- Telugu News Photo Gallery Spiritual photos Marriage Astrology 2025: shukra gochar in vrushaba rashi these zodiac signs have wedding yoga details in telugu
Marriage Astrology: శుక్ర గ్రహ అనుకూలత.. ఈ రాశుల వారికి శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు..!
Venus Transit 2025: ప్రస్తుతం శుక్రుడు తన స్వస్థానమైన వృషభ రాశిలో సంచారం చేస్తున్నందువల్ల, జ్యోతిషశాస్త్రం ప్రకారం వృషభ రాశి సహజ కుటుంబ స్థానం అయినందువల్ల ప్రస్తుత సమయం పెళ్లి ప్రయత్నాలకు, పెళ్లిళ్లకు అనుకూలంగా ఉంది. జూలై 8 తర్వాత నుంచి కొన్ని రాశుల వారు పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించడం మంచిది. వచ్చే రెండు నెలల కాలంలో ఈ రాశుల వారికి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. గురు గ్రహం కూడా మిథున రాశిలో అనుకూలంగా ఉన్నందువల్ల మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి కొద్ది ప్రయత్నంతో పెళ్లయ్యే అవకాశం ఉంది.
Updated on: Jun 28, 2025 | 3:20 PM

మేషం: ఈ రాశివారికి కుటుంబ స్థానంలో శుక్ర గ్రహ సంచారం వల్ల త్వరలో తప్పకుండా వివాహ యోగం పడుతుంది. ఈ రాశివారు జూలై రెండవ వారం నుంచి పెళ్లి ప్రయత్నాలు చేపట్టడం మంచిది. ఇందుకు సమయం బాగా అనుకూలంగా ఉంది. సాధారణంగా బంధువర్గంలో సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఇతర సంబంధాల కంటే ఎక్కువగా బంధువుల సంబంధాలనే ప్రయత్నించడం మంచిది. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నందువల్ల బాగా సంపన్న కుటుంబంతో పెళ్లి కుదిరే అవకాశం ఉంది.

వృషభం: ఈ స్థిర రాశిలో రాశినాథుడు శుక్ర సంచారం జరుగుతున్నందువల్ల ఈ రాశివారికి అతి త్వరలో తప్పకుండా వివాహ జరిగే యోగం ఉంది. బాగా పరిచయస్థుల్లో పెళ్లి సంబంధం కుదరవచ్చు. కొద్ది ప్రయత్నంతో లేదా మొదటి ప్రయత్నంతో బాగా తెలిసిన సంబంధమే అయ్యే సూచనలున్నాయి. జూలై మొదటి వారం నుంచి పెళ్లి ప్రయత్నాలు సాగించడం మంచిది. ప్రేమ వివాహానికి కూడా కొద్దిగా అవకాశం ఉంది. విదేశీ సంబంధాలు కాకపోవచ్చు. అక్టోబర్ లోగా పెళ్లి జరిగే సూచనలున్నాయి.

కర్కాటకం: ఈ రాశివారికి లాభ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. మిత్రుల ద్వారా సంబంధం కుదిరే అవకాశం ఉంది. జూలై నుంచి వీరికి పెళ్లి ప్రయత్నాలు చేయడం మంచిది. ఈ రాశివారికి ప్రస్తుతం విదేశీ సంబంధం కుదరడానికి కూడా అవకాశం ఉంది. విదేశీ సంబంధాలను కూడా ప్రయత్నించడమే మంచిది. ఇష్టపడిన లేదా ప్రేమించిన వ్యక్తితో గానీ పెళ్లి జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. అక్టోబర్ 14 లోపల పెళ్లి జరగవచ్చు.

కన్య: ఈ రాశివారికి భాగ్య స్థానంలో శుక్ర సంచారం వల్ల తప్పకుండా త్వరలో వివాహం జరిగే అవకాశం ఉంది. విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. జూలై మొదటి వారంలో పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించడం మంచిది. అక్టోబర్ లోగా పెళ్లి జరిగే సూచనలున్నాయి. విదేశాల్లో స్థిరపడిన బంధువుల ద్వారా పెళ్లి సంబంధం కుదురుతుంది. స్వదేశీ సంబంధాలకన్నా విదేశీ సంబంధాలకే ఎక్కువ అవకాశాలున్నాయి. వివాహం సంప్రదాయబద్ధంగా, బాగా ఆడంబరంగా జరిగే సూచనలున్నాయి.

వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో, అంటే వివాహ స్థానంలో, శుక్ర గ్రహం సంచారం ప్రారంభించడం వల్ల వివాహ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఇప్పుడు ప్రయత్నాలు సాగించడం వల్ల నవంబర్ లోగా వివాహం జరిగే అవకాశం ఉంది. సాధారణంగా విదేశీ సంబంధం లేదా దూర ప్రాంత సంబంధం కుదిరే అవకాశం ఉంది. బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వివాహానికి కూడా కొద్దిపాటి అవకాశం ఉంది. వివాహం వైభవంగా జరిగే అవకాశం కనిపిస్తోంది.

మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్ర సంచారం జరుగుతున్నందువల్ల ఈ రాశివారికి అతి త్వరలో వివాహ యోగం పట్టబోతోంది. పెళ్లి ప్రయత్నాలకు జూలై బాగా అనుకూలంగా ఉంది. కొద్ది ప్రయత్నంతో బంధువర్గంలో పెళ్లి కుదురుతుంది. నవంబర్ నెల ద్వితీయార్థంలో వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇష్టపడిన వ్యక్తితో పెళ్లయ్యే సూచనలు కూడా ఉన్నాయి. స్వదేశీ సంబంధాలకే ప్రయత్నించడం మంచిది. సంపన్న కుటుంబంతో మంచి సంబంధం కుదురుతుంది.



