AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదే నిజమైతే.. కేటీఆర్‌కు ఇబ్బందులు తప్పవేమో?

ఇచ్చిన మాట కోసం తల తెగనరుక్కునే వ్యక్తి తెలంగాణ సీఎం కేసీఆర్. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచారు. ఆయన తొలిసారి సీఎం అయిన దానికంటే రెండోసారి ముఖ్యమంత్రిగా అయినప్పటినుంచి రాష్ట్రంలో ఏదో వెలితి కనిపిస్తూనే ఉంది. అది పాలకపక్షం వైపు నుంచి ఉందా? లేక అధికారుల వైపు నుంచి ఉందా? అనే విషయంలో స్పష్టత లేకపోయినా.. కేసీఆర్ పాలనపై మాత్రం అన్ని వైపులనుంచి విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సార్వత్రిక ఎన్నికలకు […]

అదే నిజమైతే.. కేటీఆర్‌కు ఇబ్బందులు తప్పవేమో?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 21, 2019 | 9:49 PM

Share

ఇచ్చిన మాట కోసం తల తెగనరుక్కునే వ్యక్తి తెలంగాణ సీఎం కేసీఆర్. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచారు. ఆయన తొలిసారి సీఎం అయిన దానికంటే రెండోసారి ముఖ్యమంత్రిగా అయినప్పటినుంచి రాష్ట్రంలో ఏదో వెలితి కనిపిస్తూనే ఉంది. అది పాలకపక్షం వైపు నుంచి ఉందా? లేక అధికారుల వైపు నుంచి ఉందా? అనే విషయంలో స్పష్టత లేకపోయినా.. కేసీఆర్ పాలనపై మాత్రం అన్ని వైపులనుంచి విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది.

సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయలవైపు అడుగులు వేయాలని పలు ప్రయత్నాలు చేశారు. అవి బెడిసికొట్టిన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో ఓ వార్త చక్కర్లు కొట్టింది. కేసీఆర్ జాతీయ రాజకీయలవైపు వెళితే .. రాష్ట్రంలో పార్టీ బాధ్యతల్ని తనయుడు కేటీఆర్‌కు అప్పగిస్తారని. కానీ అది జరగలేదు. కనీసం కేటీఆర్‌కు మంత్రి పదవిని సైతం ఇవ్వలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించి పార్టీని నడింపించడం ఎలా? అనే దానిపైనే దృష్టి కేంద్రీకరించేలా చేశారు. ఇటీవలే కేటీఆర్‌కు మునుపటి శాఖలనే కేటాయిస్తూ మంత్రివర్గంలోకి తీసుకున్నారు సీఎం కేసీఆర్.

ఇక అసలు విషయానికొస్తే.. కేసీఆర్ తర్వాత ఆపార్టీ కేటీఆర్ చేతికే వస్తుందని అందరికీ తెలిసిందే. అదే సమయంలో ఒకవేళ సీఎం కుర్చీ నుంచి కేసీఆర్ తప్పుకుంటే ఆ పదవి కేటీఆర్‌నే వరిస్తుందని కూడా తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సమస్యలు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నట్టు కనిపిస్తోంది. దీనికి ఉదాహరణగా ఆర్టీసీ సమ్మెను చెప్పుకోవచ్చు. కార్మికులు సమ్మె నోటీసును నెలరోజుల ముందే ఇచ్చినట్టు చెబుతుంటే.. ఇది చట్ట విరుద్దమని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు సమ్మెకు దిగిన 48 వేలమంది ఆర్టీసీ కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్టేనంటూ స్వయంగా సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినట్టయ్యింది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇప్పటికే రెండు వారాలు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్ కూడా సక్సెస్ అయ్యింది. ఇదిలా ఉంటే ఆర్టీసీ సిబ్బందితో చర్చలు జరపాలని హైకోర్టు సూచించింది. అదే సమయంలో ప్రజలు తిరగబడితే ఆ శక్తిని ఎవ్వరూ ఆపలేరని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలు ఇబ్బందులు పడకూడదని కూడా ప్రభుత్వాన్ని సున్నితంగా హెచ్చరించింది.

సీఎం కేసీఆర్ ఒకవేళ తన రాజకీయ వారసునిగా కేటీఆర్‌ను ప్రకటించదలిస్తే.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న స్థితిలో ఏ వర్గం ఆయనకు ఏమాత్రం సహకరించే పరిస్థితి లేదని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఎందుకంటే సీఎం కేసీఆర్.. ఆర్టీసీ సమస్యను జఠిలం చేస్తున్నారు తప్ప పరిష్కరించే దిశగా అడుగులు వేయడం లేదనేది కొంతమంది వాదన. సీఎం కుర్చీని కేటీఆర్‌కు ఇవ్వదలిస్తే.. సున్నితంగా, ఆహ్లాదకరమైన వాతారణంలో ఇస్తే బాగుంటుంది తప్ప.. చుట్టూ అన్నీ సమస్యలు వెంటాడుతున్న సమయంలో రాజకీయ వారసత్వాన్ని ప్రకటిస్తే కేటీఆర్ చాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్.. మాత్రం భవిష్యత్తు రాజకీయాలను గమనించే ఇలా చేస్తున్నారా? లేదా? అనే అనుమానాలు పార్టీలో కొత్త చర్చకు తెరతీస్తున్నాయి.

ఇవన్నీ ఇలా ఉంటే.. టీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా మరో వార్త కూడా చక్కర్లు కొడుతుందట. అది మంత్రి హరీష్‌రావు గురించి. ఇంతకాలం ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పక్కకు పెట్టారని, ప్రస్తుతం రాష్ట్రం అప్పుల పాలై ఉన్న సమయంలో విధిలేని పరిస్థితిలో ఆర్ధిక శాఖను అప్పగించారని చెప్పుకుంటున్నారట. ఇదే గనుక నిజమైతే హరీశ్‌రావు అనే అగ్నిపర్వతం ఏదో ఒకరోజు విస్పోటనం చెందడం ఖాయమని కూడా కొంతమంది చెవులుకొరుక్కుంటున్నారట.

ఏది ఏమైనా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తున్న రాజకీయ విశ్లేషకులు మాత్రం.. సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న చర్యలు.. భవిష్యత్తులో కేటీఆర్‌కు ప్రతిబంధకంగా మారే ప్రమాదం ఉందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.