Kolusu Parthasarathy: బడుగు, బలహీన వర్గాలను అణగదొక్కే పథకం బాబుది: కొలుసు పార్థసారథి
టీడీపీ అధినేత చంద్రబాబుది బడుగు, బలహీనవర్గాలను అణగదొక్కే పథకమని వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆరోపించారు. అధికారంలో
Kolusu Parthasarathy: టీడీపీ అధినేత చంద్రబాబుది బడుగు, బలహీనవర్గాలను అణగదొక్కే పథకమని వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆరోపించారు. అధికారంలో ఉన్నన్నాళ్ళు బడుగు బలహీన వర్గాలకు చంద్రబాబు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. ఇవాళ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల గురించి మాట్లాడుతున్న చంద్రబాబుకు అసలు బీసీల్లో ఎన్ని కులాలు ఉన్నాయో కూడా తెలియదన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను చంద్రబాబు అడుగడుగునా మోసం చేస్తే.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకటించి మరీ ఈ వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తూ, వారికి అండగా నిలబడ్డారన్నారు. టీడీపీ హయాంలో ఆదరణ పథకం ద్వారా బలహీనవర్గాలకు ఇస్త్రీ పెట్టెలు, కల్లుగీత కార్మికులకు మోకులు ఇచ్చానని ఇంకా చెప్పుకోవడానికి చంద్రబాబుకు సిగ్గులేదని పార్థసారథి ఎద్దేవా చేశారు.
గత రెండు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు ఆశ్చర్యకరంగా బీసీల గురించి, ఎస్సీల గురించి మొసలి కన్నీరు కారుస్తూ బీసీలకు, ఎస్సీలకు ఏదో అన్యాయం జరిగిపోతున్నట్లు, తన హయాంలో తానేదో న్యాయం చేసినట్లు ఈ వర్గాలను మోసం చేయడానికి కొత్త నాటకాలు వేస్తూ మళ్ళీ ప్రయత్నిస్తున్నారంటూ పార్థసారథి మండిపడ్డారు.