- Telugu News Photo Gallery Most profitable Flower to Grow: flower farming how to do flower farming in telugu
Flower Farming: ఈ పువ్వుల సాగు లాభదాయకం.. లక్ష పెట్టుబడితో 7 లక్షలు సంపాదన..
పండగలు, పర్వదినాలు, శుభకార్యాలు, ప్రేమికుల రోజు వంటి స్పెషల్ రోజుల్లో పూలు విపరీతంగా అమ్ముడవుతాయి. వాస్తవానికి వ్యవసాయం దండగ కాదు పండగ అనిపించాలంటే సాంప్రదాయ పద్ధతులకు, వరి, గోధుమ వంటి పంటలకు బదులు ఇతర వాటిని ఎంచుకోవాలి. ప్రస్తుతం పువ్వుల సాగు మంచి లాభదాయకమైన వ్యవహారమని చెప్పవచ్చు. ఒక ఎకరంలో 7 లక్షలను సంపాదించవచ్చు. కొన్ని రకాల పువ్వులను సుగంధ ద్రవ్యాలు, అగరుబత్తీలు, గులాల్ , నూనె తయారీలో కూడా ఉపయోగిస్తారు. అందుకే పెద్ద పెద్ద కంపెనీలు రైతుల నుంచి నేరుగా పూలను కొనుగోలు చేస్తున్నాయి.
Updated on: Jul 22, 2023 | 7:48 PM

భారతదేశంలోని చాలా మంది రైతులు వరి, గోధుమ వంటి సాంప్రదాయ పంటలను పండించడం ద్వారా మాత్రమే మంచి ఆదాయాన్ని పొందవచ్చని భావిస్తున్నారు. అయితే వరి, గోధుమలతో పాటు అనేక ఇతర పంటలు కూడా ఉన్నాయని.. వాటి సాగు చేస్తే.. రైతులు ధనవంతులు కాగలరని రైతులు తెలుసుకోవాలి. ఈ పంటలలో పూల పెంపకం ఒకటి. వాస్తవానికి పువ్వుల పెంపకంతో రైతులు రోజు వారీగా సంపాదించుకోవచ్చు. రైతు సోదరులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం లభించే పువ్వుల సాగు బెస్ట్ ఎంపిక.

పువ్వుల సాగు ప్రత్యేకత ఏమిటంటే దాని పొలంలో ఎరువులు, నీటిపారుదల ఖర్చు వరి-గోధుమ కంటే తక్కువగా ఉంటుంది. అంతేకాదు సంప్రదాయ పంటలతో పోలిస్తే పువ్వుల పంటపై పురుగుల దాడి కూడా తక్కువే. దీంతో పురుగుమందుల కోసం రైతుల ఖర్చు కూడా ఆదా అవుతుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రకరకాల పువ్వులను సాగు చేస్తున్నారు. అయితే మార్కెట్‌లో అత్యధిక డిమాండ్ బంతిపూలకు, గులాబీకి ఉంది

ఈ రెండు పువ్వులు, పూజ నుండి వివాహం వరకు ఇంటిని అలంకరించడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా దేవాలయాలలో, పూజ గది, ఆలయాల అలంకరణ కోసం ప్రతిరోజూ వేల టన్నుల పుష్పాలను ఉపయోగిస్తారు. అందుకే రైతులు కూరగాయల మాదిరిగానే పూలను అమ్మడం ద్వారా ప్రతిరోజూ బాగా సంపాదించవచ్చు. విశేషమేమిటంటే ప్రేమికుల రోజున కూడా పూల విక్రయాలు విపరీతంగా జరుగుతుంది.

అదే సమయంలో, పువ్వులు సుగంధ ద్రవ్యాలు, అగరుబత్తి, గులాల్ , సుగంధ నూనె తయారీలో కూడా ఉపయోగిస్తారు. అందుకే బడా కంపెనీలు కూడా రైతుల నుంచి నేరుగా పూలను కొనుగోలు చేస్తున్నాయి. అంతే కాకుండా అనేక రకాల పూలను మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పూల సాగు చేసిన రైతులు నష్టాల బారిన పడరని చెప్పొచ్చు. అదేవిధంగా గులాబీ, బంతి పువ్వు, పొద్దు తిరుగుడు పువ్వులను భారతదేశంలో పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. ఈ పువ్వుల సాగు సమయంలో నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించాలి.

దక్షిణ భారత దేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బెంగళూరు వంటి అనేక ప్రాంతాలతో పాటు.. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, హర్యానా, ఉత్తరాఖండ్‌తో సహా అనేక రాష్ట్రాల్లో పువ్వులు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. బంతి పువ్వు సాగుకు ఎకరాకు రూ.30 వేలు ఖర్చు అవుతుంది. ఈ పూలను మార్కెట్ లో కిలో రూ.80 వరకు విక్రయిస్తున్నారు. దీంతో రైతులకు ఎకరానికి రూ.2 నుంచి 3 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. అదేవిధంగా గులాబీ సాగుతో రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఒక హెక్టారులో గులాబీల సాగు ద్వారా రైతులు రూ.5 నుంచి 7 లక్షల వరకు ఆదాయం పొందవచ్చని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా గులాబీ సాగుకి ఖర్చు కేవలం లక్ష రూపాయలు మాత్రమే చేయాల్సి ఉంటుంది.





























