- Telugu News Photo Gallery Spiritual photos Yadadri Temple Sri Lakshmi Narasimha Swamy Puja and Sevas , Full Details Here
Yadadri Temple: తిరుమల తరహాలోనే యాదాద్రిలో స్వామికి అందే పూజలు సేవలు ప్రసాదాలు ఏమిటంటే
Yadadri Temple: యాదాద్రి లక్ష్మీ నరసింహునికి నిత్యకైంకర్యాలు పూజలు అత్యంత వైభవంగా కొనసాగుతాయి. ఏడాది పొడవునా సాగే విశిష్టమైన సేవలు పూజలు భక్తులను ఎంతగానో అలరిస్తాయి. తిరుమల తరహాలో యాదాద్రిలో కూడా భక్తులకు మహా ప్రసాదాలను అందిస్తారు. లోకనాయకుడు లక్ష్మీ నరసింహడికి అందే పూజలు సేవలు ప్రసాదాల గురించి తెలుసుకుందాం
Updated on: Mar 24, 2022 | 6:42 PM

ఏకాదశి పుష్పార్చన...యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ప్రతి ఏకాదశి పర్వం రోజు లక్ష పుష్పార్చన శాస్ర్తోక్తంగా నిర్వహిస్తారు. స్వామి, అమ్మవార్ల సహస్ర నామార్చన చేస్తారు అర్చకులు. రకరకాల పూలతో సుమారు రెండుగంటలపాటు పుష్పార్చన కొనసాగుతుంది. ఈ వేడుకలో భక్తులు అశేషంగా పాల్గొంటారు.

అన్నకూట ఉత్సవం...శ్రావణ మాసంలో స్వామివారికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఆశ్వయుజంలో మూల నక్షత్రం మొదలు శ్రవణ (విజయ దశమి) నక్షత్రం వరకు త్రిరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. తిరుమంగై ఆళ్వారుల తిరునక్షత్ర ఉత్సవం, అన్నకూట ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో స్వామివారు ఎంత ఎత్తు ఉన్నారో అంత అన్నం రాశిగా పోసి మహానైవేద్యం సమర్పిస్తారు. ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు.

వైభవంగా స్వాతి నక్షత్రం...నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి. ఆ మహోగ్రమూర్తిని శాంతపరచడానికి ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజున యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేస్తారు. తెల్లవారుజామున 4 గంటలకు వేలాదిగా భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. తర్వాత ఆలయంలో మూడున్నర గంటలపాటు శ్రీవారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహిస్తారు. 108 కలశాలతో 108 వేదమంత్రాలు, 108 రకాల ఓషధులు, పంచామృతాలతో స్వామి వారికి అభిషేకం చేస్తారు. తర్వాత మూలమంత్ర, ముక్తిమంత్ర హోమాలు జరుగుతాయి.

ఘనంగా నృసింహ జయంతి...నరసింహస్వామి ఆవిర్భవించిన వైశాఖ శుక్ల చతుర్దశి నృసింహ జయంతిగా లోకప్రసిద్ధి. ఈ సందర్భంగా ఆలయంలో మూడు రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలు ఉంటాయి. మొదటి రోజు లక్ష కుంకుమార్చన, రెండో రోజు లక్ష పుష్పార్చన, మూడో రోజు సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం స్తంభ స్థానారాధన వైభవంగా జరుపుతారు.

ధనుర్మాస హేల..మార్గశిర మాసంలో సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించగానే ధనుర్మాస ఉత్సవాలు మొదలవుతాయి. ఈ నెల ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేకమైనది కావడంతో, నెలరోజులపాటు తిరుప్పావై పాశురాలను స్వామివారికి వినిపిస్తారు. అమ్మవారికి తిరుప్పావై మహోత్సవం జరుగుతుంది. ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి (వైకుంఠ) ఏకాదశిని పురస్కరించుకొని ఆళ్వారు దివ్యప్రబంధ మహోత్సవాలు (అధ్యయనోత్సవాలు) జరుగుతాయి. ఇందులోభాగంగా స్వామివారికి ఆరు రోజులపాటు ఉదయం, సాయంత్రం అలంకార సేవలు నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారు వైకుంఠనాథుడిగా భక్తులకు దర్శనమిస్తారు. భోగినాడు గోదాదేవి కల్యాణం కన్నుల పండువగా జరుగుతుంది. మరుసటి రోజు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి, స్వామివారి దగ్గరికి చేర్చడంతో ధనుర్మాస ఉత్సవాలు పూర్తవుతాయి.

కార్తిక వైభవం...యాదాద్రి సన్నిధానంలో కార్తిక మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు తెల్లవారుజామునే కొండపై దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించు కుంటారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొంటారు. అన్నవరం సత్యదేవుడి సన్నిధి తర్వాత యాదాద్రిలోనే అత్యధికంగా వ్రతాలు జరుగుతాయి. కార్తిక పౌర్ణమి నాడు స్వామి వారికి కృత్తిక దీపోత్సవం జరుపుతారు

స్వామివారికి జరిగే సేవలు..స్వామివారికి మొట్టమొదటి నైవేద్యంగా పంచామృతాలను సమర్పిస్తారు. అభిషేకానికి ముందు నైవేద్యంతోపాటు తాంబూలం ఇస్తారు. ప్రతిరోజూ బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయం 5.30 గంటలకు దద్దోజనాన్ని నివేదిస్తారు. ఇది శరీరంలో వేడిని నియంత్రించి చలువ చేస్తుంది. ఆవుపాల పెరుగు, శొంఠి, అల్లంతో దద్దోజనం వండుతారు. దీనినే బాలభోగం అని పిలుస్తారు. మధ్యాహ్నం 12.00- 12.30 గంటల సమయంలో మహారాజ భోగం పేరుతో స్వామివారికి మహా నైవేద్యం సమర్పిస్తారు. ఇందులో భాగంగా పులిహోర, శొండెలు, లడ్డూలు, జిలేబీలు, వడలు, బజ్జీలు, పాయసం, క్షీరాన్నం, కేసరిబాత్ నివేదిస్తారు. సాయంత్రం ఆరాధన తర్వాత పులిహోర, వడలు, దోసెలు, వడపప్పు, పానకం నివేదిస్తారు. ప్రతి శుక్రవారం ఊంజల్ సేవ సమయంలో క్షీరాన్నం మహా నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రతి ప్రత్యేక పూజలోనూ నివేదనలు కొనసాగుతాయి. స్వామివారు ఈ నైవేద్యాలు ఆరగించి సంతుష్టుడు అవుతాడనీ.. తనను దర్శించడానికి వచ్చిన భక్తులను సంతోషంగా అనుగ్రహిస్తాడని విశ్వసిస్తారు. ఈ నైవేద్యాలన్నీ రామానుజ కూటమిలో సిద్ధం చేస్తారని ఆలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు.





























