కీలక సమయంలో కనిపించని ముగ్గురు ముఖ్య నేతలు.. ఆలోచనలో పడ్డ టీడీపీ అధినాయకత్వం
ఆంధ్రప్రదేశ రాష్ట్ర రాజకీయాలు రసవత్తంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన మరునాడే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ రాష్ట్ర రాజకీయాలు రసవత్తంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన మరునాడే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. మున్సిపల్ పోరులో చతికిలాపడ్డ టీడీపీ మూలుగే నక్కాపై తాటి పండు పడ్డట్లు అయ్యింది. పైగా అధినేతకు అండగా ఉండాల్సిన ముఖ్యనేతలందరూ సైలెంట్‌గా సైడ్ అయ్యినట్లు కనిపిస్తుంది.
రాజధాని భూసేకరణలో భాగంగా అక్రమాలు జరిగాయంటూ తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. మాజీ మంత్రి పి.నారాయణనూ నిందితుడిగా చేర్చింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి గత నెల 24వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు… ఈనెల 12న సీఐడీ కేసు నమోదు చేసింది. మంగళవారం ఉదయం సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి 41(ఏ) సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చారు. సీఐడీ అధికారులు రెండు బృందాలుగా అక్కడికి చేరుకున్నారు.
తన నివాసంలో చంద్రబాబు నోటీసులు అందుకున్నారు. ‘‘ఈ కేసులో దర్యాప్తు నిమిత్తం మిమ్మల్ని ప్రశ్నించాల్సి ఉంది. మీకు(ఏ1) మాత్రమే తెలిసిన వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. అందువల్ల… ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న సీఐడీ రీజనల్ ఆఫీసుకు వ్యక్తిగతంగా హాజరు కావలెను’’ అని సీఐడీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసుకు కట్టుబడి తమ ముందు హాజరుకాకపోయినా, ఇందులో పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించినా 41ఏ(3), (4) సీఆర్పీసీ ప్రకారం చంద్రబాబును అరెస్టు చేయవచ్చునని కూడా స్పష్టం చేశారు.
ఇదిలావుంటే, ఇటీవల అంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల‌్లో అధికార వైసీపీ స్పష్టమైన అధిక్యత సంపాదించింది. గ్రామ పంచాయతీ, మునిసిపాలిటీ ఎన్నికల్లో ఎక్కడికక్కడ వైసీపీ పుంజుకుంది. చాలా ఎక్కువ పంచాయతీలు, మునిసిపాలీటీలు, మునిసిపల్ కార్పొరేషన్లు సొంతం చేసుకుంది. దీంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వేసుకున్న అంచనాలు పటాపంచలయ్యాయి. టీడీపీకి కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్లోనూ టీడీపీ పరిస్థితి చతికిలపడింది.
దీంతో ఈ పరిస్థితిని కవర్ చేసుకునేందుకు నాయకులు తల్లడిల్లుతున్నారు. ఈ జిల్లాలో బాగుంది అను కునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అగ్ర నాయకులు అంతర్మథనంలో పడ్డారు. మొత్తంగా చూస్తే ఈ పరిణామాలు టీడీపీలో అంతర్గత కుంపటిని రాజేస్తున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రధానంగా అధినేత తమకు, తమ సూచనలకు విలువ ఇవ్వడం లేదని ఇతర నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో ఇప్పటి వరకు సీనియర్ నేతలు చాలా వరకు కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేదు. పార్టీలో నుంచి బయటికి వెళ్లిపోతారు అనే వార్తలు వచ్చినా సరే కొంతమంది నాయకులు మాత్రం స్పందించే ప్రయత్నం చేయడం లేదు.
ఇక, రాజకీయంగా ఇప్పుడు ఎన్నో విమర్శలు వస్తున్నా చంద్రబాబు నాయుడుకి కూడా అండగా ఉండే విషయంలో కొంతమంది నాయకుల నుంచి అచి తూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఉన్న సీనియర్ నేత, విశాఖ జిల్లాలో ఉన్న మరో సీనియర్ నాయకుడు సహా కొంత మంది ఎమ్మెల్యేల నుంచి చంద్రబాబు నాయుడికి సహకారం అందడం లేదని పార్టీలోనే నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఇక, ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అయితే వీరు లోపాయికారీగా వైసీపీతో కలిసి పని చేస్తున్నారా అన్న అనుమానం కూడా పార్టీ నాయకులని వెంటాడుతుంది.
ఇదిలావుంటే, ఇటీవల చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టిన సరే, వీళ్లెవరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు మాట్లాడినా సరే వీళ్లు మాత్రం మాట్లాడే ప్రయత్నం చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వాళ్ల గురించి పెద్దగా వార్తలు వచ్చిన దాఖలాలు కూడా లేవంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే ఇప్పుడు వీళ్ళ ముగ్గురిలో ఉన్న అసహనం ఏంటి అనే దానిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
మరోవైపు స్థానిక నేతలతో ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు అధినేత ప్రయత్నించినట్లు సమాచారం. అయినా సరే వీళ్ల వైఖరిలో మాత్రం దాదాపుగా మార్పు రాలేదనే తెలుస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం వీరి విషయంలో చంద్రబాబు నాయుడు కఠినంగానే వ్యవహరించే అవకాశముందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాను చూసుకుంటానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినా వారు బయటికి రాకపోవడంతో ఇక వీళ్ల ముగ్గురితో తాడోపేడో తేల్చుకోవడానికి చంద్రబాబునాయుడు సిద్ధమయ్యారని రాజకీయవర్గాలు అంటున్నాయి. పైగా, విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాలో పార్టీ ఓటమికి ఇలాంటి నాయకులే కారణం అని పార్టీ నమ్ముతుంది.
అయితే ఈ విషయాన్ని ముందే గ్రహించిన ఒక ఎమ్మెల్యే నిన్న చంద్రబాబు నాయుడుని కలవడానికి ఆయన నివాసానికి వెళ్లినట్లు సమాచారం. జరిగిన వ్యవహరానికి సంబంధించి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఏది ఏమైనా ఇలాంటి నాయకులని దూరం పెట్టటం టీడీపీకి ఎంతో అవసరం అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ అసమ్మతి కుప్పటి రాజేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి పరోక్ష కారకులని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు గుసగుసలాడుకుంటున్నట్లు సమాచారం.
ఇదీ చదవండిః ‘మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పండి !’ ప్రధాని మోదీకి తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రీన్ సూటి ప్రశ్న