AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress: కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతోంది? మే 2 ఎందుకు అధిష్టానానికి కీలకంగా మారింది? స్పెషల్ స్టోరీ!

భారతదేశ చరిత్రలో అతి పురాతన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండుగా చీలిపోయే పరిస్థితిలో ఉందా? ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉన్న ఆ 23 మంది కాంగ్రెస్ నేతలూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? దశా..దిశా కోల్పోయి..నాయకత్వ సంక్షోభంతో అల్లాడుతున్న కాంగ్రెస్ నావ రాబోయే రోజుల్లో ముక్కలు కానుందా?

Congress: కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతోంది? మే 2 ఎందుకు అధిష్టానానికి కీలకంగా మారింది? స్పెషల్ స్టోరీ!
Congress
KVD Varma
|

Updated on: Apr 10, 2021 | 1:59 PM

Share

Congress: భారతదేశ చరిత్రలో అతి పురాతన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండుగా చీలిపోయే పరిస్థితిలో ఉందా? ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉన్న ఆ 23 మంది కాంగ్రెస్ నేతలూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? దశా..దిశా కోల్పోయి..నాయకత్వ సంక్షోభంతో అల్లాడుతున్న కాంగ్రెస్ నావ రాబోయే రోజుల్లో ముక్కలు కానుందా? ఈ ప్రశ్నలన్నిటికీ రాజకీయ విశ్లేషకులు అవును అనే సమాధానం చెబుతున్నారు. 130 ఏళ్ల కాంగ్రెస్ కు సంక్షోభాలు కొత్త కానప్పటికీ.. ఇప్పుడున్నంత బేల స్థితిలో గతంలో ఎప్పుడూ లేదని వారు చెబుతున్నారు. కాంగ్రెస్ భవితవ్యం ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఆధారపడి ఉందని వారి అంచనా. కచ్చితంగా ఆ ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీలో ముసలం ముదరడం ఖాయమనీ, పార్టీ చీలిపోయే అవకాశాలు ఎక్కువే ఉన్నాయనేది ఒక అంచనా.

ఎందుకిలా?

కాంగ్రెస్ పార్టీ.. దేశంలోనే అతి పెద్ద.. పురాతన పార్టీ. ఆ పార్టీకి ఉన్న ఘనమైన చరిత్ర ఇంకే పార్టీకీ లేదు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన ప్రధానులను అందించిన పార్టీ కాంగ్రెస్. ప్రస్తుతం మాత్రం తీవ్ర సంక్షోభంలో ఉంది. అధికారం లేకపోవడం ఒకటే కాదు.. పార్టీకి సరైన దిశానిర్దేశం చేసే నాయకులు లేకపోవడం కాంగ్రెస్ దుస్థితికి కారణం. వారసత్వ రాజకీయాలనే నమ్ముకుని ముందుకు సాగిన పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు ఆ వారసత్వ రాజకీయాలతోనే ఆ పార్టీ పుట్టి మునగబోతోంది.

G 23 Leaders

G 23 Leaders

2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తర్వాత ఆ పార్టీలోని సీనియర్ నాయకులు 23 మంది కాంగ్రెస్ పై తిరుగుబాగు బావుటా ఎగరేశారు. ఈ 23 మంది అసమ్మతి వాదులూ కాంగ్రెస్ లో గట్టి ప్రకంపనలే రేపారు. వీరంతా కల్సి సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ నాయకత్వంలో కాంగ్రెస్ అధిష్టానానికి లేఖాస్త్రం సంధించారు. కాంగ్రెస్ పార్టీలోని నాయకత్వ లేమిని అందులో గట్టిగా ప్రస్తావించారు. అయితే, అప్పట్లో సోనియా గాంధీ జోక్యంతో.. రాహుల్ గాంధీ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవడంతో ఆ గొడవ సర్దుమణిగినట్టు కనిపించింది. కానీ,అంతర్గతంగా మాత్రం జీ23 గా పేర్కొనే ఈ అసమ్మతి నుంచి సమస్యలు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటూనే ఉంది.

ఇప్పుడే ఎందుకు?

ఇప్పుడు మళ్ళీ ఈ జీ 23 తెరమీదకు వచ్చింది. ఈ కాంగ్రెస్ అసమ్మతి నాయకులు పలు దఫాలుగా ఇటీవల సమావేశం అయినట్టు రాజకీయవర్గాల్లో చెప్పుకుంటున్నారు. దాదాపుగా అందరూ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ, ఎలా అనేదానిపైనే వారిమధ్య చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ నాయకుల్లో కొంత మంది కొత్తపార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. మరికొంతమంది కాంగ్రెస్ లోనే చీలిక తెచ్చి వేరు కుంపటి పెట్టాలని అంటున్నారు.

Congress 1

 

గత మార్చిలో సమావేశమైన ఈ నాయకులంతా ఎటువంటి పరిస్థితిలోనూ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనసాగడం కష్టమనే ఏకాభిప్రాయానికి వచ్చారట. అయితే, వెంటనే ఏదోఒకటి చేయడం కన్నా.. సమయం చూసి కార్యాచరణకు పూనుకోవాలని నిర్ణయించారట. ఆ ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్ట్టు వినికిడి. అది మే 2 వ తేదీ. అప్పుడే ఎందుకంటే అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ఐదు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున ఆ ఎన్నికలు ముగిసి..ఫలితాలు వచ్చిన తరువాత ఏం చేయాలనేది నిర్ణయించాలని అందరూ అనుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

ఎన్నికల్లో ఫలితాలే కాంగ్రెస్ కు కీలకం!

ఇప్పడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ భవిష్యత్ ను నిర్ణయిస్తామని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పట్టు సాధించగలిగితే జీ23 అసమ్మతి వాదులంతా కొంతవరకూ వెనక్కి తగ్గే అవకాశాలున్నాయి. ఒకవేళ ఫలితాల్లో తేడా కొడితే మాత్రం వెంటనే అసమ్మతి రాగం ఊపందుకోవడం ఖాయం. ఈ నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చావో రేవో అన్నట్టుగా అయిపోయాయి. కానీ, ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతున్న తీరు చూస్తుంటే.. విశ్లేషణలు ఫాలో అయితే.. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా అధికారం మాట దేవుడెరుగు ఎక్కడా కూడా రెండో స్థానంలోకి కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

ఏం జరగొచ్చు?

కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బోర్లా పడితే కనుక జీ 23 అసమ్మతి నేతలు అందరూ ఒక్కసారిగా కాంగ్రెస్ అధినాయకత్వం పై మాటల దాడి చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా నివురుగప్పిన నిప్పులా మిగిలిపోయిన నాయకత్వ సమస్యపై ముందు వీరంతా గట్టిగా మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అసమ్మతి నాయకులు తమ స్టాండ్ తీసేసుకున్నారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఐదు రాష్టాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాభవాన్ని మూటగట్టుకుంటే.. అంతకంటే పెద్ద పరాభవ ప్రమాదం మే 2 వ తేదీ తరువాత పార్టీకి ఎదురవుతుంది.

Sonia And Rahul

Sonia And Rahul

అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ముందు రెండే అషన్స్ ఉంటాయి.. ఒకటి అసమ్మతి నేతలు ఎత్తి చూపిస్తున్న కాంగ్రెస్ అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టి.. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లడం. రెండు అసమ్మతి నాయకులను పూర్తిగా పార్టీ నుంచి బయటకు నెట్టేయడం. కాంగ్రెస్ అధినాయకత్వ తీరు తెలిసిన వారికీ మొదటిది కచ్చితంగా అయ్యేపని కాదని అర్ధం అయిపోతుంది. ఇక రెండోది జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ కాంగ్రెస్ నాయకత్వం రెండో ఆప్షన్ ఎన్నుకునే లోపు ఈ జీ23 అసమ్మతి నేతలు పార్టీ చీల్చే కార్యక్రమానికి తెర తీస్తే మాత్రం కాంగ్రెస్ నాయకత్వానికి తలబొప్పి కట్టడం ఖాయం.

Also Read: West Bengal Election 2021: హాట్.. హాట్ డైలాగులు.. ఒకరిపై మరొకరు ఆరోపణలు.. మరో మూడు అడుగుల దూరంలో ప్రచారం

Rahul Gandhi: వ్యాక్సినేషన్ తో ‘పండగ’ చేసుకోవడం కాదు.. రాష్ట్రాలకు సక్రమంగా పంపండి..రాహుల్ గాంధీ  తీవ్ర వ్యాఖ్యలు