AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR on Land Digital Survey: జూన్ 11 నుంచి తెలంగాణ‌లో భూమి డిజిట‌లైజేష‌న్.. సర్వే పూర్తి బాధ్యత ఏజెన్సీలదేః సీఎం కేసీఆర్

తెలంగాణలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చేయడంతో సహా భవిష్యత్​లో ఎలాంటి సమస్యలకు ఆస్కారం లేకుండా ప్రణాళికలు రూపొందిస్తోంది రాష్ట్ర సర్కార్.

CM KCR on Land Digital Survey: జూన్ 11 నుంచి తెలంగాణ‌లో భూమి డిజిట‌లైజేష‌న్.. సర్వే పూర్తి బాధ్యత ఏజెన్సీలదేః సీఎం కేసీఆర్
Cm Kcr Review On Land Digital Survey
Balaraju Goud
|

Updated on: Jun 02, 2021 | 7:14 PM

Share

Land Digital Survey in Telangana: తెలంగాణలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చేయడంతో సహా భవిష్యత్​లో ఎలాంటి సమస్యలకు ఆస్కారం లేకుండా ప్రణాళికలు రూపొందిస్తోంది రాష్ట్ర సర్కార్. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూ డిజిటల్ సర్వేకు సిద్ధమైంది. రాష్ట్రంలోని వ్యవసాయ భూముల సమగ్ర సర్వే చేపడతామన్న గతంలో ప్రకటించిన ప్రభుత్వం. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.400 కోట్లను కేటాయించింది. పూర్తిగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం,ఉపగ్రహఛాయాచిత్రాలు, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ విధానం సహాయంతో ఈ డిజిటల్ సర్వే ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి చర్చించేందుకు, ప్రగతి భవన్‌లో బుధవారం సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు డిజిటల్ సర్వే ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

తెలంగాణ‌లోని ప్రతి ఇంచు భూమిని డిజిట‌లైజేష‌న్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని, అందులో 3 గ్రామాలను గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎంపిక చేయాలని, మిగతా 24 గ్రామాలను రాష్ట్రంలోని ఇరవై నాలుగు జిల్లాలనుంచి ఎంపిక చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేదల భూమి హక్కుల రక్షణకోసమే ధరణి పోర్టల్ ను అమలులోకి తెచ్చామన్నారు. భూ తగాదాలు లేని భవిష్య తెలంగాణను నిర్మించే లక్ష్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ సర్వే చేయిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని వ్యవసాయ భూములను డిజిటల్ సర్వే చేసి, వాటికి అక్షాంశ రేఖాంశాలను ( కో ఆర్డినేట్స్) గుర్తించి తద్వారా పట్టాదారుల భూములకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యమని సీఎం పేర్కొన్నారు. ప్రజల భూమి హక్కులను కాపాడాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా చేపట్టిన డిజిటల్ సర్వేను సమర్ధవంతంగా నిర్వహించాలని సర్వే ఏజెన్సీలకు సూచించిన సీఎం.. వ్యాపారం కోణంలో కాకుండా రైతులకు సేవ చేసే ఉద్దేశ్యంతో సామాజిక సేవగా భావించి సర్వే నిర్వహించాలన్నారు.

పైలట్ సర్వేలో భాగంగా ముందుగా తగాదాలు లేని గ్రామాల్లో సర్వే నిర్వహించాలని తర్వాత అటవీ భూములు ప్రభుత్వ భూములు కలిసి వున్న గ్రామాలల్లో సర్వే నిర్వహించాలన్నారు. సమస్యలు లేని, సమస్యలున్న గ్రామాల్లో మిశ్రమంగా సర్వే నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి పూర్తి స్థాయి సర్వేకు విధి విధానాలను ఖరారు చేసుకోవాలని సీఎం సూచించారు. ముందుగా వ్యవసాయ భూముల సర్వే చేపట్టాలని, అవి పూర్తయిన అనంతరం పట్టణ భూముల సర్వే చేపట్టే అవకాశమున్నదని సీఎం అన్నారు.

తెలంగాణ అన్ని రంగాళ్లో అభివృద్ధి చెందుతుందని, వ్యవసాయ రంగంలో పంజాబ్‌ను మించి ధాన్యాన్ని పండించే పరిస్థితికి చేరుకున్నామన్న సీఎం.. భూములకు ధరలు కూడా పెరుగుతున్నాయన్నారు. ప్రజల భూములకు రక్షణ కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా మధ్య దళారీలు లేకుండా సామాన్య రైతును పీడించే వ్యవస్థలను తొలగించి పూర్తి పారదర్శకంగా వుండే విధంగా ధరణి పోర్టల్‌ను ప్రభుత్వం రూపొందించిందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. పీడింపులు లేకుండా రిజిష్ట్రేషన్ తదితర భూ లావాదేవీలు జరుగుతున్నాయని, ప్రజల నుంచి ప్రభుత్వం ప్రశంసలు అందుకుంటున్నది అని సీఎం తెలిపారు.

ఇక, డిజిటల్ సర్వే నిర్వహించే విధి విధానాల గురించి సీఎం కేసీఆర్ సర్వే ఏజెన్సీ ప్రతినిధులతో చర్చించారు. వారి కార్యాచరణ గురించి కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. రైతుల భూముల్లో ఇంచు కూడా తేడా రాకుండా కొలతలు వచ్చే విధంగా అత్యాధునిక సాంకేతికతను వినియోగించి సర్వే చేపట్టాలని వారికి సూచించారు. తేడాలు రాకుండా సర్వే చేయాల్సిన బాధ్యత సర్వే ఏజెన్సీలదేనని, ఏమాత్రం అలసత్వం వహించి నిర్లక్యం చేసి తప్పులకు తావిచ్చినా, చట్ట పరమైన చర్యలను తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడదని సీఎం సర్వే ఏజెన్సీల ప్రతినిధులకు స్పష్టం చేశారు.

గ్రామాల్లో సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న భూ సర్వే విధానంలో అవలంబిస్తున్న టీపన్ నక్షా విధానాన్ని ప్రాతిపదికగా చేసుకుని సర్వే నిర్వహించాలన్నారు. గ్రామ ప్రజలతో గ్రామ సభలను నిర్వహించి వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి సర్వే కార్యక్రమాలను చేపట్టాలని సీఎం సూచించారు. ఇదే క్రమంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు కావాల్సిన సహకారం ఏజెన్సీలకు అందిస్తుందని, సంబంధిత జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర ప్రజాప్రతినిధులు అందుబాటులో వుంటూ సర్వే ఏజెన్సీలకు సహకరిస్తారని సీఎం చెప్పారు.

Read Also…  ‘ఫ్రీ వ్యాక్సిన్ ప్లీజ్ !’ కేరళ అసెంబ్లీలో తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం, రాష్ట్రాలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లేఖ