Jamun Tree Leaves: నేరేడు పండ్లు మాత్రమే కాదండోయ్.. ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
నేరేడు పండ్లు మాత్రమే కాదు.. ఈ చెట్టు ఆకులు కూడా ఎన్నోరకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేరేడు ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయని చెబుతున్నారు. ఇవి అనేక వ్యాధులను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయని అంటున్నారు. నేరేడు ఆకులతో అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నేరేడు చెట్టు ఆకులు, బెరడు, కాయలు ఇలా మొత్తం అన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉపయోగపడతాయని అంటున్నారు. నేరేడు ఆకుల ద్వారా చాలా రకాల వ్యాధులను తగ్గించవచ్చు అంటున్నారు. ఆయా లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం...
Updated on: Jun 08, 2025 | 12:38 PM

మధుమేహం బాధితులకు నేరేడు ఆకులు వరంగా చెబుతున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. నేరేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు రక్తంలో చక్కెర నెమ్మదిగా విడుదల అయ్యేలా చేస్తాయి. దీంతో క్రమంగా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.

నేరేడు ఆకుల నుంచి రసం తీసి పావు టీస్పూన్ చొప్పున భోజనానికి ముందు తీసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. లేదంటే, ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజుకు 2 సార్లు భోజనానికి అరగంట ముందు ఒక కప్పు మోతాదులో తీసుకుంటూ ఉంటే.. మీ బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి నేరేడు ఆకులతో ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు.

నేరేడు ఆకుల్లో ఉండే సమ్మేళనాలు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. తరచూ విరేచనాల సమస్యతో బాధపడేవారు నేరేడు ఆకుల కషాయాన్ని తాగితే ఉపశమనం పొందుతారు. కాలేయం పనితనం మెరుగుపడడానికి కూడా నేరేడు ఆకుల కషాయం ఎంతో మేలు చేస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

జ్వరం నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఈ ఆకులు సహాయపడతాయి. నేరేడు ఆకుల రసంలో ధనియాలు వేసి తీసుకున్నట్లయితే జ్వరం తగ్గిపోతుంది. అధిక బరువుతో బాధపడేవారికి కూడా నేరేడు ఆకులు ఉపయోగపడతాయి.

నేరేడు ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నోరును ఆరోగ్యంగా ఉంచుతాయి. నేరేడు ఆకులను నేరుగా నమిలి తింటుండాలి. దీంతో నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. నేరేడు ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి.




