- Telugu News Photo Gallery Spiritual photos Decoration with over 12 tons flowers in Tirumala Sri Venkateswara Swamy Temple on Vaikunta Ekadasi festival
Tirumala: భూలోక వైకుంఠంగా తిరుమల.. 12 టన్నుల పుష్పాలతో ముస్తాబు.. రేపు ఉదయం 5గం. తర్వాత సామాన్య భక్తుల దర్శనానికి అనుమతి
కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీగా తరలివచ్చే భక్తుల కోసం ఏడుకొండలు సిద్ధమయ్యాయి. మరోవైపు స్వామి వారి దర్శనానికి తిరుమలకు వెళ్లే భక్తులకు కీలక సూచనలు కూడా చేసింది టీటీడీ.
Updated on: Jan 01, 2023 | 4:04 PM

కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీగా తరలివచ్చే భక్తుల కోసం ఏడుకొండలు సిద్ధమయ్యాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సప్తగిరులు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. దాదాపు 12 టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయంతో పాటు ఏడుకొండలను శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. ఇలవైకుంఠాన్ని తలపించేలా విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా కనిపిస్తున్నాయి తిరుగిరులు. క్యూలైన్లు, చలువ పందిళ్లలో ప్రత్యేకంగా అలంకరించారు.

ఒక్క శ్రీవారి ఆలయంలోనే ఐదు టన్నుల ఫ్లవర్స్‌తో పుష్పాలంకరణ చేశారు. ధ్వజస్తంభం, బలిపీఠం, ఉత్తర ద్వారం లోపల లక్ష కట్ ఫ్లవర్స్‌తో అలంకరించారు. 30వేల కట్ ఫ్లవర్స్‌తో వైకుంఠ మండపాన్ని సిద్ధంచేసింది టీటీడీ.

ఈరోజు అర్ధరాత్రి ఒంటి గంటన్నర నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభంకానున్నాయి. ప్రోటోకాల్ ప్రకారం మొదట వీఐపీలకు వైకుంఠ దర్శనం కల్పించనుంది టీటీడీ. ఉదయం 5గంటల తర్వాత సామాన్యుల భక్తులను అనుమతించనున్నారు. రోజుకి దాదాపు 80వేల మంది చొప్పున పది రోజులపాటు దర్శనాలు చేసుకునేలా అరేంజ్‌మెంట్స్ చేశారు.

వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆల్రెడీ మూడు వందల రూపాయల టికెట్స్, శ్రీవాణి టికెట్లను విడుదల చేసిన టీటీడీ. సర్వదర్శనం టోకెన్లను ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి జారీ చేయనుంది. అందుకోసం 9 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది.

వీఐపీల కోసం ప్రత్యేకంగా పద్మావతి అతిథిగృహం ప్రాంతంలోని సన్నిధానం, వెంకటకళానిలయం, మాతృశ్రీవకుళాదేవి అతిథిగృహం, నారాయణగిరి అతిథిగృహాల దగ్గర ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి వారికి అక్కడే వసతి, దర్శన టికెట్లను జారీచేసేవిధంగా ఏర్పాట్లు చేశారు. గోవిందమాల భక్తులు ఇరుముడులను చెల్లించేందుకు ఆలయం వెలుపల హుండీలను ఏర్పాటు చేశారు

మహావిష్ణువుకు ఏకాదశి, ద్వాదశి అతి ముఖ్యమైన తిథులు. దీంతో ధనుర్మాసం నెలలో వచ్చే ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో.. ఉత్తర ద్వారాన్ని వైష్ణవ ఆలయాల్లో 10 రోజుల పాటు తెరిచి ఉంచుతారు. ఆ రోజున స్వామివారు ప్రత్యేకంగా ఉత్తరద్వారం ద్వారా వెలుపలికి వచ్చి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

శ్రీవారికి ఆలయానికి సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర ద్వారం లేదు. స్వామివారి ఆనంద నిలయంలోనే రెండు ప్రాకారాలు ఉన్నాయి. స్వామివారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న ప్రాకారం ఒకటైతే మరో ఆరడుగుల దూరంలో ఉన్న ఆనందనిలయ గోపుర ప్రాకారం మరొకటి. దీంతో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాన ఈ వైకుంఠ ద్వారం నుంచే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తోంది టీటీడీ.

వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారి స్వర్ణథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ద్వాదశి పర్వదినం రోజు వేకువజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ద్వాదశినాడు ముల్లోకాల్లో ఉన్న పుణ్యనదులన్నీ స్వామివారి పుష్కరిణిలో కలుస్తాయని భక్తుల నమ్మకం.




