ఢిల్లీలో కోమటిరెడ్డి మకాం.. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు.. తాజాగా కిషన్ రెడ్డిని కలిసి ఏం చర్చించారంటే
ఎంతో చారిత్రక వైభవం కలిగిన భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని కేంద్రానికి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఎంతో చారిత్రక వైభవం కలిగిన భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని కేంద్రానికి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి లేఖను న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసి అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా నియమితులైనందుకు కిషన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. నూతనంగా చేపట్టిన పర్యాటక రంగంలో నూతన విధానాలు తీసుకువచ్చి యావత్ దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాక్షించారు. అలాగే భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న చారిత్రక ప్రదేశం భువనగిరి కోట అభివృద్ధికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యక్తిగా కిషన్ రెడ్డికి భువనగిరి కోట విశిష్టత తెలుసన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రాష్ట్ర సర్కార్ కోట అభివృద్ధికి సహకరించడం లేదని వెల్లడించారు. దేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు కాలగమనంలో చరిత్రలో కలిసి పోయాయని.. పట్టించుకోకుంటే భువనగిరి కోట అలాగే అవుతుందన్నారు. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి కోట అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని కోరారు. కాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నిధులను వెంటనే మంజూరు చేస్తామని హామి ఇచ్చారు.
కాగా శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాని మర్యాదపూర్వకంగా కలిశారు కోమటిరెడ్డి. బీబీనగర్ ఎయిమ్స్‌లో చేరబోయే 3వ బ్యాచ్ విద్యార్థులకు ఉపయోగపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవనం ఇతర వసతుల సమకూర్చాలని కోరారు. భవన సముదాయ నిర్మాణానికి వారం రోజుల్లో టెండర్లు పిలుస్తున్నట్లుగా వెల్లడించారు కోమటిరెడ్డి.
Also Read: నేడే రోదసిలోకి తెలుగమ్మాయి శిరీష.. 90 నిమిషాల ప్రయాణం.. ఇంట్రస్టింగ్ విషయాలు