AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Land Registration Value: తెలంగాణలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలి.. ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు

తెలంగాణాలో భూముల రిజిస్ట్రేషన్‌ విలువలను పెంచాలని రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూముల విలువలను సవరించాలని ప్రతిపాదించింది.

Land Registration Value: తెలంగాణలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలి.. ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు
Telangana Cabinet Sub Committee
Balaraju Goud
|

Updated on: Jun 29, 2021 | 6:20 PM

Share

Cabinet Sub committee on Land Registration Value: తెలంగాణాలో భూముల రిజిస్ట్రేషన్‌ విలువలను పెంచాలని రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూముల విలువలను సవరించాలని ప్రతిపాదించింది. రాష్ట్ర ఖజానా నిధుల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షత మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఇవాళ సమావేశమైంది. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.

ప్రజల పైన భారీగా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచేందుకు ఉన్న అవకాశాలపైన ఇప్పటికే పలుసార్లు సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ మంగళవారం మరోసారి భేటీ అయ్యింది. ఈ సందర్భంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గ ఉప సంఘం సుధీర్ఘంగా చర్చించింది. ‘‘రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచి రిజిస్ట్రేషన్‌ విలువను ప్రభుత్వం పెంచలేదు. ఏపీలో గడిచిన 8 ఏండ్లలో 7 సార్లు రిజిస్ట్రేషన్ల విలువలు పెరిగాయి. తమిళనాడులో రిజిస్ట్రేషన్‌ విలువ 7.5శాతంగా ఉంది. మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్‌ విలువ 7 శాతంగా ఉందని సబ్ కమిటీ అభిప్రాయపడింది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విలువల కన్నా ఎక్కువకే లక్షలాది రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. గత ఏడు సంవత్సరాలుగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి తరలివచ్చిన భారీ పెట్టుబడులు, నూతన పరిశ్రమల ఏర్పాటు,  నగర విస్తరణ వలన రియల్ భూమ్ వచ్చిందన్నారు. 2019 20 సంవత్సరానికి సంబంధించి హెచ్‌ఎండీఏ పరిధిలో అధిక విలువతోనే 51 శాతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. తక్కువ రిజిస్ట్రేషన్ విలువతో రుణాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

అటు, సాగు నీటి ప్రాజెక్టులు, వ్యవసాయాభివృద్ధితో గ్రామాల్లోనూ భూముల విలువ భారీగా పెరిగింది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని భూముల విలువ భారీగా పెరిగింది’’ అని కేబినెట్‌ సబ్‌ కమిటీ పేర్కొంది. ప్రభుత్వ నిర్ధారిత విలువల కన్నా అధిక మొత్తాల్లో భూములు, ఆస్తుల క్రయవిక్రయాలు జరుగుతున్న చాలామంది నిర్ధారిత ప్రభుత్వ విలువల మేరకే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని అధికారులు ఈ సందర్భంగా మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి  లావాదేవీల వలన సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న భూముల విలువల సవరణ వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉందని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీ ఒక నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు త్వరలోనే అందించాలని నిర్ణయం తీసుకుంది.

Read Also.. IRCTC: నాలుగో త్రైమాసిక ఫలితాలు.. ఆదాయం క్షీణించినా వందకోట్ల లాభం సాధించిన ఐఆర్సీటీసి..