- Telugu News Photo Gallery Impressive New Secretariat Building in Hyderabad to be Inaugurated on April 30, check here for its specifications
New Secretariat: తెలంగాణ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి.. ప్రారంభోత్సవానికి సిద్ధమైన ‘శాంతిసౌధం’.. ప్రత్యేకతలివే..
చరిత్రలో నిలిచిపోయే రీతిలో.. దేశంలో ఎక్కడా లేనట్టుగా నిర్మితమైంది తెలంగాణ నూతన సచివాలయం. దేశంలోని ప్రముఖ ప్యాలెస్‌లను మైమరపించేలా దాదాపు 26 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ భవం ప్రత్యేకతలేమిటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Apr 28, 2023 | 9:37 AM

ముత్యాలహారంలోని ముత్యాలకు సరిసమానమైన గోల్కొండ కోట.. చార్మినార్.. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం.. వంటి పలు కట్టడాలతో భాగ్యనగరం ఇప్పటికే కళకళలాడుతోంది. ఆ కట్టడాల సరసకు మరో కట్టడాన్ని ఈ నెల 30న చేర్చబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అదే హుస్సేన్‌సాగర్ తీరాన నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న రాష్ట్ర నూతన సచివాలయం.

ఇండో–పర్షియన్ నిర్మాణ శైలిలో నిలువెల్లా సాంకేతికత, సంప్రదాయ రూపులు దిద్దుకున్న గుమ్మటాలతో.. ఆధునిక హంగులతో కూడి ఉంది ఈ అధునాతన పాలనా సౌధం. చూడగానే తాజ్‌మహల్, మైసూర్ ప్యాలెస్‌ను తలపించే శ్వేతసౌధం. మొత్తం 635 గదులు.. 30 కాన్ఫరెన్స్ హాల్స్.. 34 గుమ్మటాలు.. ఈ సచివాలయం ప్రత్యేకతలు.

నూతనంగా నిర్మితమైన ఈ సచివాలయ ప్రాంగణం 28 ఎకరాల విస్తీర్ఱంలో ఉంటుంది. ఇందులో రెండున్నర ఎకరాల్లో భవనాలు, ముందువైపు 10 ఎకరాల్లో పచ్చిక మైదానం, కోర్ట్‌యార్డులో 2 ఎకరాల్లో లాన్ ఉండేలా ఏర్పాటు చేశారు. అంటే 90 శాతం స్థలం ఖాళీగా ఉంటే, పది శాతం మాత్రమే భవనాలున్నాయి.

సచివాలయ ప్రాంగణంలో మొత్తం భవనాల నిర్మిత స్థలం దాదాపు 10 లక్షల చదరపు అడుగుల మేర విస్తరించి ఉంటుంది. దేశంలోని అతిపెద్ద సచివాలయాల్లో ఇదీ ఒకటి. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టా కూడా దాదాపు ఇంతే విస్తీర్ణంలో ఉంది.

విశేషమేమిటంటే ఈ సచివాలయ భవనాన్ని సిద్ధం చేసేందుకు 20 నెలల సమయమే పట్టింది. అయితే మధ్యలో కరోనా కాలంగా 6 నెలల సమయం వృథా అయింది. దీంతో శంకుస్థాపన నాటి నుంచి నిర్మాణం పూర్తయే వరకు 26 నెలల పట్టింది.

ఇంకా ఈ సచివాలయ నిర్మాణ పనుల్లో 3 వేల మంది కార్మికులు పాల్గొన్నారు. ఇంకా చివరలో 4 వేల మంది వరకు కార్మికులు రాత్రింబవళ్లు పనిచేశారు.

తెలంగాణ నూతన సచివాలయ భవనం ఎత్తు 265 అడుగులు, అంటే ఇది ఇది కుతుబ్‌మినార్(239 అడుగులు) కంటే 26 అడుగులు ఎత్తు ఎక్కువ.

ఇవే కాక.. నూతన సచివాలయ భవనానికి దక్షిణం వైపు సందర్శకుల రిసెప్షన్, ఎన్‌ఆర్‌ఐ రిసెప్షన్, పబ్లిసిటీ సెల్, రెండు బ్యాంకులు, రెండు ఏటీఎం కేంద్రాలు, పోస్టాఫీసు, బస్, రైల్వే కౌంటర్లు, క్యాంటీన్, మీడియా కేంద్రాలను విడిగా నిర్మించారు. వెనుక వైపు సెక్యూరిటీ కార్యాలయం, ఉద్యోగ సంఘాల కార్యాలయాలు, ఉద్యోగుల పిల్లల క్రెచ్, ఆరోగ్య కేంద్రం, ఇండోర్ గేమ్స్ ప్రాంగణం, సహకార పొదుపు సంఘ కార్యాలయం, తదితరాలతో కూడిన భవన సముదాయాన్ని నిర్మించారు. నైరుతి వైపు దేవాలయం, వెనక వైపు చర్చి, మసీదును నిర్మించారు.

సచివాలయం ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం ఉండగా.. అక్కడికి చేరుకునేందుకు ప్రత్యేకంగా రెండు లిఫ్టులు ఏర్పాటు చేశారు. మంత్రులు, ఆ స్థాయి వారి కోసం 24 చాంబర్లను నిర్మించారు. మంత్రి, కార్యదర్శి, ఆ శాఖ అధికారులంతా ఒకేచోట ఉండేలా ఏర్పాటు చేశారు. ఇలాంటి వ్యవస్థ ఉన్న సచివాలయం దేశంలో ఇదొక్కటే.

తెలంగాణ ముఖ్యమంత్రి చాంబర్

సచివాలయం లోపల ఉన్న సువిశాలమై కారిడార్లు, కళాత్మకత ఉట్టిపడేలా నిర్మితమైన పిల్లర్లు.

ముఖ్యమంత్రి కోసం వచ్చిన ప్రజలు.. ఆయనను కలిసేందుకు ఏర్పాటు చేసిన జనహిత మందిరం.
