AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ పాట నేను వంద సార్లు విన్నా.. మీరు కూడా విని ప్రజల కష్టాలు తీర్చండి.. మేయర్‌, డిప్యూటీ మేయర్లకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

నూతనంగా ఎన్నికైన జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌లకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు..

ఆ పాట నేను వంద సార్లు విన్నా.. మీరు కూడా విని ప్రజల కష్టాలు తీర్చండి.. మేయర్‌, డిప్యూటీ మేయర్లకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు
K Sammaiah
|

Updated on: Feb 11, 2021 | 4:38 PM

Share

నూతనంగా ఎన్నికైన జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌లకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతున్నదని, ఈ నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటు పడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు.

కొత్తగా ఎన్నికైన జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, టిఆర్ఎస్ కార్పొరేటర్లు గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కర్తవ్యబోధ చేశారు. ‘‘కోట్లాది మందిలో కేవలం కొద్ది మందికి మాత్రమే సందర్భం కలిసి వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుంది. అది గొప్ప విషయం కాదు. ప్రజా ప్రతినిధిగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా జీవితంలో మంచి పేరు తెచ్చుకోవడం గొప్ప విషయం. మంచిగ ఉంటెనే బట్టకాల్చి మీదేసే రోజులివి. కొద్దిగా అవకాశం ఇస్తే చాలా చెడ్డపేరు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి హితవు పలికారు.

పదవిలో ఉన్న వారు ఎంతో సంయమనంతో, సహనంతో, సాదాసీదాగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో సహజత్వం కోల్పోవద్దు. వేష, భాషల్లో మార్పులు రావద్దు. అసంబద్ధంగా, అవసరం లేని మాటలు మాట్లాడితే వచ్చే లాభమేమీ లేకపోగా కొన్ని సందర్భాల్లో వికటించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. మీ దగ్గరికి వచ్చే వాళ్ల కులం, మతం చూడవద్దు. ప్రతీ ఒక్కరిని ఆదరించాలి. అక్కున చేర్చుకోవాలి. వారికి సరైన గౌరవం ఇవ్వాలి. వారు చెప్పేది ఓపిగ్గా వినాలి. చేతనయినంత సాయం చేయాలి. అబద్దాలు చెప్పవద్దు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది అనే గోరటి వెంకన్న పాట వినండి. నేను వంద సార్లు విన్నా. అందులో బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలున్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి. మేయర్, కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించాలి. వారి బాధలు అర్థం చేసుకోవాలి. పేదలను ఆదరించాలి. బస్తీ సమస్యలు తీర్చాలి. అదే ప్రధాన లక్ష్యం కావాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

హైదరాబాద్ నగరానికి అనేక అనుకూలతలున్నాయి. మంచి భవిష్యత్ ఉన్నది. నిజమైన విశ్వనగరమిది. బయటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్థిరపడిన అనేక మంది ఉన్నారు. నగరంలో సింథ్ కాలనీ ఉంది. గుజరాతి గల్లీ ఉంది. పార్సీగుట్ట ఉంది. బెంగాలీలున్నారు. మలయాళీలున్నారు. మార్వాడీలున్నాయి. ఖాయస్తులున్నారు. ఇలా విభిన్న ప్రాంతాల వారు, విభిన్న మతాల వారు, విభిన్న సంస్కృతుల వారున్నారు. వారంతా హైదరాబాదీలుగా గర్విస్తున్నారు. హైదరాబాద్ ఓ మినీ ఇండియాలాగా ఉంటుంది. అందరినీ ఆదరించే ప్రేమగల్ల నగరం. ఇంత గొప్ప నగరం భవిష్యత్తు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల మీద ఉన్నది. మీరు గొప్పగా పనిచేసి ఈ నగర వైభవాన్ని పెంచాలి. అన్ని వర్గాల ప్రజలను ఆదరించాలి. ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతుంది. వాటికి సహకరించాలి అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

ఇంత మంది కార్పొరేటర్లున్నారు. కానీ ఒక్కరికే మేయర్ గా అవకాశం దక్కుతుంది. మీలో మేయర్ కావాల్సిన అర్హతలున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ అందరికీ ఇవ్వలేము. నా పరిస్థితుల్లో మీరున్నా అంతే చేయగలరు. అర్థం చేసుకుని, అందరూ కలిసి కట్టుగా ఈ నగరాన్ని ముందుకు తీసుకుపోవాలని సిఎం కేసీఆర్ అన్నారు. కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవ రావు, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, సంతోష్ కుమార్, మంత్రులు తలసాని శ్రీనివాస్, మహమూద్ అలీ, ఐకె రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read more:

ఉన్నత విద్యావంతురాలైన నూతన మేయర్‌.. తండ్రి రాజకీయ వారసత్వం కోసం విజయలక్ష్మి ఏం చేసిందో తెలుసా..?