Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పునరుజ్జీవం కోసం ప్రియాంక దూకుడు.. వారణాసి నుంచి పోటీకి సిద్ధం!
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం తేవడం కోసం ఆ పార్టీ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ప్రయత్నాలు వేగవంతం చేశారు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం తేవడం కోసం ఆ పార్టీ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ప్రయత్నాలు వేగవంతం చేశారు. వారణాసిలో అక్టోబర్ 10న ప్రచారం ప్రారంభించిన ప్రియాంక ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. వరుసగా అక్కడి నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ప్రియాంక నిర్వహించారు. ఈ సమావేశంలో తన ప్రధాన కార్యాలయాన్ని లక్నోకు తరలిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సమావేశాల్లోనే ఆమె ఎన్నికల వ్యూహానికి సంబంధించిన బ్లూప్రింట్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా తాను ఇకపై ఎన్నికలు పూర్తయ్యేవరకూ యూపీలోనే ఉంటాననీ.. ప్రతి వరం ఐదు జిల్లాలను కవర్ చేస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాననీ పేర్కొన్నారు.
ప్రియాంక గాంధీ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ప్రియాంక గాంధీ స్వయంగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. రాష్ట్రంలోని తూర్పు- పశ్చిమ ప్రాంతాల నుండి ఆమె పోటీ చేసే అవకాశం ఉందని ఆమె సన్నిహితుడు ఒకరు తెలిపారు. వీటిలో ఒక సీటు వారణాసి నుండి కాగా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ సీటు ఇంకా ఎంపిక కాలేదు. లక్నోలోని షీలా కౌల్ బంగ్లాను ప్రియాంక కాంగ్రెస్ వార్ రూమ్ గా మార్చారు. ఇక్కడే ఎన్నికల కోసం వ్యూహ రచనలు చేస్తున్నారు.
ప్రియాంక సిబ్బంది ఢిల్లీ నుంచి లక్నోకు మారుతున్నారు. నవంబర్ 14 న, కౌల్ నివాస్‌ను కాంగ్రెస్ ఎన్నికల ప్రధాన కార్యాలయంగా ప్రకటించాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. లఖింపూర్‌లో ఇటీవల జరిగిన హింసాకాండ తర్వాత ప్రియాంక గాంధీ బాధ్యతలు స్వీకరించిన విధానం, కార్యకర్తలలో కొత్త శక్తి కోసం పార్టీ ఆశలు పెట్టుకుంది. మహిళా ఓటర్లను ఆకర్షించడానికి, మహిళలకు 33% టిక్కెట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించవచ్చని ఆ వర్గాలు తెలిపాయి.
ముస్లిం ఓట్లపై కన్ను..
వచ్చే సంవత్సరంలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు వివిధ కారణాల రీత్యా చాలా కీలకం. అందుకే ఇప్పటి నుంచే యూపీ ఎన్నికలలో విజయం కోసం ఏమి చేయాలి.. ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలి? అభ్యర్ధుల ఎంపిక ఇటువంటి అన్ని విషయాలపై కసరత్తులు మొదలు పెట్టేసింది. వివిధ కులాలు, మతాల ప్రజల అవసరాలకు అనుగుణంగా, వారిని ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ భిన్నమైన ప్రణాళికలు వేసింది. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం, మదర్సాల్లో చదువుతున్న పిల్లలకు సహాయం చేయడం ద్వారా ముస్లిం ఓటర్ల మనస్సులో చొరబడటానికి కాంగ్రెస్ దృష్టి పెడుతోంది. ఇందుకోసం రాష్ట్రంలో ఉన్న 2 లక్షల మదర్సాల జాబితాను కూడా సిద్ధం చేశారు.
కాంగ్రెస్ ఓటు వాటా లెక్కలు ఇలా..
2017 అసెంబ్లీ ఎన్నికల్లో 47%, పార్లమెంట్ ఎన్నికల్లో 20 శాతం యాదవ్ ఓట్లు ఎస్పీతో ఉన్నాయి. ఇప్పుడు ఇందులో 28 నుంచి 30 శాతం ఓట్లు కాంగ్రెస్ పొందాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. ఇందులో 30 శాతం ఓట్లు సాధిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయడం సులభం అవుతుందని కాంగ్రెస్ లెక్క. దీనికి అదనంగా 20 శాతం ముస్లిం ఓటర్లను ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేలా కోరుతారు. ఇక బ్రాహ్మణులూ, యాదవ్ కాని ఒబీసీలు, దళితులూ బీజేపీ తో ఉంటారు. అందుకే కాంగ్రెస్ ప్రస్తుతం ముస్లిం ఓబీసీపై దృష్టి పెట్టింది.
NIA: జమ్మూకాశ్మీర్‌లో వరుస హత్యలపై కేంద్రం సీరియస్ యాక్షన్.. రంగంలోకి ఎన్ఐఏ..