- Telugu News Photo Gallery Spiritual photos History, importance and significance of karthika pournami jwala thoranam
Karthika Pournami: కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం జ్వాలా తోరణం.. దర్శనం చేసుకుంటే ఫలితం ఏమిటంటే..
Karthika Pournami: కార్తీకమాసానికి ఒక ప్రత్యేకత ఉంది. శివకేశవులకు ఇష్టమైన మాసం కనుక హిందువులు ఎంతో పవిత్రంగా ఈ మాసాన్ని భావిస్తారు. హరిహరులను ప్రీతికరమైన కార్తీక మాసంలో కార్తీక్ పౌర్ణమికి ఎంతో 'ప్రాశస్త్యం' ఉంది. ఇక కార్తీకపౌర్ణమిరోజు సాయంత్రం వెలిగించే జ్వాలాతోరణానికి ఎంతో విశిష్టత ఉంది.
Updated on: Nov 18, 2021 | 12:08 PM

కార్తీకమాసం నెలరోజులూ హరిహరులకు పూజలు చేస్తారు. అయితే.. ఈ నెలరోజులూ చేసే పూజలు ఒక ఎత్తు, పౌర్ణమిరోజున పూజలు.. ఫలితం మరొక ఎత్తు.

కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలాతోరణం విశిష్టమైన అంశం. ఏ ఇతర మాసంలోనూ ఇటువంటి ఆచారం మనకు కనబడదు.

కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి.. ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకుని చుడతారు. దీనిని యమద్వారం అని అంటారు. అనంతరం..ఈ గడ్డి మీద నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటూ మూడు సార్లు ఊరేగిస్తారు.

జ్వాలా తోరణము పదం పురాణ ప్రసిద్ధమైంది. అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పడు మొదటగా హాలాహలం ఉద్భవించింది. ఆ హాలాహలాన్ని మహాశివుడు తీసుకుని ఆ విషాన్ని కంఠ మధ్యలో నిక్షేపించాడు. అప్పుడు పార్వతీ దేవి శివునికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరము అగ్ని జ్వాల క్రింది నుంచి తన భర్తతో సహా దూరి వెడతానని మ్రొక్కుకుంది. ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ పౌర్ణమి రాత్రి శివాలయంలో, ఎండు గడ్డితో చేసిన తోరణంను జ్వాలగా వెలుగిస్తారు. ఆ జ్వాల క్రింది నుంచి శివ, పార్వతుల పల్లకీని మూడు సార్లు తీసుకొని వెడతారు.

మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశ పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమశిక్ష. కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి 3 సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుందని నమ్మకం.

జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం.




