AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడు చిన్నమ్మ సంచలన నిర్ణయం… రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన శశికళ

Sasikala in politics : తమిళనాడు ఎన్నికలకు ముందు జయలలిత నెచ్చెలి వికె శశికల సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలను వీడుతున్నట్లు ప్రకటించారు.

తమిళనాడు చిన్నమ్మ సంచలన నిర్ణయం... రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన శశికళ
Balaraju Goud
| Edited By: Team Veegam|

Updated on: Mar 04, 2021 | 12:08 AM

Share

Sasikala in politics : తమిళనాడు ఎన్నికలకు ముందు జయలలిత నెచ్చెలి వికె శశికల రాజకీయాలను వీడుతున్నట్లు ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు శశికళ ప్రకటన తమిళనాట సంచలనంగా మారింది. తనకు అధికార దాహం లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకే పార్టీని ఓడించాలంటూ ఓటర్లను కోరారు.

శశికళ నటరాజన్. ఈ పేరు వినగానే చాలా మందికి జయలలిత స్నేహితురాలిగా మాత్రమే గుర్తుపడతారు. శశికళ నటరాజన్ పేరు ఎక్కువగా వివాదాలతోనే ప్రజల నోళ్లలో నానే వారు. జయలలిత వ్యక్తిగత వ్యవహారాలు చూసుకునే క్రమంలో, భారీగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలొచ్చాయి. దీంతో ఆమెను అరెస్టై కర్ణాటకలోని పరప్పణ అగ్రహారం జైలులో జైలు జీవితం గడిపారు. అయితే ఇటీవలే ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. త్వరలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో ఆమె రాకతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అప్పటిదాకా అన్నాడీఎంకే, బీజేపీ కూటమి వర్సెస్ డీఎంకే కాంగ్రెస్ కూటమి అనుకున్న పోటీ కాస్తా ఆమె రాకతో త్రిముఖ పోటీగా ద్రవిడులు భావించారు. దీనికి తోడు ఆమె తిరిగి అన్నాడీఎంకేలోకి రావాలని కొందరు, వద్దని మరికొందరు నాయకులు వాదులాడుకోవడం ప్రారంభించారు. దీంతో అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి విజయావకాశాలకు చెక్ పడుతుందని అంతా భావించారు. అయితే, అందరి ఆశలను తలక్రిందులు చేస్తూ.. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు.

వీకే శశికళ నటరాజన్… చిన్న వీడియా పార్లర్ నుంచి తమిళనాట అగ్రనేతగా వరకు ఎదిగిన ఆమె ప్రస్థానం వెనుక ఎన్నో ఆటు పోట్లున్నాయి. అనేక అవినీతి ఆరోపణలున్నాయి. పాజిటివ్ కంటే, నెగటివ్ గానే ఎక్కువగా ప్రజాదరణ పొందారు. అన్నాడీఎంకే క్యాడర్ చేత చిన్నమ్మగా నీరాజనాలు అందుకుంటున్న శశికళ నటరాజన్ 1957లో తిరుత్తురైపుందిలో ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆ తర్వాత వారి కుటుంబం మన్నార్ గుడికి వలస వెళ్లింది. ప్రాథమిక విద్యతోనే చదువు ఆపేసిన శశికళ, అక్కడ చిన్న వీడియో పార్లర్ నిర్వహిస్తూ కుటుంబానిక ఆసరా నిలిచారు. అక్కడే ప్రభుత్వ పీఆర్వోగా పని చేసే నటరాజన్ తో ఆమెకు పరిచమైంది. డీఎంకే అధినేత కరుణానిధి సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత నటరాజన్ సాయంతో పార్టీ సమావేశాలు రికార్డు చేసే కాంట్రాక్టులు తీసుకునేవారు శశికళ. జయలలితకు మంచి స్నేహితురాలైన కడలూరు జిల్లా కలెక్టర్ చంద్రలేఖ ద్వారా ఆమెతో పరిచయం పెంచుకున్నారు శశికళ. ఆ తర్వాత వారిద్దరి స్నేహం పెరిగి పెద్దదైంది. జయకు సంబంధించిన అన్ని రాజకీయ సభల వీడియాలు తీస్తూ మరింత దగ్గరయ్యారు. ఇదే క్రమంలోనే మన్నార్ గుడి నుంచి పోయెస్ గార్డెన్ కు మకాం మార్చారు.

ఇక, ఎంజీఆర్ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, జయ సీఎం కావడం శశికళను మరింత కలిసొచ్చింది. జయలలితకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను శశికళ దగ్గరుండి చూసుకునే వారు. అంతేకాదు, ఆమె మేనల్లుడైన సుధాకరన్‌ను జయలలితకు దత్తతిచ్చారు. ఓ వైపు జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా తన ప్రాభవాన్ని పెంచుకుంటున్న సమయంలోనే శశికళ చాపకిందనీరులా తన బలాన్ని పెంచుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు రాకపోయినా.. తెరవెనుక ఉండి చక్రం తిప్పిన ఘనత చిన్నమ్మ సొంత. అప్పటి నుంచే జయను అమ్మగా పిలిచే జనాలు, శశికళను చిన్నమ్మగా పిలవడం మొదలుపెట్టారు.

జయలలిత వ్యక్తిగత వ్యవహారాలు చూసుకునే క్రమంలో, భారీగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలొచ్చాయి. ఇక ఆమె భర్త నటరాజన్ పై, ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకుంటూ, ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. జయపై నమోదైన అక్రమాస్తుల కేసులోనూ శశికళ, ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కలర్ టీవీ స్కాంలో జయతో పాటూ ఆమె 30 రోజుల పాటూ జైలు శిక్షను కూడా అనుభవించారు. అటు రెండు సార్లు శశికళ కుటుంబాన్ని జయలలిత.. పోయెస్ గార్డెన్ నుంచి బహిష్కరించారు. 2011లో శశికళతో పాటూ ఆమె భర్త నటరాజన్‌ను, శశికళ మేనల్లుడు, జయలలిత దత్తపుత్రుడు అయిన సుధాకరన్‌ను, మరో 10 మందిని పార్టీ నుంచి బహిష్కరించారు.తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలపై జయ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, కొంతకాలం జయ శశికళను దూరం పెట్టినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ ఆమెను అక్కున చేర్చుకున్నారు.

ఇదిలావుంటే, జయలలిత అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. ఆమె చికిత్స సమయంలో జయ దగ్గర ఉన్న ఒకే వ్యక్తి శశికళ. అప్పటి నుంచి, పార్టీ కార్యక్రమాలను అనధికారికంగా శశికళే చూసుకున్నారు. జయ మరణించిన తర్వాత ఆమె అంత్యక్రియలు నిర్వహించింది కూడా చిన్నమ్మే. ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. మరికొద్ది రోజులకు శాసన సభ పక్ష నేతగా ఎన్నికవడం అంతా నాటకీయంగా జరిగిపోయింది. అంతేకాదు, జయ మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా శశికళ సిద్ధమయ్యారు.

ఇంతలో మారిన రాజకీయ పరిణామాల క్రమంలో శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. దీంతో ఆమెకు నేరం రుజువు కావడంతో బెంగళూరు కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. దీంతో ఆమెను కర్ణాటకలోని పరప్పణ అగ్రహారం జైలుకు తరలించారు. 2017 ఫిబ్రవరి 14 నుంచి జనవరి 27, 2021 వరకు ఆమె కారాగారంలోనే గడిపారు. ఇదే క్రమంలో శశికళను శిక్షా కాలానికి ముందే బయటకు తీసుకురావడానికి టీటీవీ దినకరన్‌ తీవ్ర ప్రయత్నాలు చేశారు. శశికళ విడుదలైతే ఆమె అన్నాడీఎంకే వైపు వెళ్తారని, ఆమెకు ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి ఎడప్పాడి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం సాగింది. అయితే, శశికళ ముందస్తు విడుదలకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.

కర్నాటక రాజధాని బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైల్లో నాలుగేళ్లు శిక్ష అనుభవించి జనవరి 27న విడుదల అయ్యారు. అయితే, ఆమె ఇటీవల కరోనా బారినపడడంతో అస్వస్థతకు గురయ్యారు. శశికళకు జనవరి 20న ఆర్టీపీసీఆర్ పరీక్షలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ తర్వాత నెగెటివ్ వచ్చింది. మరో టెస్ట్‌లో మాత్రం మళ్లీ పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె విక్టోరియా ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందారు. ఇవాళ జైలు నుంచి విడుదల అయినప్పటికీ..కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం మరికొన్ని రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఆతర్వాత పూర్తిగా కోలుకుని ఫిబ్రవరి 10న తమిళనాడు చేరుకున్నారు. రామాపురంలోని ఎంజీఆర్‌ నివాసానికి చేరుకుని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి టీనగర్‌లోని ఆమె తన అన్న కూతురు కృష్ణప్రియ నివాసానికి చేరుకున్నారు.

శశికళ చెన్నై చేరుకున్న రోజే తమిళనాడు రాష్ట్ర సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శశికళ బంధువులు ఇళవరసి, సుధాకరన్‌కు చెందిన ఆస్తులను ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కాంచీపురం, చెంగల్పట్టు తంజావూర్‌, తూత్తుకుడి జిల్లాల్లోని పలుచోట్ల భూములను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాటిని ప్రభుత్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మరోవైపు శశికళ కుటుంబం తప్ప ఏఎంఎంకే నుంచి అన్నాడీఎంకేలో ఎవరైనా చేరవచ్చంటూ గతంలో అన్నాడీఎంకే నేతలు, రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. శశికళను పార్టీలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోబోమంటూ ప్రకటించారు. ప్రస్తుతం ఈ స్వరం మార్చారు ఏఐడీఎంకే నేతలు. విడుదలైన తర్వాత శశికళను అన్నాడీఎంకేలోకి ఆహ్వానించాలని ఎడప్పాడి వర్గం నిర్ణయించిందని, ఈ విషయంలో పన్నీర్‌సెల్వం వర్గానికి నచ్చజెప్పి వారిని సమ్మతింప చేశారని కొందరు నేతలు చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం ఇటు అన్నాడీఎంకే, అటు ఏఎంఎంకే కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. శశికళ విడుదలైన తర్వాత రాజకీయ పరిణామాలపై భిన్నాభిప్రాయాలు వినిపించాయి. ఆమె ఏఎంఎంకేలోకి వెళ్లబోరని, అదే సమయంలో అన్నాడీఎంకేలోకి వెళ్లరని మరో వాదనా వినిపించింది. ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆమెను తప్పించి ఆ పదవిలో టీటీవీ దినకరన్‌ కొనసాగుతున్నారు. ముందస్తు అనుమతి లేకుండా టీటీవీ పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని శశికళ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పలువురు కీలక వ్యక్తులు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడంతో ఇక ఏఎంఎంకే పగ్గాలు చేపట్టడం వ్యర్థమని భావిస్తున్నారని ఆమె అంటున్నట్లు ప్రచారం సాగింది.

‘అమ్మ’కు విశ్వాస పాత్రురాలని చెప్పుకుంటున్న ఆమె ఏఎంఎంకేలోకి వెళ్తే జయలలిత వ్యతిరేకిగా సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశముందని శశికళ భావించినట్లు సమాచారం. మరోవైపు, ఏఎంఎంకేలోకి వెళ్లబోరని, ఆ పార్టీ పగ్గాలు చేపట్టాల్సిన పరిస్థితి వస్తే దానిని అన్నాడీఎంకేలో విలీనం చేయడానికి వెనకాడబోరని పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. శశికళ అన్నాడీఎంకేలో చేరే పరిస్థితులు వస్తే దానిని డీఎంకే రాజకీయం చేయడానికి ఏ మాత్రం వెనుకాడబోదని, అన్నాడీఎంకే అధిష్ఠానాన్ని ఇరకాటంలో పెడుతుందని కొందరు విశ్లేషకులు భావించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏఎంఎంకే, అన్నాడీఎంకేలోకి వెళ్లే పరిస్థితి లేదని అర్థమైంది. ఈ నేపథ్యంలోనే శశికళ రాజకీయాల్లో నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఉండి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also… Sasikala: శశికళ సంచలన నిర్ణయం.. రాజకీయాలకు, ప్రజా జీవితానికి గుడ్ బై.. డీఎంకేను ఓడించాలని పిలుపు