AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laxmi Narasimha Swamy Temple: లక్ష్మి నరసింహ స్వామివారి క్షేత్రంలో రక్తంతో ప్రవహించిన నది, ఎక్కడో తెలుసా..?

తూర్పు గోదావరి జిల్లా లో వున్న మరోక పుణ్యక్షేత్రం అంతర్వేది. మూడు పాయలుగా చీలిన గోదావరి నది పాయ వశిష్ఠ గోదావరి అంతర్వేదిలో వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది. అంతర్వేది త్రికోణాకారపు (లంక) దీవిలొ వుంది. కాశీకి వెళ్ళలేని వారు ఒక్కసారి అంతర్వేది వెళ్ళి వస్తే చాలని..

Laxmi Narasimha Swamy Temple: లక్ష్మి నరసింహ స్వామివారి క్షేత్రంలో రక్తంతో ప్రవహించిన నది, ఎక్కడో తెలుసా..?
Surya Kala
|

Updated on: Feb 23, 2021 | 12:40 PM

Share

Antarvedi Laxmi Narasimha Swamy Temple: తూర్పు గోదావరి జిల్లా లో వున్న మరోక పుణ్యక్షేత్రం అంతర్వేది. మూడు పాయలుగా చీలిన గోదావరి నది పాయ వశిష్ఠ గోదావరి అంతర్వేదిలో వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది. అంతర్వేది త్రికోణాకారపు (లంక) దీవిలొ వుంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యతీర్థం భక్తుల కోర్కెలు తీర్చే పుణ్యక్షేత్రం. పురాణాలలో కూడా ఈ ఆలయం ప్రస్థావన ఉంది. అతి ప్రాచీన ఆలయం ఇది. ఇక్కడ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై కొలువుదీరాడు. సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఇది దక్షిణ కాశిగా పేరుపొందింది. కాశీకి వెళ్ళలేని వారు ఒక్కసారి అంతర్వేది వెళ్ళి వస్తే చాలని అంటారు. పవిత్ర గోదావరిలో స్నానం చేసి లక్ష్మీనరసింహస్వామిని దర్శించవచ్చు.

స్థల విశిష్టత :

సూతమహాముని అంతర్వేదిని గురించి శౌనకాది మహర్షులకు చెప్పినట్లు ఆనవాళ్ళు తెలుస్తుంది. ఒకసారి బ్రహ్మ రుద్రయాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చింది అని విశ్వసిస్తారు. వశిష్టమహర్షి ఇక్కడ యాగం చేసిన కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది. బ్రహ్మ తాను చేసిన శివాపచారానికి నివారణగా వశిష్ఠుడు తెచ్చిన గోదావరి సముద్రంలో కలిసే చోట ఆ మధ్యన గల భూభాగంలో పార్వతీ నీలకంఠేశ్వరులను ప్రతిష్ఠించి మహా రుద్రయాగం చేశాడు. అప్పటి నుంచి బ్రహ్మకు యజ్ఞశాలయైున ఆ పుణ్యస్థలమే అంతర్వేదిగా ప్రసిద్ధి గాంచింది.

స్థల పురాణం :

హిరణ్యాక్షుని పుత్రుడైన రక్తావలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ట గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని నుంచి ఒక వరం కోరుతాడు. రక్తావలోచనుని శరీరం నుంచి పడిన రక్తపు బిందువులు ఇసుక రేణువులమీద పడితే ఆ ఇసుకరేణువుల నుంచి బలవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలనే వరం పొందుతాడు. ఆ వర గర్వంతో యఙ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఒకసారి విశ్వామిత్రుడికి, వశిష్టుడికి జరిగిన సమరంలో రక్తావలోచనుడు విశ్వామిత్రుని ఆఙ్ఞపై వచ్చి భీభత్సం సృష్టించి.. వశిష్ఠుడి నూరుగురు పుత్రులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్ధించగా విష్ణుమూర్తి లక్ష్మీసమేతుడై నరహరి అవతారంతో రక్తలోచనుడుని సంహరించడానికి వస్తాడు. నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తావలోచనుడి శరీరం నుండి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు. నరశింహుడు ఈ విషయం గ్రహించి తన మాయాశక్తి నుపయోగించి రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా చేస్తాడు. అది రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడు. ఈ రక్తకుల్య లోనే శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రవరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వపాపాలు హరిస్తాయని చెబుతారు.

ఇంకో కథ ప్రకారం హిరణ్యకశిపుని సంహరించిన స్వామి అనంతరం ఆ శరీరాన్ని అంతరిక్షంలోకి విసిరేసినపుడు అది ఈ ప్రాంతంలో పడిందని అందుకే అంతర్వేది అని పేరు వచ్చిందని కూడా ప్రచారంలో వుంది.

త్రేతాయుగం.. ద్వాపర యుగంలోనూ ఈ క్షేత్ర ప్రస్థావన :

త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా సమేతుడే లక్ష్మణ, హనుమంతులతో కూడి వశిష్ఠాశ్రమాన్ని, లక్ష్మీ నరసింహమూర్తిని దర్శించి, సేవించినట్లు అక్కడే కొన్ని రోజులు నివసించినట్లు అక్కడి శిలా శాసనాలవల్ల కూడా తెలుస్తోంది. ద్వాపర యుగంలోనూ పాండవ మధ్యముడు అర్జనుడు తీర్ధయాత్రలు చేస్తూ ‘అంతర్వేది’ దర్శించినట్లు చేమకూర వెంకటకవి తన ‘విజయయ విలాసము’లోను, శ్రీనాధ కవిసార్వభౌముడు ‘హరివిలాసం’లోను వర్ణించారు.

ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం క్రీ.శ. 300 ఏళ్ళకు పూర్వం నిర్మంపబడిందని తెలుస్తోంది. పల్లవులచే నిర్మితమైన తొలి ఆలయం నాశనమైపోగా మళ్ళీ ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఈ ఆలయం మొగల్తూరు రాజ వంశీకుల ఆధీనంలో ఉండేది. నేడు ధర్మాదాయ శాఖ అధ్వర్యంలో నడుస్తోంది.

త్రేతాయుగంలో శ్రీ రాముడు అరణ్యవాస సమయంలో ఈ పల్లె మీదుగా పయనిస్తూ సీతతో “సఖీ !ఇదే నేటి పల్లి. మనం ఇక్కడే విశ్రమిద్దాం!” అని అన్నాడట. అప్పటి నుంచి ఆ వూరి వారు తమ వూరిని సఖినేటిపల్లిగా పిలుచుకునే వారని అంటారు. సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు దండకారణ్యానికి వచ్చినప్పుడు, అంతర్వేది నృసింహుని దర్శించాడు. అర్జునుడు తన దోష పరిహారార్థం తీర్థయాత్రలో భాగంగా అంతర్వేది స్నానమాచరించి, స్వామిని దర్శించుకున్నాడు.

అంతర్వేది తీర్థ ఏకాదశి:

మాఘ శుద్ధ దశమి నాడు రాజ్యలక్ష్మీ సమేతుడైన నృసింహస్వామి దివ్య కల్యాణ మహోత్సవం జరిగిన తర్వాత రోజైన ఏకాదశి నాడు నృసింహస్వామి అక్క మాయాశక్తి, అశ్వారూఢాంబ (గుర్రాలక్క) కినుక తీర్చడానికి నవ వధూవరులై అంగరంగ వైభవంగా రథయాత్ర చేస్తారు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని శరాఘాతానికి కుప్పకూలిన భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం అంపశయ్య మీద ఎదురుచూశాడు. (రథ) సప్తమి, (భీష్మ) అష్టమి, (మధ్య) నవమి, (బ్రహ్మాత్మక) దశమి, (భీష్మ) ఏకాదశి రోజుల్లో రోజుకొక్కటి చొప్పున పంచప్రాణాలు వదిలేశాడని పురాణగాథ. అందుకే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని, అంతర్వేది తీర్థ ఏకాదశి అని అంటారు.

Also Read:

సముద్రం ఆ క్షేత్రంలోకి రాకుండా.. సంకెళ్లతో కాపలా కాస్తున్న ఆంజనేయస్వామి ఎక్కడో తెలుసా..!

Follow Us