- Telugu News Photo Gallery Viral photos Viral News: Teachers agricultural lessons for children held in the field in raichur
Viral News: చదువు అంటే మార్కులు మాత్రమే కాదంటున్న టీచర్స్.. రైతు కష్టం తెలిసేలా.. క్షేత్రస్థాయిలో విద్యార్థులకు వ్యవసాయ పాఠాలు
చదువు అంటే నూటికి నూరు మార్కులు.. ర్యాంకులు.. పెద్ద ఉద్యోగం భారీ జీతం అనే స్టేజ్ లో నేటి విద్యావ్యవస్థ కొనసాగుతోంది. అయితే వాస్తవానికి చదువు అంటే జ్ఞానం.. ఇంకా చెప్పాలంటే నేర్చుకోవడం, తెలుసుకోవడం అని భారతీయ విద్యవస్థకు అసలు అర్ధం.. కాలంతో వచ్చిన మార్పుల్లో భాగంగా చదువుకు అర్ధం మారిపోయింది. కాలంతో పోటీపడుతూ చిన్నారులు చదువుకొనే స్టేజ్ చేరుకుంటే.. తల్లిదండ్రులు ఎంత ఫీజు అయినా సరే పిల్లల కోసం చదువుకొనే స్టేజ్ కు చేరుకున్నారు. అయితే ఇప్పుడు కొంతమంది మళ్ళీ పూర్వకాలానికి వెళ్తూ తమ స్టూడెంట్స్ కు చదువుని నేర్పుతున్నారు. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది కర్ణాటకలోని ఓ ప్రభుత్వ పాఠశాల.
Updated on: Sep 19, 2023 | 12:00 PM

రాయచూరు జిల్లా లింగసుగూర్ తాలూకాలోని బెండోని ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు మోడల్ స్కూల్. విద్యార్థులకు వ్యవసాయం గురించి రైతులు పడే కష్టం తెలియజేసే విధంగా సరికొత్తగా పాఠాలను భోదించారు. ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఉపాధ్యాయులు వ్యవసాయ పాఠాలు బోధించారు.

చదువు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితమైన ఈ రోజుల్లో ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పొలాల్లోకి వెళ్లి వ్యవసాయం గురించి తెలుసుకున్నారు. పొలంలో నాట్లు వేయడం, వ్యవసాయ సామాగ్రి గురించి తెలుసుకున్నారు.

వ్యవసాయం ప్రాముఖ్యతపై పిల్లలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్కూల్ లో ప్రతి శనివారం బ్యాగ్ ఫ్రీ డే ని సెలబ్రేట్ చేస్తారు. ఇందులో భాగంగానే ఈసారి చిన్నారుల పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం క్షేత్రంలో జరిగే పనులు గురించి తెలియజేశారు.

స్టూడెంట్స్ కు వ్యవసాయ పనిముట్ల గురించి పరిచయం చేసి వాటి ఉపయోగాల గురించి వివరించారు టీచర్స్. అనంతరం విద్యార్థులు పొలంలో దిగి వరి నాట్లు వేశారు. ఉపాధ్యాయురాలు సునీత ఆధ్వర్యంలో చిన్నారుల బృందం పొలంలో వరి నాట్లను ఎంతో ఉత్సాహంగా వేశారు.

ఉపాధ్యాయులు భూసారం, సేంద్రియ వ్యవసాయం, రసాయన ఎరువుల వాడకం, కొత్త వంగడాలతో సహా చిరుధాన్యాలు, పప్పుధాన్యాల పంటల గురించి స్టూడెంట్స్ కు చెప్పారు. తమ స్టూడెంట్స్ కు వ్యవసాయంపై అవగాహన కల్పించారు.

రైతు వ్యవసాయం చేయడంలో పడే కష్టం, దేశాభివృద్ధిలో రైతు పాత్ర వంటి అనేక అంశాలపై కూడా స్టూడెంట్స్ కు అవగాహన కల్పించారు. వ్యవసాయంతో పాటు ఉద్యాన, పాడిపరిశ్రమ, పశుపోషణ, తేనెటీగల పెంపకం, సౌరశక్తి వినియోగం, చీడపీడల నివారణపై అవగాహన కల్పించారు.

వ్యవసాయానికి సంబంధించిన బిందు సేద్యం.. ఇతర అంశాలపై ఉపాధ్యాయులు ఆచరణాత్మక సమాచారాన్ని అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నారు. కొత్త తరహా ఉపాధ్యాయ శిక్షణను ప్రజలు అభినందిస్తున్నారు.

నాలుగు గోడల మధ్య పాఠ్యాంశాలను నేర్చుకుంటూ ఉండే చిన్నారులు పొలంలోకి దిగగానే రెక్కలు విప్పిన సీతాకోక చిలుకల్లా ఎగిరారు. పొలంలోకి దిగి సంతోషంగా గంతులు వేశారు. కాళ్లతో చేతులతో ఒకరిపై ఒకరు బురదజల్లు కుంటూ అరుదైన అనుభూతిని పొందారు. వ్యవసాయ సబ్జెక్టును ప్రాక్టికల్‌గా అభ్యసించారు.

మొదట చిన్నారులు పొలంలో పని చేస్తున్న రైతులను ఆసక్తిగా వీక్షించారు. అనంతరం విద్యార్థులు పొలంలోకి దిగి సందడి చేశారు.




