పొలిటికల్ జర్నీ ఆపే ప్రసక్తే లేదు.. పవన్ కల్యాణ్
ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. పవన్ తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాలు రెండింటి లోనూ ఓటమి చెందడం పార్టీ వర్గాలను షాక్ కి గురి చేసింది. అయితే ఈ ఓటమితో పవన్ కుంగిపోలేదు. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాడు. పార్టీని మళ్ళీ గాడిన పెట్టేందుకు, మండల, గ్రామీణ స్థాయిలో బలోపేతం చేసేందుకు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించాడు. పార్టీ ఓటమికి దారి తీసిన కారణాలను విశ్లేషించేందుకు […]
ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. పవన్ తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాలు రెండింటి లోనూ ఓటమి చెందడం పార్టీ వర్గాలను షాక్ కి గురి చేసింది. అయితే ఈ ఓటమితో పవన్ కుంగిపోలేదు. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాడు. పార్టీని మళ్ళీ గాడిన పెట్టేందుకు, మండల, గ్రామీణ స్థాయిలో బలోపేతం చేసేందుకు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించాడు. పార్టీ ఓటమికి దారి తీసిన కారణాలను విశ్లేషించేందుకు అభ్యర్థులు, ఇతర నేతలతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. నిరాశ తగదని కేడర్ కు హితవు చెబుతున్నాడు కూడా. వారిలో మనోస్థైర్యాన్ని పెంచేందుకు..తన రాజకీయ ప్రయాణం సుదీర్ఘంగా కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ ప్రకటించడం విశేషం. ఓటమి చెందినా తాను ప్రజాసేవకే కట్టుబడి ఉంటానని, ప్రజలకు ఇఛ్చిన హామీల అమలుకు ప్రభుత్వంతో మాట్లాడి యత్నిస్తానని ఆయన పేర్కొన్నాడు. మా పార్టీ ఇఛ్చిన హామీలను మేం మరువలేదు అని పవన్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. శనివారం విజయవాడ నుంచి హైదరాబాద్ బయల్దేరిన ఆయన.. జూన్ 3 నుంచి తమ పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించవచ్చు. కాగా-ఈ ఓటమితో తాము ఆందోళన చెందడం లేదని, పొరబాట్లు సరిదిద్దుకుని తిరిగి పటిష్టమయ్యేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామని, ముఖ్యంగా రానున్న పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని పార్టీ అధికార ప్రతినిధి కళ్యాణ్ దిలీప్ సుంకర తెలిపారు. అటు-ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ ఒక్కరే గెలుపొందిన విషయం గమనార్హం.