- Telugu News Photo Gallery Tirumala srivari navaratri brahmotsavam begins today total vahana seva details here
Tirumala: నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజున ఏ వాహన సేవలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారంటే..
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కలియుగ వైకుంఠాన్ని తలపించే తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకుని తరిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ఈ రోజు నుంచి మొదలైన బ్రహ్మోత్సవాలలో స్వామివారి ఏ రోజున ఏ వాహన సేవలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారో తెలుసుకుందాం
Updated on: Oct 15, 2023 | 9:24 AM

అక్టోబర్ 15వ తేదీ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉదయం 9 గంటలకు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు. భక్తులను కటాక్షిస్తారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి పెద్దశేషవాహన సేవ జరగనుంది. ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై దేవేరులతో కలిసి మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు. భక్తులను అనుగ్రహించనున్నారు.

అక్టోబర్ 16వ తేదీ: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఉదయం 8 గంటలకు మలయప్పస్వామి ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటలకు హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు.

అక్టోబర్ 17వ తేదీ: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఉదయం 8 గంటలకు వెంకటాచలపతి సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

అక్టోబర్ 18వ తేదీ: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం 8గంటలకు శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటలకు స్వామివారు సర్వభూపాల వాహనంపై దర్శనం ఇస్తూ భక్తులకు అభయమివ్వనున్నారు.

అక్టోబర్ 19వ తేదీ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం 8 గంటలకు శ్రీవారు మోహినీరూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ జారనుంది. జగన్నాటక సూత్రధారి మలయప్ప స్వామి గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

అక్టోబర్ 20వ తేదీ: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం 8 వంటలకు హనుమంత వాహన సేవ రాముని అవతారంలో శ్రీవారు హనుమంతునిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అలసిన స్వామి, అమ్మవార్లకు సేద దీరడానికి సాయంత్రం 4 గంటలకు పుష్పకవిమాన సేవ చేయనున్నారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి పుష్పకవిమానంలో విహరించనున్నారు. ఈ సేవ మూడేళ్లకు వచ్చే అధిక మాసం సందర్భంగా నవరాత్రుల్లో నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు శ్రీవారు గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

అక్టోబర్ 21వ తేదీ: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజున ఉదయం 8 గంటలకు స్వామివారి సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధులలో విహరించనున్నారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవ జరగనుంది. ఈ వాహనంపై శ్రీవారు విహరిస్తూ భక్తులకు అభయహస్తం ఇవ్వనున్నారు.

అక్టోబర్ 22వ తేదీ: శ్రీవారి నవరాత్రి బ్రహ్మో త్సవాల్లో భాగంగా 8వ రోజు ఉదయం 8 గంటలకు శ్రీనివాసుడు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన స్వర్ణరథాన్ని అధిరోహించి ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ జరగనుంది. అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించనున్నారు.

అక్టోబర్ 23వ తేదీ: శ్రీవారి నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు. ఈ రోజు ఉదయం 9 గంటలకు స్వామివారికి చక్రస్నానం వేడుకను నిర్వహించనున్నారు. ఈ రోజు ఉదయం శ్రీవారు తన ఉభయదేవేరులతో కలిసి చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు.





























