BJP Strategy in Haryana: అక్టోబర్ 17న హర్యానా కొత్త సీఎం ప్రమాణస్వీకారం.. ఆ రోజు ఓ ప్రత్యేకం!

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది. అక్టోబరు 16న జరిగే శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రిని ఎన్నుకోనుంది.

BJP Strategy in Haryana: అక్టోబర్ 17న హర్యానా కొత్త సీఎం ప్రమాణస్వీకారం.. ఆ రోజు ఓ ప్రత్యేకం!
Pm Modi Nayab Singh Saini
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Balaraju Goud

Updated on: Oct 14, 2024 | 12:23 PM

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది. అక్టోబరు 16న జరిగే శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రిని ఎన్నుకుని , 17న ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 17వ తేదీని ముహూర్తంగా ఎంచుకోడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. అందులో బీజేపీ రాజకీయ వ్యూహం కూడా దాగుంది.

రామాయణ ఇతిహాసాన్ని రచించిన వాల్మీకి మహర్షి జయంతి ఈసారి అక్టోబర్ 17న వచ్చింది. అలాంటి పర్వదినాన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వాల్మీకి సమాజానికి ఓ సందేశం ఇవ్వాలని చూస్తోంది. వాల్మీకి ‘బోయ’ కులానికి చెందినవాడని అందరికీ తెలుసు. వాల్మీకి బోయలు తెలుగు రాష్ట్రాల్లో ఓబీసీ జాబితాలో ఉండగా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ST) జాబితాలో ఉన్నారు. కర్ణాటకలో షెడ్యూల్డ్ కులాల (SC) జాబితాలో ఉండగా, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఎస్సీలుగానే పరిగణిస్తున్నారు. వాల్మీకి జయంతిని ఈ సామాజికవర్గం ప్రజలు పర్గత్ దినంగా జరుపుకుంటారు.

ఎన్నికల రాజకీయాల్లో కులాలు, సామాజికవర్గాలు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మూడోసారి గెలుపొందిన బీజేపీ, తమ గెలుపులో దళిత వర్గం పాత్రను గుర్తిస్తూ.. వారిని తమతోనే కట్టిపడేసుకునే వ్యూహంలో భాగంగా వాల్మీకి జయంతి నాడు హర్యానా కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీరేలా ఏర్పాట్లు చేసింది. వాల్మీకి జయంతిని సెలవు దినంగా హర్యానా ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది.

బీజేపీ మార్క్ సోషల్ ఇంజనీరింగ్

భారత రాజకీయాల్లో కొన్ని సామాజికవర్గాలు, కులాలను కొన్ని రాజకీయ పార్టీలకు బలమైన ఓటుబ్యాంకుగా పరిగణిస్తుంటాయి. ఆ క్రమంలో మొదటి వరుసలో ముస్లిం మైనారిటీలు, ఆ తర్వాత దళిత, ఆదివాసీలు కనిపిస్తుంటారు. ఈ వర్గాల ఓటర్లలో ఐక్యత, గంపగుత్తగా ఒకవైపే ఓటేసే స్వభావం వీరిని కొన్ని పార్టీలకు ఓటుబ్యాంకుగా మార్చేసింది. సమాజంలో అధిక సంఖ్యలో ఉండే ఇలాంటి వర్గాలను ఆకట్టుకుంటూ కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీలు కొన్ని దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ వచ్చాయి. ఇప్పటికీ చేస్తున్నాయి. హిందూ అస్థిత్వం ప్రధాన ముడిసరుకుగా రాజకీయం చేస్తున్న కమలదళం.. కాంగ్రెస్ ఓటు బ్యాంకును చెదరగొడితే తప్ప విజయాలు సాధించలేమన్న విషయాన్ని గుర్తించింది.

ముస్లిం మైనారిటీలను ఎలాగూ తమవైపు తిప్పుకోలేమని భావించిన బీజేపీ మిగతా ఓటుబ్యాంకు వర్గాలను కాంగ్రెస్ నుంచి దూరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కారణంగా నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన అగ్రవర్ణాలు, ఓబీసీ వర్గాలను సైతం ఏకం చేయడంలో కొంతమేర సఫలమైంది. ఇప్పుడు తమ పార్టీ అంత్యోదయ విధానాల ద్వారా ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు వారికి అందేలా చూస్తూ.. మరోవైపు పార్టీ వైపు ఆకర్షితులను చేసుకుంటోంది. దీన్ని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి దగ్గరవుతున్న దళితులను దూరం చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చేస్తారని, రిజర్వేషన్లు తొలగిస్తారని విస్తృతంగా ప్రచారం చేసింది. కొందరు బీజేపీ నేతల నోటి దురుసు వ్యాఖ్యలు సైతం కాంగ్రెస్ ప్రయత్నాలకు ఊతమిచ్చినట్టయింది. ఫలితంగా చావుతప్పి కన్ను లొట్టపోయిన స్థితిలో మిత్రపక్షాల సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితికి బీజేపీ చేరుకుంది.

ఈ ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న కమలదళం అగ్రనాయకత్వం.. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వాటి ఫలితం కనిపించింది. రాష్ట్రంలో సంఖ్యాబలం ప్రకారం జాట్ల తర్వాత రెండవ అతిపెద్ద సమూహం దళితులే. రాష్ట్ర జనాభాలో 21 శాతం వరకు దళితులున్నారు. జాట్-దళిత్ ఓటుబ్యాంకు ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో 10కి 5 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఇదే కాంబినేషన్‌తో అధికారం సాధించాలని ప్రయత్నించింది. కాంగ్రెస్ ప్రయత్నాలకు బ్రేకులు వేసేందుకు.. ఆ పార్టీలోని దళిత నేత, సీఎం అభ్యర్థి రేసులో ఉన్న ఎంపీ కుమారి శెల్జా ‘అలక’ను బీజేపీ ‘ఆయుధం’గా మలచుకుంది. శెల్జా అంశాన్ని దళితుల ఆత్మాభిమానంతో ముడిపెట్టి వారిని కాంగ్రెస్ పార్టీకి కొంతమేర దూరం చేయగలిగింది. కాంగ్రెస్‌ను దళిత వ్యతిరేకిగా, పెత్తందారీ వర్గాల అనుకూల పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. తాజాగా వాల్మీకి జయంతి రోజున ప్రమాణ స్వీకార కార్యక్రమం ద్వారా దళిత వర్గాలకు బలమైన సందేశాన్ని పంపే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు వాల్మీకి పేరు

సార్వత్రిక ఎన్నికలకు ముందు హడావుడిగా ప్రారంభించిన అయోధ్య రామాలయంతో పాటు ఆ పట్టణంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. రామాయణ ఇతిహాసాన్ని రచించిన మహర్షి వాల్మీకి పేరును ఆ ఎయిర్‌పోర్టుకు పెట్టడం ద్వారా పురాణ, ఇతిహాస ముఖ్యులకు తమ ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత ఏంటో చాటిచెప్పే ప్రయత్నం చేసింది. అప్పటి వరకు రోడ్ల నుంచి విమానాశ్రయాలు, విశ్వవిద్యాలయాల వరకు గత ఇందిర, రాజీవ్, నెహ్రూ వంటి ఒకే కుటుంబ నేతల పేర్లు ఎక్కువగా పెట్టేవారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వివిధ సాధువులు, మత చిహ్నాల పేరుతో వివిధ సమాజాలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది.

2015 అక్టోబర్‌లో హర్యానాలోని నాటి ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఒక యూనివర్సిటీకి మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. 2016లో అక్టోబర్ 17న వాల్మీకి జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. జూన్ 2021లో, మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని మంత్రివర్గం కైతాల్ విశ్వవిద్యాలయం పేరును మహర్షి వాల్మీకి సంస్కృత విశ్వవిద్యాలయంగా మార్చింది. పానిపట్‌లోని రైల్వే రోడ్డు కూడలికి మహర్షి వాల్మీకి చౌక్‌గా నామకరణం చేసింది. వాల్మీకి మహర్షి కలలుగన్న రామరాజ్యాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, దళితులను తమవైపు తిప్పుకునే వ్యూహంతో వ్యవహరిస్తోంది. వాల్మీకి జయంతి కాకుండా, ఇతర సాధువుల సహకారాన్ని కూడా బీజేపీ గుర్తించింది. జూన్ 2022లో చండీగఢ్‌లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ‘సంత్ కబీర్ కుటీర్’గా వ్యవహరించడం మొదలుపెట్టింది. ఇలా ప్రతి అడుగులో పురాణేతిహాసాలు, సనాతన ధర్మంతో పాటు సామాజిక సమీకరణాలతో కమలదళం జాగ్రత్తలు తీసుకుంటోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..