- Telugu News Photo Gallery Spiritual photos Shravana Masam 2025: Marriage Yoga for 6 Lucky Zodiac Signs Details in Telugu
Marriage Astrology: శుక్ర, గురు అనుకూలత.. శ్రావణ మాసంలో ఈ రాశుల వారికి పెళ్లి యోగం..!
ఈ నెల(జులై) 25న ప్రారంభం అవుతున్న శ్రావణ మాసం ఆగస్టు 23 వరకూ కొనసాగుతుంది. సాధారణంగా శ్రావణ మాసాన్ని పెళ్లిళ్ల సీజన్ గా పరిగణించడం జరుగుతుంది. ఈ నెలంతా శుక్ర, గురువులు బాగా అనుకూలంగా ఉన్న రాశుల వారి ఇళ్లల్లో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. ఈ పెళ్లి యోగం ఆడవారికే కాక, మగవారికి కూడా వర్తిస్తుంది. పెళ్లిళ్లు, ప్రేమలు, దాంపత్య జీవితానికి కారకుడైన శుక్రుడు ఆగస్టు 26 వరకూ స్వక్షేత్రమైన వృషభ రాశిలో, శుభకార్యాలకు కారకుడైన గురువు 2026 జూన్ 2వరకూ మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. శ్రావణ మాసంలో మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి తప్ప కుండా పెళ్లి ప్రయత్నాలు విజయవంతం కావడం, పెళ్లి కావడం వంటివి జరిగే అవకాశం ఉంది.
Updated on: Jul 16, 2025 | 7:51 PM

మేషం:ఈ రాశివారికి ద్వితీయ స్థానంలో, అంటే కుటుంబ స్థానంలో శుక్రుడి స్వక్షేత్ర సంచారంతో పాటు, గురువు తృతీయంలో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల బంధువులు లేదా మిత్రుల సహాయంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో, అందులోనూ సొంత ఊర్లోనే ఉన్న వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. ఎంతో వైభవంగా పెళ్లి జరిగే అవకాశం ఉంది. సమయం అనుకూలంగా ఉన్నందువల్ల ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి.

వృషభం: రాశ్యధిపతి శుక్రుడు ఇదే రాశిలోనూ, శుభ కార్యాలకు కారకుడైన గురువు ఈ రాశికి కుటుంబ స్థానంలోనూ సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు తప్పకుండా పెళ్లి పీటలు ఎక్కడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించడానికి కూడా ఇది అనుకూల సమయం. ఇష్టపడిన బంధువుతో గానీ, ప్రేమించిన వ్యక్తితో గానీ పెళ్లి జరిగే అవకాశం ఉంది. సొంత ఊర్లో, సంప్రదాయబద్ధంగా, ఆర్భాటంగా పెళ్లి జరిగే సూచనలున్నాయి.

కర్కాటకం:కళత్ర కారకుడైన శుక్రుడు ఈ రాశికి లాభ స్థానంలో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి త్వరలో, కొద్ది ప్రయత్నంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సాధారణంగా విదేశీ సంబంధం కుదిరే సూచనలున్నాయి. ఉన్నత కుటుంబానికి చెందిన సహోద్యోగితో పెళ్లయ్యే అవకాశం కూడా ఉంది. శ్రావణ మాసంలో ఈ రాశివారు పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించే పక్షంలో తప్పకుండా సానుకూల ఫలితాలనిస్తాయి. సంప్రదాయబద్ధంగా, వైభవంగా పెళ్లి జరిగే అవకాశం ఉంది.

కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో గురువు సంచారం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో మంచి పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. ఈ శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నందువల్ల సొంత ఊర్లో, సొంత బంధువుతో పెళ్లి కుదురుతుంది. కొద్ది ప్రయత్నంతో ఈ రాశి వారికి విదేశీ సంబంధం నిశ్చయం అయ్యే అవకాశం కూడా ఉంది. బాగా ఆడంబరంగా వివాహం జరిగే అవకాశం ఉంది. ఈ రాశివారి ప్రేమ ప్రయత్నాలు తప్పకుండా విజయవంతమవుతాయి.

వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో సప్తమాధిపతి శుక్రుడి సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారికి మంచి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ఇది ప్రేమ లేదా కులాంతర వివాహం కూడా కావచ్చు. శుక్రుడి స్వక్షేత్ర స్థితి, గురువు అష్టమ స్థితి వల్ల ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి నిశ్చయం అవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇప్పుడు ప్రారంభించే పెళ్లి ప్రయత్నాలు సమీప భవిష్యత్తులో తప్పకుండా సఫలమవుతాయి. సాదాసీదాగా పెళ్లి జరిగే అవకాశం ఉంది.

మకరం: ఈ రాశికి పంచమ స్థానాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలోనే ఉండడం వల్ల ప్రేమ జీవితం పెళ్లి జీవితంగా మారే అవకాశం ఉంది. బాగా పరిచయస్థులతో గానీ, సహోద్యోగితో గానీ పెళ్లి కుదిరే సూచనలున్నాయి. సాధారణంగా సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి కావడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో చేపట్టే పెళ్లి ప్రయత్నాలు అతి తక్కువ కాలంలో తప్పకుండా విజయవంతం అవుతాయి. పెళ్లి మీద అంచనాలను మించి ఖర్చు జరిగే అవకాశం ఉంది.



