డి సాయికి ట్రస్ట్‌కి అతిపెద్ద తలనొప్పిగా మారాయ్. భక్తులు ఎంతో ప్రేమతో కానుకలుగా సమర్పిస్తున్నా.. వాటిని మెయింటైన్ చేయడం తలకు మించిన భారంగా మారింది. చివరికి బ్యాంకులు కూడా చేతులెత్తేశాయంటే షిర్డి సాయి ట్రస్ట్‌లో పేరుకుపోయిన చిల్లర నాణేల కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు.
షిర్డిసాయి ఖజానాలోనే కాదు బ్యాంక్ ఖాతాల్లో కూడా చిల్లర నాణేలు పేరుకుపోయాయ్. దాంతో, ఈ నాణేలు తమకొద్దు బాబోయ్ అంటున్నాయ్ బ్యాంకులు. షిర్డిసాయి ట్రస్ట్‌కి 12 బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే, ఒక్కో బ్యాంక్‌లో రెండుకోట్ల విలువైన కాయిన్స్ ఉన్నాయ్. బ్యాంకుల స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ ఈ చిల్లరతోనే నిండిపోయాయ్. ఈ నాణేల బరువుకి పైకప్పు కూలిపోతుందేమోనని భయపడాల్సిన పరిస్థితి.
ఒకపక్క చిల్లర నాణేలను భద్రపర్చడం అతిపెద్ద సవాల్‌గా మారితే, ఇంకోపక్క వీటికి లక్షల రూపాయల వడ్డీ చెల్లించాల్సి రావడం ఇబ్బందిగా మారింది బ్యాంకులకి. సంచుల కోసమే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందంటే ఈ చిల్లర కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధంచేసుకోవచ్చు. దాంతో, నాణేలను తీసుకునేదే లేదంటూ తేల్చిచెప్పేశాయ్. బ్యాంకులు ససేమిరా అనడంతో చేసేదేమీలేక ఆర్బీఐని ఆశ్రయించింది షిర్డిసాయి ట్రస్ట్.
టన్నులకొద్దీ పేరుకుపోయిన చిల్లర నాణేలను ఏం చేయాలనేదానిపై మల్లగుల్లాలు పడుతోంది షిర్డిసాయి ట్రస్ట్. ఆర్బీఐ ఒక నిర్ణయం తీసుకునేలోపు… మరిన్ని బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు ఆలోచిస్తోంది. మరి ఈ సమస్యకు ఆర్బీఐ పరిష్కారం చూపిస్తుందా? లేదా?. షిర్డిసాయి ట్రస్ట్ ఏం చేయబోతోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం