న్యూఢిల్లీ : పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ఆయా పార్టీలు స్టార్ క్యాంపెయినర్లను ప్రకటిస్తున్నాయి. అయితే తాజాగా భారతీయ జనతా పార్టీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆ పార్టీ అగ్ర నేతలకు షాకిచ్చింది. పార్టీని రెండు సీట్ల నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చిన ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు చోటు దక్కలేదు. మొత్తం 40 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా బీజేపీ ప్రకటించింది. అయితే ఇప్పటికే లోక్‌సభ ఎన్నికలకు వీరిద్దరిని దూరంగా పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో వారిద్దరి పేర్లు లేకపోవడంతో కొంతమంది బీజేపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, ఉమా భారతి, నిర్మలా సీతారామన్, యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు.