- Telugu News Photo Gallery Spiritual photos Budhaditya Yoga: What It Brings to Your Life? Astro tips in Telugu
Budhaditya Yoga: కర్కాటక రాశిలోకి రవి గ్రహం ప్రవేశం.. బుధాదిత్య యోగంతో ఆ రాశుల వారి దశతిరగనుంది..!
Astrology in Telugu: సోమవారం (ఈ నెల 17 నుంచి) రవి గ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించింది. ఇదివరకే ఆ రాశిలో బుధ సంచారం జరుగుతోంది. రవి, బుధులు ఒంటరిగా సంచారం చేయడం కన్నా, కలిసి సంచారం చేయడం వల్ల మంచి యోగం కలిగించే అవకాశం ఉంటుంది.
Updated on: Jul 19, 2023 | 6:04 PM

సోమవారం (ఈ నెల 17 నుంచి) రవి గ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించింది. ఇదివరకే ఆ రాశిలో బుధ సంచారం జరుగుతోంది. రవి, బుధులు ఒంటరిగా సంచారం చేయడం కన్నా, కలిసి సంచారం చేయడం వల్ల మంచి యోగం కలిగించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు ముఖ్యమైన గ్రహాలు కర్కాటకం వంటి చర రాశిలో కలవడం వల్ల దాదాపు ప్రతి రాశివారికీ కొద్దో గొప్పో మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఏర్పడే బుధాదిత్య యోగం వల్ల సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. మంచి ఊరట కలుగుతుంది. ఈ శుభ యోగం వల్ల ఏ రాశివారికి ఏ ఫలితాలు అనుభవానికి వచ్చేదీ ఇక్కడ చూద్దాం.

మేషం: ఈ రాశివారికి 17 నుంచి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అనారోగ్యం నుంచి చాలా వరకు కోలుకుంటారు. శుభకార్యాలు జరుగుతాయి. గృహ, వాహన సంబంధమైన సమస్యలు ఏవైనా ఉంటే అవి వాటంతటవే పరిష్కారం అయి, ఈ సౌకర్యాలు సమకూరడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు చదువుల్లో బాగా రాణిస్తారు. మనసులోని చిరకాల వాంఛలు నెరవేరడమే కాకుండా, కుటుంబ సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది.

వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదాల పరిష్కారానికి మార్గం లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనముంటుంది. ప్రయత్న లోపం లేకుండా చూసుకోవడం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వల్ల తప్పకుండా శుభ ఫలితాలు పొందుతారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలు ప్రదర్శించి గుర్తింపు తెచ్చుకుంటారు.

మిథునం: ఎక్కువగా ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఆర్థిక సమస్యల పరిష్కారానికి, సంపాదన పెంచుకోవడానికి మార్గాలు, అవకాశాలు చేతికి అందివస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు కలిసి రావడం జరుగుతుంది. కుటుంబ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరగడం, పిల్లలు వృద్ధిలోకి రావడం, జీవిత భాగస్వామి పురోగతి చెందడం వంటివి జరిగే అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశిలో బుధ, రవి గ్రహాలు కలవడం వల్ల తప్పకుండా శుభయోగం పట్టడానికి అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం, వృత్తి, ఉద్యోగాలలో స్థిరత్వం లభించడం, అనారోగ్యం నుంచి ఉపశమనం లభించడం వంటివి జరుగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, గౌరవ మర్యాదలు పెరగడంవంటివి కూడా జరిగే సూచనలున్నాయి. ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది.

సింహం: విదేశీ యానానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలకు సంబంధించి మార్గం సుగమం అవుతుంది. తీర్థయాత్రలకు, విహార యాత్రలకు అవకాశం ఉంది. శుభకార్యాల మీద ఖర్చు చేయడం జరుగుతుంది. అనారోగ్యం నుంచి కోలుకోవడం జరుగుతుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. సానుకూల దృక్పథంతో వ్యవహరించడం వల్ల శుభ ఫలితాలు అనుభవా నికి వస్తాయి. సంతాన యోగానికి అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు.

కన్య: ఈ రాశివారికి దాదాపు ప్రతి విషయంలోనూ పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్ కు అవకాశం ఉంది. జీతభత్యాలు ఆశించిన స్థాయిలో పెరగడం జరుగుతుంది. వ్యాపారంలో లాభాల బాట పట్టే అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. సంతాన యోగానికి వీలుంది. పిల్లలు అభివృద్ధి సాధిస్తారు. ఆదాయం పెరగడం, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించడం వంటివి జరుగుతాయి. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

తుల: కెరీర్ పరంగా తప్పకుండా అనుకూలమైన మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మాట చెల్లుబాటు అవుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం జరుగుతుంది. అధికార యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. గృహ, వాహన సంబంధమైన అవరోధాలు తొలగుతాయి.

వృశ్చికం: విదేశీ ప్రయాణాలకు ఉన్న ఆటంకాలు, అడ్డంకులు తొలగిపోతాయి. సంతానంలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఉన్నవారికి కూడా విదేశీ అవ కాశాలు అందివస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే సూచనలున్నాయి. పితృ సంబంధ మైన వారసత్వ సంపద చేతికి అందే అవకాశం ఉంది. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించి తోబుట్టువులతో ఉన్న వివాదాలు రాజీ మార్గంలో పరిష్కారం అవుతాయి.

ధనుస్సు: ఈ రాశివారి జీవిత భాగస్వామి మంచి గుర్తింపు పొందడమో, వృత్తి, ఉద్యోగాలపరంగా పురోగతి సాధించడమో జరుగుతుంది. అనారోగ్యం కోలుకోవడం ప్రారంభం అవుతుంది. నిరుద్యోగులకు తప్పకుండా మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలకు అవరోధాలు తొలగడం, ఆర్థిక సమస్యలకు పరిష్కారం అభించడం, ఆదాయ మార్గాలు అందుబాటులోకి రావడం వంటివి జరుగుతాయి. దాయాదులతో ఆస్తి సంబంధమైన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.

మకరం: ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు తప్పకుండా సానుకూలపడతాయి. మంచి సంస్థలో చేరడమో, మంచి సంస్థలోకి మారడమో జరుగుతుంది. ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా నెరవేరుతుంది. సంపన్న గృహంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో అకస్మాత్తుగా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బాగా పెరుగుతుంది.

కుంభం: శత్రు, రోగ, రుణ బాధల నుంచి ఆశించిన స్థాయిలో ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా మారుతుంది. బంధువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. బంధువుల ద్వారా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఊరట లభించే అవకాశం ఉంది. తల్లి వైపు నుంచి సంపద కలిసి వస్తుంది. పిల్లల మీద బాగా ఖర్చు చేస్తారు.

మీనం: ఈ రాశివారి ప్రతిభాపాటవాలకు మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మంచి పురోగతికి ఆస్కారముంది. అధికారులకు మీ సలహాలు, సూచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. పిల్లలు పురోగతి చెందుతారు. ఉన్నత విద్యలకు దూర ప్రాంతాలకు వెళ్లే సూచనలున్నాయి. సంతానం లేనివారికి సంతానం యోగం కలిగే అవకాశం ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. కొన్ని శుభవార్తలు వినడం జరుగుతుంది.



