- Telugu News Photo Gallery Spiritual photos Astrological Impact of Guru's Combustion: Money Troubles for Certain zodiac signs details in telugu
Money Astrology: గురువుకు అస్తంగత్య దోషం.. వీరి చేతుల్లో ఎంత డబ్బున్నా హాంఫట్..!
Telugu Astrology: ప్రస్తుతం గురు, రవి గ్రహాలు మిథున రాశిలో కలిసి సంచారం చేస్తున్నాయి. ఇప్పటి నుంచి గురువు జూలై 8 వరకు రవి గ్రహానికి బాగా దగ్గరగా ఉంటున్నందువల్ల అప్పటి వరకూ గురువుకు అస్తంగత్య దోషం పడుతోంది. అస్తంగత్వం అంటే గురు గ్రహం సూర్య కిరణాలకు దగ్ధం కావడ మన్నమాట. అస్తంగత్వం వల్ల గురు గ్రహం బాగా బలహీనపడుతుంది. గురువు ధన కారకుడై నందువల్ల అస్తం గత్వం చెందడం వల్ల దగ్ధ యోగం కలుగుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారు ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. ఎంత సంపాదించిన చేతిలో నయా పైసా నిలవ ఉండదు. మేషం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశులకు ఈ దగ్ధ యోగం పడుతోంది.
Updated on: Jun 23, 2025 | 5:40 PM

మేషం: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్న గురువు అస్తంగత్వం చెందడం వల్ల ఆదాయం ఎంతగా పెరిగినా చేతిలో డబ్బు ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగా తగ్గుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు మందగిస్తాయి. ఎంత శ్రమపడినా ఫలితం తక్కువగా ఉంటుంది. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. ధన సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఈ రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం చాలా మంచిది.

మిథునం: ఈ రాశిలోనే గురువుకు అస్తంగత్వ దోషం పడుతున్నందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆదాయపరంగా అదృష్టం పట్టకపోవచ్చు. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. మదుపులు, పెట్టుబడులు, ఇతర ఆర్థిక లావాదేవీ లకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ప్రస్తుతానికి డబ్బును దాచుకోవడం చాలా మంచిది. లక్ష్మీదేవిని ప్రార్థించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కర్కాటకం: ఈ రాశికి వ్యయ స్థానంలో ఉన్న గురువుకు అస్తంగత్వ దోషం కలగడం వల్ల ఆదాయానికి మించి డబ్బు ఖర్చవుతుంది. తీవ్రస్థాయిలో దగ్ధ యోగం పట్టే అవకాశం ఉంది. ఎంత కష్టపడ్డా ఆదాయం పెరగకపోవచ్చు. రావలసిన డబ్బు చేతికి అందకపోవచ్చు. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవచ్చు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు ఇబ్బంది పెడతాయి. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. వైద్య ఖర్చులు పెరుగుతాయి. గణపతి స్తోత్రం చదువుకోవడం వల్ల లాభముంటుంది.

వృశ్చికం: ఈ రాశికి అష్టమ స్థానంలో ఉన్న గురువు దగ్ధం అయినందువల్ల రొటీన్ ఆదాయ ప్రయత్నాలు తప్ప కొత్తగా ప్రయత్నాలేవీ చేపట్టకపోవడం మంచిది. ఉద్యోగంలో జీతభత్యాల పెరుగుదలకు బ్రేక్ పడుతుంది. ఆదాయం బాగా తగ్గుతుంది. అవసరాలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యల ఒత్తిడి కూడా ఉంటుంది. ఎవరైనా డబ్బు తీసుకోవడమే తప్ప తిరిగి ఇవ్వడం ఉండదు. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.

మకరం: ఈ రాశికి షష్ట స్థానంలో సంచారం చేస్తున్న గురువుకు అస్తంగత్వ దోషం కలిగినందువల్ల ధనాదాయం బాగా తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు ఒత్తిడి కలిగిస్తాయి. తక్కువ లాభానికి ఎక్కువగా శ్రమపడాల్సి వస్తుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందదు. ఆర్థిక సహాయం కోసం బంధుమిత్రుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగాల్సినంత పెరగకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి మందగిస్తుంది. ఈ రాశివారు తరచూ శివార్చన చేయించడం మంచిది.

మీనం: రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలో గురువుకు దగ్ధ యోగం ఏర్పడడం వల్ల ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. గృహ నిర్మాణ పనులు ఆగిపోయే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు చివరి క్షణంలో జటిలంగా మారతాయి. పెద్దల అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు ఆశించిన స్థాయిలో పెరగకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి తగ్గుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా తగ్గే అవకాశముంది.



