- Telugu News Photo Gallery Cinema photos Tollywood biggies like Jamuna, K Vishwanath , Krishna, krishnam Raju ,Chalapathy Rao have passed away in last 5 months
Tollywood: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు.. ఐదు మాసాల్లో ఐదుగురు దిగ్గజాలను కోల్పోయిన కళామతల్లి
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వరస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ నటనతో ప్రతిభతో వెండి తెరని కొన్ని దశాబ్దాలపాటు ఏలిన నట దిగ్గజాలను తెలుగు కళామతల్లి కోల్పోతూనే ఉంది. ఇటీవల వెండి తెర సత్యభామ మృతి చెందగా.. దర్శకుడు సాగర్ మరణించి 24 గంటలు కాకముందే మరో దర్శక దిగ్గజాన్ని కోల్పోయింది టాలీవుడ్.
Updated on: Feb 03, 2023 | 10:56 AM

గత కొన్ని నెలల నుంచి లెజెండరీ నటుల వరస మరణాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. 2022 సెప్టెంబర్ లో రెబల్ స్టార్ కృష్ణంరాజు, నవంబర్ నెలలో సూపర్ స్టార్ కృష్ణ , డిసెంబర్ నెలలో రోజుల తేడాలో సత్యనారాయణ, చలపతిరావు మరణించారు. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టిన తర్వాత కూడా ఈ విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరిలో సీనియర్ హీరోయిన్ జమున మరణించగా.. ఫిబ్రవరిలో దర్శకుడు సాగర్, కె విశ్వనాథ్ లు దివికేగారు.

కళాతపస్వి కె. విశ్వనాధ్ ఫిబ్రవరి 2వ తేదీ గురువారం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 92 ఏళ్ల విశ్వనాథ్ గత కొంతకాలంగా అనారోగ్యాలతో సతమతమవుతున్నారు. గురువారం ఆరోగ్యం మరింతగా క్షీణించటంతో… అపోలో హాస్పిటల్ కి తరలించి చికిత్సనందించారు. పరిస్థితి విషమించి మరణించారు. విశ్వనాధ్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

తెలుగు సినీ చరిత్రలో సంచన హీరో సూపర్‌స్టార్ కృష్ణ గత ఏడాది నవంబర్ 15వ తేదీ కోట్లాది అభిమానులను శోక సంద్రంలో ముంచుతూ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. నటుడి, దర్శకుడు, నిర్మాతగా టాలీవుడ్ లో సంచలనం కృష్ణ. తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడు.. సినిమాలతో ఎన్నో ప్రయోగాలు చేసిన సాహసి ఘట్టమనేని శివరామ కృష్ణ.

హీరోగా మొదలు పెట్టి.. ఆ పై విలన్ గా మారి.. ఆపై హీరోగా ప్రత్యేకమైన మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు.. 2022 సెప్టెంబర్ 11న తుది శ్వాస విడిచారు. తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

తన తరం హీరోలతో సమానంగా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన సత్యనారాయణ కూడా 2022 డిసెంబర్ 22వ తేదీన కన్నుమూశారు. మహానటుడు ఎస్వీరంగారావు నట వారసుడిగా తెలుగుతెరపై ఖ్యాతిగాంచిన నవరస నటనా సార్వభౌముడు సత్యనారాయణ మరణంతో టాలీవుడ్ స్వర్ణయుగ చరిత్రలో ఒక శకం ముగిసినట్లు అయింది.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో సీనియర్ నటుడు, నిర్మాత చలపతిరావుని కూడా టాలీవుడ్ కోల్పోయింది. 1200కు పైగా సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించిన చలపతి రావు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో చాలాకాలంగా నటనకు దూరంగా ఉన్న చలపతిరావు 2022 డిసెంబర్ 25న కన్నుమూశారు.

తెలుగు తెర సత్యభామ సీనియర్ నటి జమున 2023 జనవరి 27న తుది శ్వాస విడిచారు. జమున తెలుగు, తమిళ, కన్నడ, హిందీ మూవీల్లో నటించారు. 16 ఏళ్ళ వయసులో 1953లో పుట్టిల్లు మూవీతో వెండి తెరపై అడుగు పెట్టిన జమునకు మిస్సమ్మ సినిమా పేరు తెచ్చింది. సత్యభామ పాత్రలో జమున తన నటనతో అలరించారు.

సీనియర్ దర్శకుడు సాగర్ (70) ఫిబ్రవరి 2వ తేదీ 2023న కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నసాగర్ చెన్నైలో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఎడిటింగ్ గా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన సాగర్.. 'రాకాసి లోయ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు.




