ఆ షాప్‌లకు 100 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు.. హామీ నిలబెట్టుకునేందుకు టీ సర్కార్‌ కసరత్తు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు మొదలు పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా..

ఆ షాప్‌లకు 100 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు.. హామీ నిలబెట్టుకునేందుకు టీ సర్కార్‌ కసరత్తు
Follow us
K Sammaiah

|

Updated on: Feb 25, 2021 | 12:05 PM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు మొదలు పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు, ధోబీ ఘాట్లు, లాండ్రీలకు ప్రతి నెలా 100 యూనిట్లలోపు విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేయాలని సర్కార్‌ భావిస్తోంది. సెలూన్లు, ధోబీ ఘాట్లు, లాండ్రీ షాపులకు గత డిసెంబర్‌ నుంచి ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తామని జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించి వివరాలను సేకరించాయి. ఇందులో ఏసీ సెలూన్లు, స్పాలు, వాషింగ్‌ మెషీన్లు వంటి యంత్రాలు వినియోగించే డ్రైక్లీనింగ్‌ షాపులు, లాండ్రీలకు మినహాయింపు ఇచ్చాయి. మిగిలిన సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లలో 85 శాతం వరకు నెలకు 100 యూనిట్లలోపు విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తున్నట్టు సర్వేలో తేలింది.

ఎలాంటి యంత్రాలు వినియోగించని ధోబీ ఘాట్లు, లాండ్రీలు రాష్ట్రం మొత్తం మీద కేవలం 900లోపు మాత్రమే ఉన్నట్టు సర్వేలో తేలింది. వీటన్నింటికి కలిపి నెలకు రూ.30 లక్షల లోపు విద్యుత్‌ బిల్లులు వస్తున్నాయి. నాన్‌ ఏసీ సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లకు ఏటా రూ.14.4 కోట్ల వరకు విద్యుత్‌ బిల్లులు వస్తున్నట్టు డిస్కంల పరిశీలనలో తేలింది. సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్‌ సరఫరాపై ఇటీవల సీఎం కేసీఆర్‌కు పంపించిన నివేదికలో డిస్కంలు ఈ వివరాలను పొందుపర్చాయి.

85 శాతం నాన్‌ ఏసీ సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లు 100 యూనిట్లలోపు విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తున్నాయని ఈ నివేదికలో పొందుపర్చాయి. ఉచిత విద్యుత్‌ సరఫరా కోసం సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లు కలిపి మొత్తం 12 వేల విద్యుత్‌ కనెక్షన్లను గుర్తించినట్టు నివేదించాయి. ఈ కేటగిరీల వినియోగదారులకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఏటా రూ.15 కోట్లను డిస్కంలకు సబ్సిడీగా ఇవ్వాల్సి ఉంటుంది.

విద్యుత్‌ సంస్థల సీఎండీలతో త్వరలో సీఎం కేసీఆర్‌ నిర్వహించనున్న సమీక్షలో ఈ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుని ప్రకటన చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇటు గత డిసెంబర్‌ నుంచి చెల్లించిన విద్యుత్‌ బిల్లుల మాఫీ అంశాన్ని సీఎం పరిశీలించే అవకాశంఉన్నట్లు తెలుస్తుంది.

Read more:

మున్సిపాల్టీలో మీకు పని ఉందా..? అయితే ఒక్కో పనికి ఒక్కో రేటు.. సంచలనం రేపుతున్న సిబ్బంది ఆడియో రికార్డ్స్