Andhra Pradesh: గుంటూరు తొక్కిసలాట ఘటన.. ఉయ్యూరు శ్రీనివాస్ విడుదల.. పోలీసులకు సహకరించాలని ఆదేశం..
గుంటూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టు అయిన శ్రీనివాస్ కు ఊరట లభించింది. ఈ ఘటనకు, ఆయనకు సంబంధం లేదంటూ శ్రీనివాస్ రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి తిరస్కరించారు. ఘటనతో సంబంధం లేని సెక్షన్ చేర్చడంతో..

గుంటూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టు అయిన శ్రీనివాస్ కు ఊరట లభించింది. ఈ ఘటనకు, ఆయనకు సంబంధం లేదంటూ శ్రీనివాస్ రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి తిరస్కరించారు. ఘటనతో సంబంధం లేని సెక్షన్ చేర్చడంతో 304(2) నుంచి మినహాయింపు లభించింది. దీంతో రూ.25 వేల స్వయం పూచీకత్తుపై శ్రీనివాస్ విడుదలయ్యారు. అంతే కాకుండా విచారణకు శ్రీనివాస్ సహకరించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా.. గుంటూరు తొక్కిసలాట కేసులో ప్రధాన నిందితుడు ఉయ్యూరు శ్రీనివాస రావును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ ఏలూరు రోడ్డులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై ఉయ్యూరు శ్రీనివాస్ ను ఏ-1గా చేర్చారు. తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిపై 304 సెక్షన్ కింద నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
కాగా.. నూతన సంవత్సరం సందర్భంగా గుంటూరులో చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమాన్ని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. వారిని గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఉయ్యూరు శ్రీనివాస్ ను కీలక నిందితుడిగా పేర్కొంటున్నారు. సోమవారం రాత్రి నుంచి కూడా ఉయ్యూరు శ్రీనివాస్ పరారీలో ఉన్నారు. ఉదయం నుంచి పోలీసు బృందాలు గాలించి, ఏలూరు రోడ్ లో అదుపులోకి తీసుకున్నారు.
చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. గుంటూరు వికాస్ నగర్ లో చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. చంద్రబాబు మాట్లాడి వెళ్లిపోయిన తరువాత చంద్రన్న కానుక పంపిణీ ప్రారంభించారు. కానుకలు తీసుకునేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు. వారంతా ఎగబడటతో తొక్కిసలాట జరిగింది. మృతులను గోపిశెట్టి రమాదేవి, రాజ్యలక్ష్మి, సయ్యద్ ఆసిమాగా గుర్తించారు.