- Telugu News Photo Gallery Spiritual photos Tribal Festival Nagoba Jatara ankurarpana in keslapur village adilabad
Tribal Festival: ఇంద్రదేవికి తొలి పూజ.. నాగోబా జాతరకు అంకురార్పణ.. కెస్లాపూర్‌కు కదిలిన మేస్రం సైన్యం
అడవుల జిల్లా ఆదిలాబాద్ మేస్రం వంశీయుల మహా పూజలతో పులకించి పోతోంది. ప్రకృతినే మహా దైవ్యంగా పూజించే ఆదివాసీల మహా జాతరకు వేళయింది. చెట్టును , పుట్టను , మట్టిని , మానును , జలాన్ని భక్తిశ్రద్దలతో మొక్కే జాతర నాగోబాకు అంకురార్పణ జరగబోతోంది. నాగోరే నాగోబా అంటూ కెస్లాపూర్ నుండి హస్తినమడుగుకు కదిలిన మేస్రం వంశీయులు గంగాజలాన్ని సేకరించి ప్రధాన పూజకు ఆనతినియ్యమంటూ ఆది దేవత ఇంద్రాదేవి చెంతకు చేరింది మేస్రం సమాజం. ఆచార సంప్రదాయాల ప్రకారం గంగాజలంతో ఇంద్రవెళ్లి లోని ఇంద్రదేవి ఆలయానికి చేరుకున్న మేస్రం వంశీయులు. ఆలయ ఆవరణలోని మర్రి చెట్టుపై గంగాజల ఝరిని ( కలశాన్ని ) ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Updated on: Feb 05, 2024 | 2:29 PM

నాగోబా అభిషేకం కోసం జనవరి 21 న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి మండలం కెస్లాపూర్ నుండి కదిలిన మేస్రం శ్వేత సైన్యం.. 204 మందితో నాలుగు మండలాలు 18 మండలాలు 22 మారుమూల గ్రామాల మీదుగా 125 కిలో మీటర్లు ప్రయాణించి జనవరి 28 న మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు సమీపంలోని గోదావరి హస్తలమడుగులో పవిత్ర జలాన్ని సేకరించారు.

అనంతరం తిరుగు ప్రయటణం అయిన మేస్రం వంశీయులు ఫిబ్రవరి 1 న దొడంద లోని కఠోడ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ రెండు రోజులు గంగాజల కలశాన్ని మామిడి చెట్టు పై భద్రపరిచి విడిది చేసిన మేస్రం వంశీయులు నేడు దొడంద నుండి కాలినడకన బయలుదేరి ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకున్నారు. 200 మంది కి పైగా సకుటుంబ సమేతంగా పిల్లపాపలతో ఎడ్లబండ్లపై తరలి వచ్చారు.

అమ్మవారిని దర్శించుకున్న మేస్రం మహిళలు ప్రత్యేకమైన పిండి వంటలను ఇంద్రాదేవికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం మెస్రం వంశ కుటుంబీకులు సహపంక్తి భోజనాలు చేసి ఆదివాసీ వాయిద్యాల నడుమ కేస్లాపూర్ లోని మర్రిచెట్ల వద్దకు చేరుకున్నారు.

పవిత్ర గంగాజలం కోసం తమ పాదయాత్ర సాఫిగా క్షేమంగా జరిగిందని... ఇక్కడి నుంచి కేస్లాపూర్ కు క్షేమంగా చేరుకొని, సాంప్రదాయప్రకారం నాగోబా జాతరలోని కీలక ఘట్టానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడమని ఆ అమ్మవారిని వేడుకున్నామని తెలిపారు మేస్రం పెద్దలు.

ఇంద్రాదేవి వద్ద సహజసిద్దంగా.. తరతరాల సంప్రదాయాన్ని కాపాడుతూ ప్రకృతితోమమేకమై.. ప్రకృతి సిద్దమైన పదార్ధాలతోనే వంటకాలు చేయడం మా ఆచారమని తెలిపారు మేస్రం ఆడపడుచులు. నువ్వుల నూనెతో బూరెలు, మక్క గారెలు, గట్కా వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించామన్నారు.

కాళ్లకు పాద రక్షలు లేకుండా కాలినడకన సాగించే ప్రయాణం.. సహజసిద్దమైన వంటకాలతో ఆహారం ఆరోగ్యానిస్తుందని.. పుష్యమాసం వేళ చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న ఆదివాసీ సమాజాన్ని ఒక్కచోట కలుసు కోవడం ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా మరుపు రాని అనుభూతులను పంచుతుందని చెప్తున్నారు నేటి ఆదివాసీ మేస్రం వంశ ఆడపడుచులు.

దంపుడు బియ్యంతో తీపి ప్రసాదం, గోదుమ పిండితో తియ్యటప్పాలు తయారు చేశారు. సాంప్రదాయ రీతిలో మినప పప్పును రుబ్బి గారెలు తయారు చేయడం శ్రమకై జీవనానికి అద్దం పడుతుందని.. నేటి సమాజం శ్రమను మరవడంతో అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నారని సమాజానికి ఆరోగ్య జాగ్రత్తలు సైతం చెపుతోంది ఈ జాతర.

ఛలో ఇంకెందుకు ఆలస్యం మీరు వచ్చేయండి నాగోబాకి.. అమావాస్య అర్థరాత్రి వేళ సాగే వెలుగు పూల జాతరకి. నాగోరే నాగోబా.. ప్రకృతి మెచ్చిన మహాజాతరకి. బండెనక బండి కట్టి పదహారువేల బండ్లు కట్టి సాగుతున్న ఆ మహా జాతరను కనులారా చూసోద్దాం రండి.



