Calcutta HC on Mamata: బెంగాల్ సీఎం మమతాపై కోల్‌కత్తా హైకోర్టు సీరియస్.. అలస్యంగా అఫిడవిట్ దాఖలు చేయనందుకు ఫైన్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కోల్‌కత్తాహైకోర్టు జరిమానా విధించింది. నారదా కేసుకు సంబంధించి సరియైన సమయంలో అఫిడవిట్ దాఖలు చేయనుందుకుగానూ రూ. 5వేల ఫైన్.
Calcutta High Court fines Bengal CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కోల్‌కత్తాహైకోర్టు జరిమానా విధించింది. నారదా కేసుకు సంబంధించి సరియైన సమయంలో అఫిడవిట్ దాఖలు చేయనుందుకుగానూ రూ. 5వేల ఫైన్ వేసింది. ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్ నాయకుల అరెస్టు సందర్భంగా వ్యవహరించిన తీరుపై సమాధానం ఇచ్చేందుకు సీఎం మమతా బెనర్జీకి కోల్‌కత్తాహైకోర్టు అనుమతినిచ్చింది.
నారదా కుంభకోణానికి సంబంధించి ఇద్దరు మంత్రులు సహా నలుగురు నాయకులను మే 17న సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ మమతా బెనర్జీ సీబీఐ కార్యాలయంలో నిరసన చేపట్టారు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మలయ్ ఘటక్ కేసు విచారణ జరుగుతున్న కోర్టు ప్రాంగణానికి వెళ్లి ఆందోళన చేపట్టారు. దీనిపై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కేసును కింది కోర్టు నుంచి హైకోర్టే స్వీకరించాలంటూ దావా వేసింది.
దీంతో హైకోర్టు కేసు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో నాయకుల అరెస్టు జరిగిన రోజు తాము వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి, న్యాయమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం జూన్ 9న హైకోర్టుకు సమాధాన అఫిడవిట్ సమర్పించగా.. న్యాయస్థానం వాటిని తిరస్కరించింది. కోర్టు చెప్పిన సమయం కాకుండా తమకు నచ్చినప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తే వాటిని స్వీకరించబోమని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీంతో హైకోర్టు తీర్పుపై మమతా బెనర్జీ, న్యాయమంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి అభ్యర్థనపై గతవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. మమతా బెనర్జీ, తదితరులు ఇచ్చిన సమాధానాన్ని కోల్‌కత్తాహైకోర్టు స్వీకరించకపోవడం చట్టబద్ధం కాదని వ్యాఖ్యానించింది. వారి అఫిడవిట్లను రికార్డు చేయడంతో పాటు కేసును మళ్లీ మొదటి నుంచి విచారించాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో కొత్తగా ఆఫిడవిట్ దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలంటూ బెంగాల్ సీఎం దీదీ గత సోమవారం కోల్‌కత్తా హైకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును అంగీకరించిన న్యాయస్థానం.. సరైన సమయంలో అఫిడవిట్లు ఇవ్వనందుకు గానూ దీదీ, బెంగాల్ ప్రభుత్వానికి రూ. 5వేల జరిమానా విధించింది.
Read Also…. Kavitha Husband dies: సినీ నటి కవిత ఇంట మరో విషాదం.. ఆమె భర్త దశరథ రాజు కోవిడ్‌తో మృతి