KVD Varma |
Updated on: Aug 07, 2021 | 5:06 PM
మ్యూజియం అంటే అదేదో మామూలుగా ఉంటుంది అనుకోకండి. అక్కడ ఖగోళశాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన ఎన్నో విశేషాలు కనిపిస్తాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఖగోళశాస్త్ర మ్యూజియం ఇది. దీనిని ఇటీవల చైనాలోని షాంఘైలో ప్రారంభించారు.
దాదాపు 39 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ మ్యూజియం ఉంది. అబ్జర్వేటరీ, ప్లానిటోరియం,78 అడుగుల పొడవైన టెలిస్కోప్ ఇందులో ప్రత్యేక ఆకర్షణలు. ఈ మ్యూజియం డిజైన్ ను మెరికన్ ఆర్కిటెక్ట్ కంపెనీ ఎనిడ్ తయారు చేసింది.
ఈ మ్యూజియం అండాకారంగా ఉంటుంది, ఎక్కడా సరళ రేఖలు లేదా పదునైన మూలలు ఉండవు. ప్రాజెక్ట్ లీడ్ డిజైనర్ థామస్ వాంగ్ వెల్లడించిన సమాచారం ప్రకారం మ్యూజియం, ఒక క్లిష్టమైన వంకర ఆకారంలో నిర్మించడం జరిగింది. ఇది మూడు పెద్ద వంపులతో అనుసంధానించి ఉంది. ఈ మ్యూజియం ఆకాశం నుండి చూసినప్పుడు ఆస్ట్రోలాబ్ లాగా కనిపిస్తుంది.
పర్యాటకులు ఈ మ్యూజియంలో విశ్వాన్ని అనుభవించవచ్చు. ఖగోళ సంఘటనలకు సంబంధించిన ఆధారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. 70 కంటే ఎక్కువ ఉల్కల నమూనాలు ఇక్కడ ఉన్నాయి, వాటిలో కొన్ని అంగారక గ్రహానికి సంబంధించిన రాళ్లు. గ్రహశకలం 'వెస్టా', చంద్రుల నుండి సేకరించిన రాళ్ళు ఉన్నాయి. ఇది కాకుండా, 120 కంటే ఎక్కువ ఖగోళ నిర్మాణాల బొమ్మలు కూడా ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయి.
మ్యూజియం భవనం ఓకులస్ (కంటి లాంటి ఆకారం), విలోమ గోపురం, వృత్తాకారంతో మూడు భాగాలుగా మ్యూజియం ఉంటుంది. ఓకులస్ ప్రధాన ద్వారం, సోలారియం కూడా ఇక్కడ ఆకర్షణ కేంద్రంగా ఉంది. విలోమ గోపురం గాజుతో చేసిన నిర్మాణం, ఇది ఖగోళ దృశ్యాన్ని అందిస్తుంది.
పర్యాటకులు వృత్తాకార ఆకారంలో బరువులేని అనుభూతిని పొందగలరు. అంటే అంతరిక్షంలో ఎలాగైతే బరువును కోల్పోతామో.. అలానే ఇక్కడ బరువును కోల్పోయి గాలిలో తేలుతున్న అనుభూతిని పొందవచ్చు.
ఈ మ్యూజియం తెరుచుకున్నప్పటి నుంచీ విపరీతంగా సందర్శకులను ఆకర్షిస్తోంది. ప్రపంచంలో ఖగోళ శాస్త్రానికి సంబంధించినంత వరకూ అతి పెద్ద మ్యూజియం ఇదే అని చెబుతున్నారు.