- Telugu News Photo Gallery Cricket photos PM Modi Meets Women’s World Cup Champions, Praises Team’s Grit and Comeback
Women’s World Cup-winning team: ప్రపంచ కప్ గెలిచిన మహిళా క్రికెట్ జట్టుకి ప్రధాని మోదీ ఘన సన్మానం..
మహిళల వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టును ప్రధాని మోదీ బుధవారం సన్మానించారు. వరల్డ్ కప్ విశేషాలను టీమ్ఇండియా క్రీడాకారిణులు మోదీతో పంచుకున్నారు. వరుసగా మూడు ఓటములు, సోషల్ మీడియాలో ఎదురైన ట్రోలింగ్‌ను సైతం ఎదుర్కొని గొప్ప విజేతగా నిలిచారంటూ మోదీ మహిళా ప్లేయర్స్‌ను ప్రశంసించారు.
Updated on: Nov 05, 2025 | 9:09 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో మహిళల ప్రపంచ కప్ విజేత జట్టును ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి జట్టును అభినందిస్తూ, టోర్నమెంట్‌లో వరుసగా మూడు ఓటముల తరువాత అద్భుతంగా పునరాగమనం చేసి గెలిచిన తీరును ప్రశంసించారు. సోషల్ మీడియాలో ఎదురైన ట్రోలింగ్‌ను తట్టుకుని విజయాన్ని సాధించడం నిజంగా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. “2017లో ట్రోఫీ లేకుండా మోదీ గారిని కలిసాం. ఈసారి ట్రోఫీతో కలిసి కలవడం గర్వంగా ఉంది. ఇక మోదీ గారిని తరచూ కలిసేలా విజయాలు సాధిస్తాం” అని అన్నారు.

వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడుతూ, “మోదీ గారు ఎప్పుడూ మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఆయన దేశంలోని అన్ని రంగాల్లో మహిళలకు స్ఫూర్తి” అని తెలిపారు.

దీప్తి శర్మ మాట్లాడుతూ “2017లో మోదీ గారు ‘కష్టపడి పనిచేస్తే మీ కలలు నిజమవుతాయి’ అని చెప్పిన మాటలు గుర్తున్నాయని చెప్పారు ఈ సందర్భంగా ప్రధాన మంత్రి.. దీప్తి శర్మ చేతిపై ఉన్న భగవాన్ హనుమాన్ టాటూ, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ‘జై శ్రీరామ్’ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. దీప్తి “అవి నాకు శక్తినిస్తాయి” అని చెప్పింది.

హర్మన్‌ప్రీత్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. “ఎలా ఎప్పుడూ ప్రజంట్‌పైనే ఫోకస్ పెడతారు?” అని అడగగా.. “అది నా జీవనశైలిలో భాగమైపోయింది, అలవాటైపోయింది” అని మోదీ సమాధానమిచ్చారు.

మోదీ 2021లో ఇంగ్లాండ్‌పై హర్లీన్ పట్టిన అద్భుత క్యాచ్ గురించి కూడా ప్రస్తావించారు. అప్పట్లో దానిపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. హర్మన్‌ప్రీత్ ఫైనల్ మ్యాచ్ తర్వాత బంతిని జేబులో వేసుకున్న విషయంపై మోదీ గారు చర్చించగా.. ఆమె “ఆ బంతి నా వైపు రావడం అదృష్టం. అందుకే దాన్ని జ్ఞాపకంగా ఉంచుకున్నాను” అని చెప్పింది.

అమంజోత్ కౌర్ పట్టిన ఫేమస్ క్యాచ్ గురించి కూడా ప్రధాన మంత్రి మాట్లాడారు. ఆ క్యాచ్ కొంచెం ఫంబుల్ అయినా, చివరికి అద్భుతంగా పట్టిన విధానం నచ్చిందని అన్నారు. “బంతిని పట్టేటప్పుడు మీరు బంతిని చూస్తారు, కానీ పట్టిన తర్వాత ట్రోఫీని చూసి ఉండాలి” అని మోదీ నవ్వుతూ చెప్పారు. క్రాంతి గౌడ్ మాట్లాడుతూ “నా తమ్ముడు మోదీ గారి అభిమానిగా ఉన్నాడు” అని చెప్పగా, ప్రధాన మంత్రి వెంటనే “అయితే మీ కుటుంబంతో ఒకసారి కలవాలి” అంటూ ఆహ్వానం పలికారు.

ప్రధాన మంత్రి మహిళా క్రీడాకారిణులను ‘ఫిట్ ఇండియా’ సందేశాన్ని దేశవ్యాప్తంగా యువతిలోకి తీసుకెళ్లాలని సూచించారు. స్థూలకాయం పెరుగుతున్న సమస్యను ప్రస్తావిస్తూ, శారీరక దారుఢ్యం ఎంతో ముఖ్యమని చెప్పారు. అలాగే, వారు చదివిన పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను ప్రేరేపించాలని సూచించారు.




