- Telugu News Photo Gallery Cricket photos Ambati rayudu birthday former indian batsman chennai super kings born on this day
టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?
Team India: 16 సంవత్సరాల వయస్సులోనే భారతదేశంలో గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతాడని అందరూ అంచనా వేశారు. అయితే ఆ అంచనాలు తలక్రిందులు అయ్యాయి...
Updated on: Sep 23, 2021 | 1:53 PM

16 సంవత్సరాల వయస్సులోనే భారతదేశంలో గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతాడని అందరూ అంచనా వేశారు. అయితే ఆ అంచనాలు తలక్రిందులు అయ్యాయి. అంపైర్లు, కోచ్‌లతో గొడవ, కోపాన్ని నియంత్రించుకోలేకపోవడంతో జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. 27 సంవత్సరాల వయస్సులో ఇంటర్నేషనల్ కెరీర్‌ను ప్రారంభించాడు. దురదృష్టవశాత్తు 2019లో వరల్డ్‌కప్ ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. బీసీసీఐపై తిరగబడ్డాడు. అర్ధాంతరంగా కెరీర్‌ను ముగించాడు. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరో కాదు అంబటి రాయుడు. ఈరోజు రాయుడు పుట్టినరోజు.. ఒకసారి అతడి కెరీర్ గురించి పరిశీలిస్తే..

డొమెస్టిక్ క్రికెట్‌లో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ జట్లకు అంబటి రాయుడు ప్రాతినిధ్యం వహించాడు. అండర్-19 క్రికెట్‌లో కూడా రాయుడు సందడి చేశాడు. 2002లో ఇంగ్లాండ్ పర్యటనలో అతడు 177 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ సమయంలో రాయుడు ఖచ్చితంగా భారతదేశానికి గొప్ప బ్యాట్స్‌మెన్ అవుతాడని అందరూ అనుకున్నారు. దానిని నిజంగా చేస్తే.. ఓ రంజీ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ చేసి అదరగొట్టాడు.

అంబటి రాయుడు నాయకత్వంలో 2004 అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అయితే అప్పటి నుంచి రాయుడు కెరీర్‌లో కాంట్రవర్సీలు మొదలయ్యాయి. రంజీ ట్రోఫీలో పేలవ ప్రదర్శన అనంతరం హైదరాబాద్ కోచ్ రాజేష్ యాదవ్‌తో గొడవ.. ఆ తర్వాత అంపైర్లతో వాగ్వాదం.. అప్పుడే బీసీసీఐ అతడిపై నిషేధం విధించింది.

2009లో మళ్లీ రాయుడు రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగాడు. 2010 సీజన్‌లో 356 పరుగులు, 2011లో 395 పరుగులు చేసి అదరగొట్టాడు. ఈ విధంగా ముంబై జట్టులో కీలక బ్యాట్స్‌మెన్‌గా మారాడు. ఇక 2018లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చిన రాయుడు.. అద్భుతాలు సృష్టించాడు.. ఆ సీజన్‌లో 600కి పైగా పరుగులు చేసి ఫినిషర్ రోల్‌ను పోషించాడు.

27 సంవత్సరాల వయస్సులో రాయుడు టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. జింబాబ్వేతో తొలి వన్డేలో 63 పరుగులు చేశాడు. దీనితో అరంగేట్రంలోనే అర్ధ సెంచరీ సాధించిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. 2014లో రాయుడు శ్రీలంకపై తొలి సెంచరీ నమోదు చేశాడు. 2015 వరల్డ్ కప్ టైంలో తుది జట్టులో చోటు సంపాదించాడు. అయితే ఒక్క మ్యాచ్ ఆడేందుకు కూడా అవకాశం దక్కలేదు.

ఇక 2019 ప్రపంచ కప్ జట్టుకు రాయుడు ఎంపిక కాకపోవడంతో పెద్ద వివాదం చోటు చేసుకుంది. రాయుడు అసంతృప్తితో బీసీసీఐపై తిరుగుబాటు చేశాడు. తద్వారా కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు. ప్రస్తుతం ఐపీఎల్, డొమెస్టిక్ క్రికెట్‌లో ఆడుతున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 55 వన్డేల్లో ఆడిన రాయుడు 47. 05 సగటుతో 1694 పరుగులు. ఇందులో మూడు సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి.





























