- Telugu News Photo Gallery Spiritual photos karthika masam 2022: gloriously performed kaishikadvadashi seva for srivaru at tirumala
Tirumala: తిరుమలలో వేడుకగా కైశికద్వాదశి.. శ్రీవారి భక్తులు నంబదువాన్ పేరుమీదుగా కైశికద్వాదశి.. ప్రాశస్త్యం ఏమిటంటే
కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు.
Updated on: Nov 05, 2022 | 11:11 AM

కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో మంగళవారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.

కార్తీక ద్వాదశి సందర్భంగా తిరుమల తిరుపతిలో భక్తులు రద్దీ నెలకొంది. దర్శనం కోసం భక్తులు క్యూలు కట్టారు. మరోవైపు మంత్రి రోజా శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆస్థాన సేవలో పాల్గొన్నారు.

ప్రాశస్త్యం..పురాణాల ప్రకారం శ్రీవైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైశికద్వాదశి ఒకటి. శ్రీ వరాహ పెరుమాళ్ కైశికపురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైశిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైశిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది.

నంబదువాన్ కథ... కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు.

తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు

భక్త నంబదువాన్ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది.

వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం స్వామి, అమ్మవార్లను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.





























