- Telugu News Photo Gallery Spiritual photos Love Astrology 2025: Telugu Zodiac Signs Who'll Find Love in 2025?
Love Astrology: మిథున రాశిలో గురువు, శుక్రుడు.. ప్రేమ వ్యవహారాల్లో ఈ రాశుల విజయం పక్కా!
ప్రేమ భాగస్వామి కోసం ప్రయత్నించడం, చివరికి ఆ ప్రయత్నంలో విజయం సాధించడం పెద్ద సాహసమే కానీ, ఇందుకు ఓర్పు, సహనాలు చాలా అవసరం. సరైన భాగస్వామిని ఎంచుకోవడం ఒక ఎత్తు కాగా, ఆ తర్వాత ఆ వ్యక్తితో ప్రేమ జీవితం గడపడం, పెళ్లి చేసుకోవడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఈ ఓర్పు, సహనాలు మొత్తం 12 రాశుల్లోనూ కొన్ని రాశుల వారికే కాస్తంత ఎక్కువగా ఉంటాయి. ప్రేమ కారకుడైన శుక్రుడు ప్రస్తుతం మిథున రాశిలో గురువుతో కలిసి సంచారం చేస్తున్నందువల్ల వృషభం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశులవారు ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధించడంలో, ప్రేమ వ్యవహారాలను సజావుగా, సంతృప్తికరంగా ముందుకు తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.
Updated on: Aug 05, 2025 | 3:47 PM

వృషభం: ఈ రాశివారు ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేస్తుంటారు. ప్రేమ జోడీని ఎంపిక చేసుకోవడంలోనే కాక, ప్రేమ వ్యవహారాలను పెళ్లి వరకూ కొనసాగించడంలో కూడా నిదానంగా వ్యవహరిస్తుంటారు. దూరదృష్టి, ఓర్పు, సహనాలు, వ్యూహాలు, పథకాల కారణంగా వీరు తాము కోరుకున్న వ్యక్తిని ప్రేమ భాగస్వామిగా చేసుకునే అవకాశం ఉంది. శుక్రుడు ధన స్థానంలో ఉన్నందు వల్ల సాధారణంగా సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంది.

మిథునం: ఈ రాశివారికి సాధారణంగా కమ్యూనికేషన్ సమస్య ఉండదు. ఈ రాశివారు ఎవరితోనైనా స్నేహ సంబంధాలను ఏర్పరచుకోగలిగారు. ఇతరులకు తమ భావాలను తెలియజేయడంలో ఈ రాశివారు దిట్టలు. ప్రస్తుతం ఇదే రాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల వీరు ప్రేమ ప్రయత్నాల్లో, ప్రేమ వ్యవహారాల్లో తప్పకుండా సక్సెస్ అవుతారు. వీరి ప్రేమ బంధం చాలా పటిష్ఠంగా, ప్రగాఢంగా కొనసాగుతుంది. సాధారణంగా ఉద్యోగంలో సాటి ఉద్యోగితో ప్రేమలో పడే అవకాశం ఉంది.

కన్య: ఏ వ్యవహారానికైనా వ్యూహాలను, పథకాలను రూపొందించుకునే తత్వం కలిగిన ఈ రాశివారు. ఒక ఉన్నతస్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంది. వేష భాషల్లో, దుస్తుల ధారణలో ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించే ఈ రాశివారు ఓర్పు, సహనాలతో పాటు మొండి పట్టు దలగా కూడా వ్యవహరించి ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ప్రస్తుతం దశమ స్థానంలో శుక్ర సంచారం వల్ల ప్రేమ వ్యవహారాలు తప్పకుండా వైవాహిక జీవితానికి దారి తీసే అవకాశం ఉంది.

తుల: ఈ రాశివారు సాహసాలు చేయడమంటే ఇష్టపడతారు. శుభ కార్యాలకు కారకుడైన గురువు భాగ్య స్థానంలో శుక్రుడితో కలిసి ఉన్నందువల్ల వీరు ప్రేమ సంబంధమైన సాహసానికి ఒడిగట్టే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. ఈ రాశివారిలో ఓర్పు, సహనాలు కాస్తంత ఎక్కువగానే ఉన్నందువల్ల వీరు తాము అనుకున్నది సాధించే అవకాశం ఉంది. ప్రేమ భాగస్వామిని ఒప్పించడంలోనూ, పెళ్లికి ఒప్పించడంలోనూ కృతకృత్యులవుతారు.

ధనుస్సు: అనుకున్నది సాధించడం, అవసరమైతే ఎంతకన్నా తెగించడం, సమయస్ఫూర్తితో వ్యవహరించడం ఈ రాశివారి తత్వం. ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధించడానికి వీరికి ఈ లక్షణాలు బాగా ఉపయోగపడతాయి. ప్రేమ వ్యవహారాల్లో వీరు శీఘ్ర ఫలితాల కోసం ప్రయత్నిస్తారు. పరిచయ స్థుల్లో, మిత్రుల్లో వీరు ప్రేమ జోడీని వెతుక్కుంటారు. వీరు ఒక పట్టాన ప్రేమలో పడరు. ప్రేమలో పడితే వదిలిపెట్టరు. సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల వీరు ప్రేమలో పడే అవకాశం ఉంది.

మకరం: ఈ రాశికి శనీశ్వరుడు నాథుడైనందువల్ల సాధారణంగా ప్రేమ వ్యవహారాలకు ఈ రాశివారు దూరంగా ఉంటారు. ప్రేమలో పడితే మాత్రం దాన్ని అంత తేలికగా విడిచిపెట్టరు. ప్రస్తుతం మిథున రాశిలో గురు, శుక్రుల యుతి జరుగుతున్నందువల్ల ఈ రాశివారు అనుకోకుండా, అప్రయత్నంగా ప్రేమలో పడడం, కొద్దిపాటి కష్టనష్టాలతో దాన్ని సాధించుకోవడం జరుగుతుంది. ప్రేమ విషయాల్లో వీరు ఆచితూచి వ్యవహరించడం జరుగుతుంది. సాధారణంగా బంధువుతో ప్రేమలో పడే అవకాశం ఉంది.



