Yanamala : ఉద్యోగ నియామకాలపై నిజంగా పారదర్శకత ఉండాలని భావిస్తే ఫోన్ నెంబర్లు, వివరాలు వెబ్ సైట్లో పెట్టండి : యనమల
పదిహేను రోజుల క్రితమే సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 4. 77 లక్షల ఉద్యోగాలిచ్చినట్టు చెప్పుకున్నారని... కాని, ఇప్పుడు 6.03 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అంటున్నారని టీడీపీ..
AP Govt job calendar : పదిహేను రోజుల క్రితమే సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 4. 77 లక్షల ఉద్యోగాలిచ్చినట్టు చెప్పుకున్నారని… కాని, ఇప్పుడు 6.03 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అంటున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అయోమయం వ్యక్తం చేశారు. ఈ పక్షం రోజుల్లోనే 1.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశారా? అని యనమల ప్రశ్నించారు. రాష్ట్రంలో 2.3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 10 వేల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి చేతులు దులుపుకుంటారా? అని విమర్శించారు. ఉద్యోగ నియామకాలపై నిజంగా పారదర్శకత ఉండాలని భావిస్తే ఫోన్ నెంబర్లు, వివరాలు వెబ్ సైట్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం చెబుతున్నది అంకెల గారడీనే అని చెప్పుకొచ్చిన యనమల.. ఇంటికో ఉద్యోగమని చెప్పి మాట తప్పారని, తద్వారా కోటి మందికి ఉపాధి పోగొట్టారని ఆరోపించారు. ఆర్టీసీలో పనిచేసే 50 వేల మందిని విలీనం చేసి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినట్టు బోగస్ లెక్కలు చూపుతున్నారని ఆరోపించారు. కొవిడ్ సమయంలో 3 నెలల కోసం తీసుకున్న 26 వేల మందిని కూడా ఉద్యోగులుగా చూపడం విడ్డూరంగా ఉందన్నారు యనమల.
కాగా, వైసీపీ సర్కారు ఇవాళ తెచ్చిన జాబ్ క్యాలెండర్ మీద అటు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. “డూబు రెడ్డి ఉత్తుత్తి ఉద్యోగాల డాబు కాలెండర్ విడుదల చేసారు. 2 లక్షల 30 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగన్ హామీ ఇచ్చి అధికారంలోకొచ్చాకా నిరుద్యోగ యువతని మోసం చేసారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుని.. 54వేలు ఉద్యోగాలు కొత్తగా ఇచ్చినట్టు మోసపు ప్రకటన ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలకు వాలంటీర్లు,వార్డు / గ్రామసచివాలయల్లో పోస్టులు వేసుకుని జాబులిచ్చినట్టు హడావిడి చేస్తున్నారు.” అని లోకేష్ అన్నారు.
“వైసీపీకి దొంగ ఓట్లేయించే వైసీపీ కార్యకర్తల్ని వలంటీర్లుగా వేసుకోవడం వివక్ష లేకపోవడమా..? వార్డు, గ్రామసచివాలయ ఉద్యోగ భర్తీ పరీక్ష పేపరు అమ్మేయడం అవినీతికి తావులేకుండా భర్తీ చేసినట్టా? ఉద్యోగాలు అమ్ముకోవడం మీ భాషలో అత్యంత పారదర్శకతా? జే గ్యాంగ్ ప్రాణాంతక మద్యం బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్ అమ్మే ఉద్యోగాలూ గౌరవనీయమైన ప్రభుత్వ ఉద్యోగాలా?” అంటూ లోకేష్ తీవ్ర జగన్ సర్కారుని ప్రశ్నించారు.