- Telugu News Photo Gallery Spiritual photos History and significance of colourful ashadam bonalu in hyderabad
Ashdam Bonalu: ఆషాడం బోనాలకు ముస్తాబవుతున్న ఆలయాలు.. బోనం అంటే ఏమిటి.. ఎప్పుడు మొదలయ్యాయంటే
Ashdam Bonalu: ప్రపంచంలో ఏ సంస్కృతిలోనినా సర్వసాధారణంగా కనిపించేది మాతృ ఆరాధన. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో పరమాత్ముని జగత్ పితగా... ప్రకృతిని జగన్మాతగా ఆరాధిస్తాం.. ఇక తల్లి ప్రకృతి ఆగ్రహిస్తే.. ఎన్నో ఉపద్రవాలు ఏర్పడతాయి. అలా అమ్మ ఆగ్రహాన్ని హైదరాబాద్ నగరం కూడా చవిచూసింది. ఈ దుర్ఘటనతో ఓ కొత్త ఉత్సవ సంప్రదాయ పుట్టింది. వర్షాలు మొదలయ్యే సమయంలో బోనాల పండగ ఉద్భవించింది.
Updated on: Jul 08, 2021 | 8:07 PM

1869లో జంట నగరాల్లో ప్రాణాంతకమైన ప్లేగు వ్యాధి వ్యాపించి వేలాది మంది మరణించారు. గ్రామ ప్రజలు దైవ ఆగ్రహానికి గురి అయ్యామని తలచి భయభక్తులతో అమ్మవారిని శాంతిపచేయడానికి ఉత్సవాలు, జాతరలు జరపాలని నిర్ణయించారు. ఈ బోనాల జాతర ముఖ్య ఉద్దేశ్యం మానవహాని చేసే ప్రాణాంతక వ్యాధులు సోకకుండా ఆ తల్లిని కోరుకోవడమే.. అమ్మవారు చిత్రాన్నప్రియ అని స్తోత్రాలు చెబుతున్నాయి. అందుకే అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి భోజనం సమర్పించడమె బోనాల పర్వంలోని పరమార్ధం... 'బోనం' అంటే 'భోజనం' అని అర్థం. ఆలయాలలో దేవుళ్ళు మనం సమర్పించే నైవేద్యం 'బోనాలు'.

బోనాల పండుగఘటం, బోనాలు, వేపాకు సమర్పించుట, ఫలహారంబండి, పోతురాజు విన్యాసం, రంగం, బలి, సాగనంపుట అని ఎనిమిది అంగాలతో కూడినది. బోనాల పండుగ ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో సుమారు పదహారు రోజులు జరుపబడుతుంది. తల్లిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ, ఆమెను పుట్టింటి నుండి తీసుకొని వచ్చే ఎదురుకోళ్ళతో సంబరం ప్రారంభమౌతుంది.

గోల్కొండ కోటలో ఉన్న జగదంబిక ఆలయంలో ఆరంభమయ్యే ఈ బోనాల ఉత్సవాలు సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం, హైదరాబాద్ పాతబస్తీలోని'షాలిబండ'లో కొలువై ఉన్న అక్కన-మాదన్న మహంకాళీ దేవాయం, 'లాల్‌దర్వాజ' లోని మహాంకాళీ అమ్మవారి దేవాలయం సహా పలు ప్రధాన దేవాలయాల్లో వరుసగా.. కనుల పండుగగా జరుగుతాయి.


ఘటంతో అమ్మవారికి స్వాగతం పలకడాన్ని పూర్ణకుంభ స్వాగతమంటారు. ప్రత్యేకమైన కలశంలో అమ్మవారిని ఆవాహనచేసి, నగరవీధులగుండా ఉరేగింపుగా తీసుకెళతారు. బోనాల ఉత్సవం ప్రారంభించిన మొదటి రోజునుండి పదునాల్గవ రోజుదాకా ప్రతిరోజు ప్రొద్దున, సాయంకాలం అమ్మవారు కలశంలో సూక్ష్మరూపంగా ఆసీనురాలై, నగర, గ్రామ వీధులో ఊరేగి, భక్తుల పూజలను స్వీకరిస్తుంది. ‘ఘటం’ అంటే ‘కలశం’. అమ్మవారి రూపం కలశం మీద గీయబడుతుంది. ఆ ఘటం అమ్మవారిలాగే అలంకరించబడుతుంది. ఆలయ పూజారి శరీరమంతా పసుపు పూసుకుని ఘటాన్ని తీసుకుని వెళ్తారు.

ఇక అమ్మవారి సోదరుడుగా పోతురాజును భావిస్తారు. బోనాలు పండుగ పదిహేనవరోజు తెలంగాణా ప్రాంతంలోని ప్రతి బస్తీనించీ పోతురాజు అమ్మవారి ఆలయానికి లక్షల సంఖ్యలో వీరధీర విన్యాసాలు ప్రదర్శిస్తూ తరలివస్తారు. వీరు కాళ్ళకి గజ్జలుకట్టి, ఒళ్ళంతా పసుపు పూసుకుని, పసుపు నీటిలో తడిపిన ఎరుపు వస్త్రం ధరించి, కంటికి కాటుక, నుదుటి మీద కుంకుమ బొట్టుతో, నడుముకు వేపాకులు కట్టి, చేతిలో పసుపు రంగు కొరడా ఝుళిపించి నాట్యంచేస్తూ ఫలహారం బండికి ముందుగా నడచి వెళ్ళడం బోనాలు జాతరలో విశేషంగా ఆకర్షిస్తుంది.

ఈ బోనాల పండగకు సీజనల్ వ్యాధి నివారణకు సంబంధం ఉందని అంటారు. వర్షాకాలం ప్రారంభమైన సమయంలో ఎక్కువగా కలరా, మశూచివంటి వ్యాధులు సోకుతాయని.. వాటిని నివారించే క్రిమినాశిని వేపాకు అని అంటారు. ఇక అమ్మవారికి ప్రియమైన వృక్షం కూడా వేప చెట్టునే అందుకనే బోనాల సమయంలో వేపాకులను అమ్మవారికి సమర్పించే సంప్రదాయం మొదలైంది అంటారు.

బోనాల చివరి రోజున జరిగే ముఖ్య ఘట్టం రంగం. మాతంగీశ్వరి ఆలయంలో అమ్మవారికి ఎదురుగా వివాహంకాని ఒక స్త్రీ వచ్చి ఒకమట్టి కుండ మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది. దీనినే ‘రంగం’ అంటారు. దేశ రాజకీయం, వ్యవసాయం, వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు అన్నిటినీ ఆ రోజు అమ్మవారు ఆ స్త్రీల ద్వారా చెబుతుందని నమ్మకం. రంగం ముగిసాకా మృగ బలి ఉండేది... కానీ ఇప్పుడు. ఇప్పుడు మృగబలి నిషేధం కనుక గుమ్మడికాయను పగులకొట్టి ఉత్సవాలకు ముగింపు పలుకుతున్నారు.

బలి అనంతరం మర్నాడు... అమ్మవారి చిత్ర పటాన్ని విశేషంగా అలంకరించి కలశాలతోపాటు ఏనుగుమీద ఎక్కించి, మంగళ వాయిద్యాలతో వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్ళి భక్తులు అమ్మవారిని సాగనంపుతారు. చివరిగా ‘ఘటాన్ని’ నయాపూల్ ప్రాంతంలో ప్రవహించే మూసీనదిలో నిమజ్జనం చేసి, బోనాల జాతరను పూర్తి చేస్తారు.





























