- Telugu News Photo Gallery Spiritual photos Balkampet yellamma kalyanam 2021 history and significance
Balkampet Yellamma: వైభవంగా జరుగుతున్న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
Balkampet Yellamma: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బల్కంపేట ప్రాంతంలో ఉన్న ఎల్లమ్మ దేవాలయం. ఏడు వందల సంవత్సరాల క్రితం స్వయంభూమూర్తిగా వెలిసిన ఎల్లమ్మ, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంగా భక్తుల పూజలు అందుకుంటుంది. ఈరోజు కరోనా నిబంధనల నడుమ ఎల్లమ్మ కళ్యాణంను అంగరంగ వైభంగా నిర్వహించారు.
Updated on: Jul 13, 2021 | 2:07 PM

బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ఈ రోజు కల్యాణమహోత్సవం సందర్భంగా దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఎల్లమ్మ కల్యాణమహోత్సవాన్ని తిలకించారు. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.

అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావటంతో పతిష్టమైన ఏర్పాట్లు చేశారు. పసుపు తో శివసత్తులు అమ్మవారిని కీర్తిస్తూ ఆడిపాడారు

దాదాపు 700 ఏళ్లక్రితం హైదరాబాదు నగరం ఏర్పడకముందు బల్కంపేట చుట్టూ పొలాలతో ఒక చిన్న గ్రామంగా ఉండేది. ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతితో ఉన్న బండరాయి అడ్డొచ్చింది. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించినా, కదలకపోవడంతో వూళ్లోకెళ్లి జనాన్ని తీసుకొచ్చాడు. తలో చేయీ వేసినా కదలలేదు. ‘ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభీష్టం కావచ్చు. దైవనిర్ణయాన్ని కాదనడానికి మనం ఎవరం..? అని శివసత్తులు ఇచ్చిన సలహాతో, మూలవిరాట్టు బావి లోపలనే ఉంచి ఒడ్డున నిలబడే పూజలు చేసేవారు.

అతి కొద్ది్కాలంలోనే రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకూ విస్తరించాయి. అక్కడ ఓ చిన్న ఆలయం వెలసింది. రాజా శివరాజ్ బహద్దూర్ అనే సంస్థానాధీశుడి హయాంలో 'బెహలూఖాన్ గూడా'గా పిలువబడిన ఈ ప్రాంతం.. కాలక్రమంలో బల్కంపేటగా మారిపోయింది. ఎల్లమ్మతల్లి 'బల్కంపేట ఎల్లమ్మ'గా సుప్రసిద్ధురాలైంది. 1919లో దేవాలయ నిర్మాణం జరిగింది.

అమ్మవారి స్వయంభూమూర్తి శిరసుభాగం వెనుక నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర జలాన్నే భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు. చర్మవ్యాధులు నివారింపబడతాయని భక్తుల నమ్మకం.

ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మతల్లి కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూడురోజుల పాటూ జరిగే ఉత్సవాల్ని చూడ్డానికి ముల్లోకాల నుంచీ దేవతలు దిగొస్తారని ప్రతీతి. దాదాపు ఐదు లక్షలమంది జనం ఎల్లమ్మ కల్యాణానికి హాజరయ్యేవారు.. కానీ గత ఏడాది నుంచి కరోనా కల్లోలం వల్లన.. కల్యాణానికి హాజరయ్యే భక్తుల సంఖ్య భారీగా తగ్గింది.



