- Telugu News Photo Gallery Spiritual photos Hindu holy place Panch Kedar Yatra history and significance in Uttarakhand
Panch Kedar Yatra: శివుడు శరీరభాగాలు ఐదు చోట్ల పడిన పుణ్యక్షేత్రాలు.. ఒక్కటి దర్శించినా ముక్తిలభిస్తుందని భక్తుల నమ్మకం
Panch Kedar Yatra: త్రిమూర్తుల్లో ఒకరు లయకారకుడిగా పేరొందిన పరమశివుడికి దేశ వ్యాప్తంగా అనేక ఆలయాలున్నాయి. కొన్ని క్షేత్రాలు దట్టమైన అడవుల్లో ఉంటె.. మరికొన్ని ఎత్తైన పర్వత శిఖరాల్లో ఉన్నాయి. ఆ దేవదేవుడు వెలిసిన కొన్ని క్షేత్రాలను దర్శనం చేసుకొంటే మోక్షం లభిస్తుందని హిందువులు నమ్మకం. ఈరోజు శివుడి శరీర భాగాలు పడి పుణ్యక్షేత్రాలుగా భక్తులతో పూజలందుకుంటున్న పంచకేదార క్షేత్రాలగురించి తెలుసుకుందాం..
Updated on: Sep 23, 2021 | 2:01 PM

కురుక్షేత్ర యుద్ధం ముగిసిన అనంతరం పాండవులు తమకు అంటిన బ్రహ్మహత్యా పాతకం, దాయాదులు, బందువులను చంపిన పాపాన్ని పోగొట్టుకోవడానకి శివుడి దర్శనానికి వెళ్లారు. అయితే భోళాశంకరుడు పాండవులకు తన దర్శనభాగ్యం కల్పించడు. కాశీని వదిలి ఉత్తరదిశగా పయనించి హిమాలయాలకు చేరుకుంటారు శివుడు.. పట్టువదలని పాండవులు, శివుడిని తన దర్శన నిమిత్తం వెంటాడతారు. నందిరూపంలో కనిపించిన శివుడిని పట్టుకోవడానికి భీముడు ప్రయత్నించగా. అప్పుడు ఈశ్వరుడి శరీర భాగాలు ఐదు చోట్ల పడి అవి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా వెలశాయి. వీటినే శివ పురాణంలో పంచ కేదారాలు అని అభివర్ణించారు

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కేదర్నాథ్ ఒకటి. పంచ కేదారాల్లో మొదటిది ఈ కేదార్నాథ్. పాండవులకు అందకుండా పోయిన పరమశివుడు నందిగా మారిన విషయం తెలిసిందే. పాండవులకు అందకుండా శివుడి మూపురభాగం ఉన్న చోటు కేదర్నాథ్ గామారిందని చెబుతారు. ఇక్కడి లింగం 8 గజముల పొడవు, 4 గజముల ఎత్తు..4 గజముల వెడల్పు ఉంటుంది. లింగం త్రిభుజాకారంలో ఉంటుంది. పాండవులు స్వర్గలోకానికి తమ అంతిమ దశను ఇక్కడి నుంచే ప్రారంభించారని పురాణాల కధనం. అంతేకాదు శంకరాచార్యులు మోక్షం పొందిన క్షేత్రం.

పంచ కేదారాల్లో రెండవ పుణ్యక్షేత్రమే తుంగనాథ్. శివుడి రెండు చేతులు పడిన ప్రాంతాన్ని తుంగానాథ్ అని అంటారు. శివుని చేతులు అడుగు ఎత్తులో లింగ రూపంలో వెలసిన క్షేత్రం. తుంగనాధుడంటే శిఖరాలకు అధిపతి. ఇది కేదర్నాథ్ కంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది. పాండవుల చిత్రాలు గోడపై చెక్కి ఉంటాయి. ఆలయానికి కుడివైపు పార్వతీ దేవి ఆలయం ఉంటుంది. ఈ పంచకేధార నమూనాలను అర్జునుడు నిర్మించారని స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది.

పంచ కేదరాల్లో మూడవ క్షేత్రమే రుద్రనాథ్. శివుని ముఖ భాగం వెలసిన పుణ్యక్షేత్రమే రుద్రానాథ్ అని భక్తులు విశ్వాసం. ఈ శివుడిని నీలకంఠ మహదేవ్ అని పిలుస్తారు. ఇక్కడ శివలింగం నంది ముఖ రూపంలో ఉంటుంది. తెల్లవారు జాము స్వామి వెండి తొడుగును తొలగిస్తారు. అందుకే భక్తులు ఎక్కువ స్వామి నిజరూప దర్శనానికి ప్రాధాన్యతనిస్తారు. ఈ ఆలయానికి వెనుక వైతరిణీ నది ప్రవహిస్తుంది. తమ పూర్వీకులకు మోక్షం కలిగించడానికి ఇక్కడికి భక్తులు వస్తారు. పంచకేదారాల్లో ఇది చాలా కష్టమైంది ఈ పుణ్యక్షేత్ర ప్రయాణం

పంచ కేదారాల్లో నాల్గవది మధ్య మహేశ్వర్ పుణ్యక్షేత్రం. విశ్వనాథుడి నాభి భాగం పడిన ప్రాంతమే మధ్య మహేశ్వర్ అని చెబుతారు. ఈ ఆలయానికి ఎడమవైపు పార్వతీదేవి, అర్ధనారీశ్వరుని రెండు ఆలయాలు ఉన్నాయి. ఇది గుప్తకాశీకి 24 మైళ్ల దూరంలో ఉంది. దీన్ని భీముడు నిర్మించాడని అంటారు.ఈ ఆలయ దర్శనం వల్ల కుటుంబ సమస్యలన్నీ తొలిగిపోతాయని భక్తులు భావిస్తారు.

పంచ కేదారాల్లో చిట్టచివరిది కల్పనాథ్ పుణ్యక్షేత్రం. ఇక్కడ శివుడి ఝటాజూటం లింగ రూపంలో వెలిసాడిని స్థలపురాణం. దట్టమైన అడవుల మధ్య చిన్న గుహల్లో వెలిసిన ఈ స్వామిని ఝుటేశ్వర్ మహదేవ్ అని పిలుస్తారు. దుర్వాస మహర్షి ఈ ఆలయ ప్రాంగణంలోని కల్పవృక్షం కింద తపస్సు చేసి శివుని నుంచి అనేక వరాలు పొందాడని ప్రతీతి




