- Telugu News Photo Gallery Spiritual photos 3 Planet Conjunction: Wealth Yoga for 6 Zodiac Signs Details in Telugu
Money Astrology: మూడు గ్రహాల యుతి.. వారికి కలలో కూడా ఊహించని ధన యోగాలు
Wealth Yoga: ఈ నెల (ఆగస్టు) 30న బుధుడు సింహ రాశి ప్రవేశంతో ఆ రాశిలో మూడు గ్రహాల కలయిక చోటు చేసుకుంటోంది. ఇప్పటికే ఈ రాశిలో సంచారం చేస్తున్న రవి, కేతువులతో బుధుడు కూడా చేరడం వల్ల బుధాదిత్య యోగంతో పాటు వృద్ధి యోగం కూడా ఏర్పడుతోంది. బుధుడు సెప్టెంబర్ 15న కన్యా రాశిలోకి మారే వరకూ ఈ అరుదైన లక్ష్మీ కటాక్ష యోగం కొనసాగుతుంది. దీనివల్ల ఆకస్మిక ధన లాభానికి, ధన యోగాలకు బాగా అవకాశం ఉంది. వృషభం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులకు కలలో కూడా ఊహించని ధన యోగాలు పట్టే అవకాశం ఉంది.
Updated on: Aug 29, 2025 | 3:53 PM

వృషభం: ఈ రాశికి నాలుగవ స్థానంలో ఈ మూడు గ్రహాల కలయిక జరుగుతున్నందువల్ల అనుకోకుండా ఆస్తి లాభం, భూ లాభం, గృహ లాభం కలిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి లభించడం జరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరగడం వల్ల జీతభత్యాలు, అదనపు రాబడి వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు బాగా తగ్గి లాభాలు పెరగడం ప్రారంభం అవుతుంది. రావలసిన డబ్బు, బాకీలు పూర్తిగా చేతికి అందుతాయి.

కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలో ధన స్థానాధిపతి రవితో సహా మూడు గ్రహాలు కలవడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభాల వర్షం కురిపిస్తాయి. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. కుటుంబపరంగా కూడా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. అదనపు ఆదాయానికి సంబంధించి ఎలాంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి.

సింహం: ఈ రాశిలో రాశ్యధిపతి రవితో సహా మూడు గ్రహాలు యుతి చెందడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి కలగడంతో పాటు జీతభత్యాలు కూడా బాగా పెరుగుతాయి. ఆదాయానికి లోటుండదు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారం కావడంతో పాటు, ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలతో పాటు లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి.

తుల: ఈ రాశికి లాభ స్థానంలో రవి, బుధ, కేతువులు కలవడం వల్ల అనేక మార్గాల్లో ధన లాభాలు, ఆదాయ వృద్ధి కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. ఒకటికి రెండుసార్లు ధనయోగాలు కలిగే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము, రాదనుకున్న సొమ్ము కూడా తప్పకుండా చేతికి అందుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన స్థాయి ఆదాయ వృద్ధి ఉంటుంది.

ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో ఈ మూడు గ్రహాల కలయిక వల్ల అనేక విధాలుగా అదృష్టం తలుపు తడుతుంది. విదేశీ ధనం అనుభవించే యోగం కూడా పడుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. సొంత ఇంటి లాభం కలుగుతుంది. అదనపు ఆదాయానికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ఆర్థిక లావాదేవీల వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

కుంభం: ఈ రాశికి సప్తమ స్థానంలో రవి, బుధ, కేతువుల యుతి వల్ల ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీత భత్యాలు అంచనాలను మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సక్సెస్ అవుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి సంబంధం కుదరడం వంటివి జరుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందే అవకాశం ఉంది.



