- Telugu News Photo Gallery Cricket photos How much cost of LED stumps, Zing bails in IPL and Cricket Events, is it the reason ‘Picking Stumps after Match’ left in History ?
IPL 2023: ఐపీఎల్ స్టంప్స్ అంత విలువైనవా..! అందుకే ధోనిని స్టంప్ తీసుకోవద్దన్నారా..?
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబౌ బ్యాటింగ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో రెండు బంతులకు రెండు వికట్లను 2 ముక్కలుగా చేశాడు. దీంతో ఐపీఎల్ నిర్వాహకులకు నష్టం వాటిల్లిందని ఎన్నో కధనాలు వస్తున్నాయి. మరి ఈ వికెట్ల ధర వెనుక ఉన్న వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Apr 25, 2023 | 9:22 AM

IPL 2023: ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బౌలర్ ఆర్ష్‌దీప్ సింగ్ తన మెరుపు బంతులతో వరుసగా రెండు వికెట్లను 2 ముక్కలుగా విరగ్గొట్టాడు. అతను విరగ్గొట్టిన స్టంప్స్ ధర దాదాపు రూ. 60 లక్షల వరకు ఉంటుందని మీడియా కథనాలు వస్తున్నాయి. ఐపీఎల్ నిర్వాహక వర్గాల నుంచి మాత్రం ఒక్కో స్టంప్ ధర కనీసం రూ. 24 లక్షలని, రెండు వికెట్లు కలిసి రూ.48 లక్షల వరకు ఉంటుందని సమాచారం. దీంతో ఈ ఓవర్‌ని ఐపీఎల్‌లో అత్యంత ‘ఎక్పెన్సివ్ ఓరర్’గా చెబుతున్నారు క్రికెట్ విశ్లేషకులు. అంటే ఆర్ష్‌దీప్ విరగ్గొట్టిన వికెట్ల ఖర్చు కనీసం ముగ్గురు ఐపీఎల్ ఆటగాళ్ల ధరకు సమానం.

అయితే తొలిసారిగా క్రికెట్‌లో రూల్స్ రాసుకొన్న 1744 సంవత్సరంలో కేవలం రెండు స్టంప్స్ మాత్రమే ఉండేవి. వాటిపై ఒక పెద్ద బెయిల్ పెట్టి ఆడేవారు. కానీ, బంతి రెండు స్టంప్స్ మధ్య నుంచి వెళ్లి.. బెయిల్ పడకుండా ఉన్న సందర్భాలు కొన్ని చోటుచేసుకున్నాయి. దీంతో 1775లో లంపీస్టీవెన్సన్ అనే వ్యక్తి తొలిసారిగా 3 స్టంప్స్‌ను క్రికెట్‌కు పరిచయం చేశాడు. ఆ తర్వాత కాలంలో ఆ నియమమే ఆటలో స్థిరపడిపోయింది. కాకపోతే చెక్కతో చేసిన ఈ స్టంప్స్, బెయిల్స్ అప్పుడప్పుడు బంతి తాకినా కిందపడేవి కాదు. దీంతో బ్యాటర్లు బతికిపోయేవారు.

అయితే 2008లో ఆస్ట్రేలియాకు చెందిన బీబీజీ స్పోర్ట్స్ అనే కంపెనీ కెమెరాలను అమర్చిన స్టంప్స్‌ను పరిచయం చేసింది. ఆ తర్వాత సదరు కంపెనీని స్టంప్స్ కామ్ లిమిటెడ్ అనే సంస్థ కొనుగోలు చేసింది. 2008 మార్చిలో జరిగిన ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మ్యాచ్‌లోనే వీటిని తొలిసారిగా వినియోగించారు.

ఆ తర్వాత ఆస్ట్రేలియా మాజీ గ్రేడ్ క్రికెటర్ బ్రాంటే ఎకెర్మెన్ తొలిసారి ఎల్‌ఈడీ స్టంప్స్, బెయిల్స్‌ను తయారు చేశాడు. తన కుమార్తె వద్ద ఉన్న చిన్న ఆటబొమ్మను చూసి స్ఫూర్తి పొందిన ఆయన వీటిని రూపొందించారు. వీటిల్లో అమర్చిన సూక్ష్మమైన మైక్రోప్రాసెసర్ బెయిల్స్, స్టంప్స్ మధ్య కదలికలను సెకన్‌లో 1000వ వంతులో గుర్తిస్తుంది. అది కూడా బెయిల్ రెండు వైపులా స్వల్ప కదలిక ఉండాలి. బెయిల్స్‌లోని మైక్రోప్రాసెసర్ స్టంప్స్‌కు సంకేతాలను పంపుతుంది. అప్పుడు దానిలోని లైట్లు కూడా వెలుగుతాయి. ఆ తర్వాత వీటిని జింగ్ కంపెనీ తయారు చేయడం మొదలుపెట్టింది.

2012 బిగ్‌బాష్ లీగ్‌లోనే తొలిసారి జింగ్ స్టంప్స్‌ను, బెయిల్స్‌ను వాడారు. అదే ఏడాది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జింగ్ పేటెంట్ ఉన్న ఎలక్ట్రానిక్ క్రికెట్ వికెట్ వ్యవస్థకు ఆమోదముద్ర వేసింది. 2014 అండర్-19 ప్రపంచకప్‌లో దీనిని తొలిసారి ఐసీసీ ఉపయోగించింది. ఇక ఐపీఎల్‌లో 2016 నుంచి ఈ రకం స్టంప్స్ వినియోగంలోకి వచ్చాయి.

జింగ్ సంస్థ ఆట అవసరాలకు అనుగుణంగా పలు రకాలుగా స్టంప్స్‌ను తయారు చేస్తోంది. ఆయా స్థాయిలను బట్టి వేర్వేరు ధరలు ఉన్నాయి. ఈ స్టంప్స్ ధరల గురించి ఓ ఇంగ్లీష్ పేపర్ రిపోర్టర్ జింగ్ సంస్థకు ఫోన్ చేసిఅడగ్గా.. కంపెనీ సమాధానం చెప్పలేదు కానీ ‘చౌకగా మాత్రం లభించవు’ అని పేర్కొంది. అనంతర కాలంలో జింగ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్, ఈ వికెట్ల రూపకర్త బ్రాంటే ఎకెర్మెన్ మాట్లాడుతూ.. ‘వీటి నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, సెన్సర్లు ప్రతిసారి కచ్చితంగా పనిచేసేట్లు ఉండాలి. మేము వీటిల్లో అన్నిటినీ పలు మార్లు పరీక్షించి స్టంప్స్ తయారు చేస్తాము. అందుకే కచ్చితంగా చౌకగా రావు’ అని పేర్కొన్నారు. ఇక ఈ స్టంప్స్ కోసం జింగ్ సంస్థకు బీసీసీఐ ఎంత చెల్లించిందన్నది కూడా ఎవరికీ తెలియదు.

సాధారణంగా ప్రొఫెషనల్ క్రికెట్‌లో వాడే వికెట్ సెట్ ధర 40 వేల డాలర్లు ఉంటుందని జింగ్ కంపెనీ వర్గాలు తెలిపాయి. అదే స్థానిక క్రికెట్‌లకు వాడే సెట్ ధరలు అయితే కొన్ని వేలల్లోనే ఉంటాయి. కానీ, ఈ రెండింటి నాణ్యత వేర్వేరుగా ఉంటుందంట. ఇకపోతే బీసీసీఐ సహా ప్రపంచ వ్యాప్తంగా పలు బోర్డులకు జింగ్ సంస్థ నుంచి నేరుగా వికెట్లను కొనుగోలు చేయకుండా కేవలం అద్దెకు మాత్రమే తీసుకొనే అవకాశం ఎక్కువగా ఉంది.

గతంలో క్రికెట్ మ్యాచ్ గెలవగానే క్రీడాకారులు జ్ఞాపకం కోసం మ్యాచ్‌లో స్టంప్స్‌ను తీసుకొనేవారు. కానీ, ఇప్పుడు అది సాధ్యం కాదు. 2015 ప్రపంచకప్ మ్యాచ్‌లో ధోని సారథ్యంలో భారత్ సేన పాకిస్థాన్‌ను ఓడించింది. ఆ తర్వాత భారత సారథి ధోని తన అలవాటు ప్రకారం వికెట్‌ను తీసుకొంటుండగా అంపైర్ ఇయాన్ గౌల్డ్ అడ్డుకొన్నాడు. దీంతో మ్యాచ్ అనంతరం క్రీడాకారులు స్టంప్స్‌ను తీసుకోవడం అనేది క్రికెట్‌లో ఓ చరిత్రగా మిగిలిపోయిందన్నది స్పష్టమైంది.





























