కమ్మగా ఉన్నాయని మైదా వంటకాలు తెగ తింటున్నారా..? ఇది మీ ప్రాణం తీసే రుచికరమైన విషం..!
రిఫైన్డ్ గోధుమ పిండినే మైదా అని పిలుస్తారు. బయట మనం తినే చాలా రకాల ఆహారాల్లో మైదా పిండినే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. గోధుమ పిండిలోని ఫైబర్‌ను పూర్తిగా తొలగించి రీఫైన్ చేసి ఈ మైదా పిండిని తయారు చేస్తారు. అందువల్ల మైదా పిండిలో కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అంతే తప్ప మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మైదా తినడం వల్ల లాభం కంటే.. నష్టాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెల్లటి విషంగా మైదాను చెబుతుంటారు నిపుణులు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: May 02, 2025 | 7:51 AM

రీఫైన్డ్ చేసిన గోధుమ పిండిలో పోషకాలు ఉండవు. ముఖ్యంగా ఫైబర్ అసలే ఉండదు. బి విటమిన్లు అయిన థయామిన్, నియాసిన్, ఫోలేట్, ఐరన్, మెగ్నిషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా కోల్పోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఇందులో గ్లైసీమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఫలితంగా మైదా వంటకాలతో రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మైదాను తరచూ తింటూ ఉండటం వల్ల దీర్ఘకాలంలో షుగర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే షుగర్ ఉన్నవారు మైదాను తింటే షుగర్ మరింత పెరిగి ప్రాణాపాయం సంభవించే పరిస్థితులు ఏర్పడుతాయి. కనుక మైదా మనకు పూర్తిగా హానికరం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

పిండి పదార్థాలను అధికంగా తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. దీంతో శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ను కణాలు సరిగ్గా గ్రహించలేవు. దీని వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయి. దీర్ఘకాలంలో ఇది డయాబెటిస్‌కు దారి తీస్తుంది. ముఖ్యంగా బరువు పెరగడంతోపాటు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

అలాగే మైదాను తింటే ఆకలి అంత త్వరగా తీరదు. దీంతో ఆహారం మరింతగా తింటారు. దీని వల్ల శరీరం శక్తిని కోల్పోయినట్లు అవుతుంది. నీరసంగా మారుతారు. అలసటగా అనిపిస్తుంది. అలాగే మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కనుక మైదాకు వీలైనంత దూరంగా ఉంటేనే మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

మైదాతో తయారు చేసిన ఆహారాలను తినకుండా మనస్సును డైవర్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆయా ఆహారాలకు బదులుగా పండ్లు, నట్స్, విత్తనాలను తినాలి. ఇవి ఆకలిని తగ్గించడమే కాదు, పోషకాలను కూడా అందిస్తాయి. శరీర బరువు తగ్గేందుకు, షుగర్ లెవల్స్ అదుపులో ఉండేందుకు సహాయం చేస్తాయి. రోగాలను తగ్గించడంలో దోహద పడతాయి.




