Fruits on Empty Stomach: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ పండ్లు తింటే ఎన్ని లాభాలో.. రోగనిరోధక శక్తికి బోలెడంత బలం
ఖాళీ కడుపుతో నీళ్లు తాగినా, కడుపు నిండా పండు తిన్నా మంచిదనే సామెత వినే ఉంటారు. పండ్లలో విటమిన్లు, ఖనిజాలు నిండుగా ఉంటాయి. రోజుకు కనీసం ఒక పండు తిన్నా అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం తర్వాత పండ్లు తింటారు. రెండు పూటలా భోజనాల తర్వాత కూడా పండ్లు తింటుంటారు. అయితే ఖాళీ కడుపుతో పండ్లు తింటే అనేక ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు..
Updated on: Dec 11, 2023 | 8:20 PM

ఖాళీ కడుపుతో నీళ్లు తాగినా, కడుపు నిండా పండు తిన్నా మంచిదనే సామెత వినే ఉంటారు. పండ్లలో విటమిన్లు, ఖనిజాలు నిండుగా ఉంటాయి. రోజుకు కనీసం ఒక పండు తిన్నా అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం తర్వాత పండ్లు తింటారు. రెండు పూటలా భోజనాల తర్వాత కూడా పండ్లు తింటుంటారు. అయితే ఖాళీ కడుపుతో పండ్లు తింటే అనేక ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఖాళీ కడుపుతో అరటిపండ్లు తింటే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. అరటిపండులో పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. అరటిపండ్లు త్వరగా జీర్ణమవుతాయి. రోజు ప్రారంభంలో అరటిపండ్లు తింటే తక్షణ శక్తి అందుతుంది.

పండిన బొప్పాయిని రోజులో ఎప్పుడైనా తినవచ్చు. కానీ పండిన బొప్పాయిని ఖాళీ కడుపుతో తింటే ఎక్కువ ప్రయోజనాలు అందుతాయి. బొప్పాయిలో పపైన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ పండులో విటమిన్ ఎ, సి ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

కివిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో కివీని తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఇందులోని పీచు పదార్ధం ఉదయాన్నే పొట్టను శుభ్రపరచడానికి సహాయపడుతుంది.

చలికాలంలో నారింజ పండ్లు ఎక్కువగా లభ్యమవుతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ పండ్లను తింటే రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతాయి. ఈ పండులో విటమిన్ సి, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.





























