AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవంబర్ 3నే కొత్త కండువా.. ఇంతకీ ఏ రంగో ?

గత వారం రోజులుగా దోబూచులాడుతున్న గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు ఓ క్లారిటీకి వచ్చినట్లు కనిపిస్తోంది. తొలుత బిజెపి నేతలను, ఆ తర్వాత వైసీపీ అధినేతను కలిసిన వంశీ టిడపికి గుడ్ బై చెబుతున్నట్లు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు.. అసలు క్రియాశీల రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు చాంతాడంత లేఖ రాశారు చంద్రబాబుకు. వంశీ లేఖకు చంద్రబాబు ప్రత్యుత్తరం కూడా ఇచ్చారు. ఆ తర్వాత ట్వీట్ల ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్న వంశీ సడన్‌గా […]

నవంబర్ 3నే కొత్త కండువా.. ఇంతకీ ఏ రంగో ?
Rajesh Sharma
|

Updated on: Oct 30, 2019 | 6:41 PM

Share
గత వారం రోజులుగా దోబూచులాడుతున్న గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు ఓ క్లారిటీకి వచ్చినట్లు కనిపిస్తోంది. తొలుత బిజెపి నేతలను, ఆ తర్వాత వైసీపీ అధినేతను కలిసిన వంశీ టిడపికి గుడ్ బై చెబుతున్నట్లు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు.. అసలు క్రియాశీల రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు చాంతాడంత లేఖ రాశారు చంద్రబాబుకు. వంశీ లేఖకు చంద్రబాబు ప్రత్యుత్తరం కూడా ఇచ్చారు. ఆ తర్వాత ట్వీట్ల ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్న వంశీ సడన్‌గా అదృశ్యమయ్యారు.
అసలు వంశీ ఎక్కడున్నారు అన్న ప్రశ్నలు ఏపీవ్యాప్తంగా వినిపించేలా రెండు రోజుల పాటు తానెక్కడున్నది ఎవరికీ తెలియకుండా గడిపారు. అయితే.. ఆయన హైదరాబాద్‌లో బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇంట్లో వున్నారని, బిజెపిలో చేరుతున్నారని ప్రచారం మొదలైంది. ఇదంతా కొనసాగుతుండగానే వల్లభనేని వంశీ తన నెక్స్ట్ స్టెప్ ఏంటో తన సన్నిహితులకు వెల్లడించినట్లు తెలుస్తోంది.
వల్లభనేని వంశీ సన్నిహితులిస్తున్న సమాచారం ప్రకారం ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కొద్ది రోజులుగా టీడీపీని వీడుతారంటూ సాగుతున్న ప్రచారానికి మూడో తేదీన తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెంబర్‌ త్రీ వంశీ లక్కీ నంబర్‌ కావడంతో ఆరోజునే పార్టీ మారనున్నట్లు సమాచారం. పార్టీలోను, బయటా ఒత్తిళ్ళకు గురైన వంశీ బీజేపీ నేత సుజనాచౌదరితో గత శుక్రవారం భేటీ అయ్యారు. గుంటూరు నుంచి ఒంగోలు వరకు సుజనాతో ప్రయాణించి ఆయనతో చర్చలు జరిపారు.
ఆ వెంటనే తాడేపల్లి వచ్చి ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. జగన్‌తో భేటీ సమయంలో వంశీ వెంట ఆయన సన్నిహిత మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని ఉన్నారు. ఇక వంశీ వైసీపీలో చేరడం లాంఛనమే అని అప్పుడే వార్తలొచ్చాయి. జగన్‌తో మాట్లాడిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపించారు వంశీ. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటుగా…రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు కూడా వంశీ తన లేఖలో పేర్కొన్నారు.
ఆ వెంటనే చంద్రబాబు తిరుగు లేఖరాసి వంశీని రాజీనామా చేయవద్దని కోరారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చంద్రబాబు లేఖ అందుకున్న వంశీ మరోసారి పార్టీ అధినేతకు తన బాధనంతా వెళ్ళగక్కుతూ ఇంకో లేఖ రాసారు. పార్టీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల్ని అందులో వివరించారు. ఈ వ్యవహారాన్ని మరింత పొడిగించదలచుకోలేదని కూడా రెండో లేఖలో తెలిపారు. చంద్రబాబు దానికీ సమాధానం ఇచ్చారు. టీడీపీ నుంచి వెళ్ళవద్దని సూచించారు.
చంద్రబాబు, వంశీ మధ్య జరిగిన ఉత్తరాయణం అంతా వాట్సప్‌ ద్వారానే సాగింది. లెటర్‌ హెడ్స్‌పై ఎవరూ రాయలేదు. పార్టీ నేతలకు చిక్కకుపోగా.. ఫోన్‌లోకి అందుబాటులోకి రాని వంశీ వ్యవహారాన్ని పరిష్కరించడానికి ఇద్దరు నేతలతో కమిటీ వేశారు చంద్రబాబు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, బందరు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణలు వంశీని కలిసి లేదా ఉత్తరాల ద్వారా మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.
మూడు రోజులుగా హైదరాబాద్‌లోనే ఉంటున్న వల్లభనేని వంశీ టీడీపీ నేతలకు అందుబాటులోకి రాలేదు. వాట్సప్‌ మెసేజ్‌లు కొనసాగాయో లేదో కూడా తెలియదు. మూడు రోజులుగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి పలుసార్లు వంశీతో మాట్లాడినట్లు సమాచారం.  అటు టీడీపీ సూచనలు, ఇటు సుజనాతో చర్చల అనంతరం కూడా వైసీపీలోనే చేరేందుకు గన్నవరం ఎమ్మెల్యే నిర్ణయించుకున్నారు. నవంబర్ మూడునే ముహూర్తంగా ఎంచుకున్నట్లు వంశీ సన్నిహితులు చెబుతున్నారు.